కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

23 Apr, 2016 02:29 IST|Sakshi

♦ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు: కడియం
♦ ఈసారి అడ్మిషన్లలో విద్యార్థుల ఆధార్ తీసుకుంటాం
♦ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తాం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాది ఉచితంగా పుస్తకాలు అందించడం, ఎలాంటి ఫీజుల్లేకుండా చూడడం ద్వారా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య 20 శాతం పెరిగిందన్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేయనున్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈసారి ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రవేశాల సమయంలో ఆధార్ నంబరును తప్పనిసరిగా తీసుకుంటామన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు పక్కా భవనాలు, తాగునీరు, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గతేడాది రూ. 201 కోట్లతో కాలేజీలకు సొంత భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. ఇంకా 15 కాలేజీలకు పక్కా భవనాలు లేవన్నారు. వాటికి జిల్లా కలెక్టర్లు స్థలాలు చూపిస్తే వెంటనే నిర్మాణాలు చేపడతామన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డులో 22 రకాల సేవలను ఆన్‌లైన్ చేశామన్నారు. పైరవీలకు, అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌లు, లైబ్రరీలు లేవని వాటికోసం ఈసారి ప్రణాళిక బడ్జెట్‌లో రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పరికరాల కొనుగోలు కోసం మరో రూ.10 కోట్లు కేటాయించామన్నారు. కంప్యూటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, ఇతరాలకు రూ.2 కోట్లు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రూపొందించిన ప్రచార కేలండర్, పోస్టర్‌ను కడియం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి బాబురావు తదితరులు పాల్గొన్నారు.

 వేసవిలో ప్రైవేటులో శిక్షణకు ఓకే!
 ఎంసెట్, ఐఐటీ కోసం ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో శిక్షణ పొందుతున్న వారికి ఈ వేసవి సెలవుల్లోనూ శిక్షణ కొనసాగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు, కాలేజీల విజ్ఞప్తి ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో నిర్ధారించిన దాని కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే ప్రస్తుతం కాలేజీల్లో వసతులు, ఇతరత్రా అంశాలపై తనిఖీలను కొనసాగిస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో ద్వితీయ సంవత్సర తరగతులను కొనసాగిస్తే చర్యలు చేపడతామన్నారు.

ప్రైవేటు కాలేజీలు ఫీజులు సరిపోవడం లేదని అడిగినందునే కమిటీ వేశామన్నారు. పాలిసెట్, టెట్, ఎంసెట్, పోలీసు కానిస్టేబుల్ పరీక్షలకు సహకరించాలని యాజమాన్యాలకు సూచించామని, లేకపోతే నష్టం జరుగుతుందని చెప్పినందునే ఒప్పుకున్నారన్నారు. పోలీసు తనిఖీలను ఆపే విషయంలో తాను ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. డిగ్రీ ఫీజుల ఖరారుకు ఏఎఫ్‌ఆర్‌సీ తరహాలో కొత్త సంస్థ ఏర్పాటు ఆలోచన చేయలేదన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా 50 శాతం మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని భావిస్తున్నట్టు కడియం తెలిపారు. విద్యార్థులు రావాలన్న బలవంతం లేదని, భోజనం కావాలనుకునే వారే రావొచ్చన్నారు. పేదల కోసమే తాము ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు