రికార్డు సమయంలో ‘మిడ్‌ మానేరు’

10 Jun, 2017 03:29 IST|Sakshi
రికార్డు సమయంలో ‘మిడ్‌ మానేరు’
ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులకు హరీశ్‌ కితాబు
 
సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను అధికారులు కేవలం ఏడాదిలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రాజెక్టు పూర్తికి ఇంజనీర్లు చేసిన కృషిని అభినందించారు. శుక్రవారం మిడ్‌మానేరు ప్రాజెక్టు పురోగతిపై మంత్రి సమీక్షించారు. ‘‘2006లో ప్రారంభమైన మిడ్‌మానేరు పనులు పదేళ్లలో కేవలం 50 శాతమే జరగ్గా మిగతా 50శాతం 12 నెలల రికార్డు సమయంలో పూర్తిచేశారు. ప్రాజెక్టులో మొత్తం కాంక్రీటు పనులు 4.8 లక్షల క్యూబిక్‌ మీటర్లుకాగా పదేళ్లలో 65 వేల 200క్యూబిక్‌ మీటర్లు పని చేశారు.

తెలంగాణ వచ్చాక 3.49లక్షల క్యూబిక్‌మీటర్ల పనులు జరిగాయి. పన్నెండు నెలల్లో 1.3లక్షల క్యూబిక్‌మీటర్ల పనులు జరిగాయి. రూ.639 కోట్ల ప్రాజెక్టు అం చనా వ్యయంలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు దాదాపు 11 ఏళ్లలో రూ.107కోట్ల ఖర్చు జరగ్గా కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.358 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో రూ. 251 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే 1.28 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు జరగాల్సి ఉండగా మూడేళ్లలో 80లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగాయి. గత 12 నెలల్లో 59 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేపట్టారు. అంతకుముందు పదేళ్లలో జరిగింది 41 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులే’’ అని హరీశ్‌ వివరించారు.
 
ఆర్‌అండ్‌ఆర్‌కు ప్రాధాన్యమివ్వండి 
మిడ్‌ మానేరు ప్రాజెక్టును రికార్డు వ్యవధిలో పూర్తిచేసినా ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ దగ్గర భూ నిర్వాసితుల పరిహారం, పునరావాస చర్యల కోసం రూ. 30 కోట్ల నిధులు కేటాయించామన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన నిర్వాసితుల పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ముంపునకు గురయ్యే చింతల్‌ ఠాణా, కోదురుపాక, శాబా సుపల్లి, కొడిముంజ, చీర్లవంచ, అనుపురం, ఆరేపల్లి, సంకేపల్లి, రుద్రవరం, వరదవెల్లి గ్రామాల నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణమే పూర్తి చేయాలన్నారు.  సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, రాజన్న జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌ ఓఎస్డీ దేశ్‌పాండే పాల్గొన్నారు. కాగా, ఈ వానాకాలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలను సాగులోకి తేవాలని హరీశ్‌రావు ఆదేశించారు. పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల పనులను వేగవంతం చేయాలని ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలో సూచించారు.  
మరిన్ని వార్తలు