ఫ్యామిలీ బడ్జెట్‌

11 Jul, 2014 00:34 IST|Sakshi
ఫ్యామిలీ బడ్జెట్‌

ఇంటి బడ్జెట్‌ ను నిర్వహించే గృహిణుల ముందు ఎంతటి ఆర్థిక మంత్రులైనా బలాదూరే!
 

ప్రభుత్వ బడ్జెట్‌లో విశేషంఏముంటుంది? ముందుగా ఖర్చుల చిట్టా తయారు చేసుకోవడం, దానికి తగ్గ ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రజల ‘పన్ను’లూడగొట్టడం తప్ప! ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వానికి సుంకాల వంటి వంకలు చాలానే ఉంటాయి. సామాన్యుల బడ్జెట్ అలా కాదు కదా! ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులకు కత్తెర వేసుకోవాలి. సర్కారు వారి దయ వల్ల ‘ప్రత్యక్షం’గా.. ‘పరోక్షం’గా ‘పన్ను’పోటును పంటి బిగువున భరించాలి.

నిత్యావసరాల ‘ధరా’ఘాతానికి విలవిల్లాడుతూనే బతుకు బండిని నెట్టుకు రావాలి. సంసారమంటే అంతటితోనే సరిపోతుందా? కానే కాదు! ఎప్పటికప్పుడు వచ్చిపడే అవసరాలుంటాయి, ఆపదలు ఉంటాయి. అనుకోకుండా జబ్బుచేస్తే చాలు, డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోతుంది. నెలాఖరుకి చేతిలో చిల్లిగవ్వ మిగలడమే గగనం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇంటిని నడిపేందుకు గృహిణులు అక్షరాలా ‘ఫ్యామిలీ సర్కస్’ చేస్తున్నారు.
 
మిడిల్‌క్లాస్ పిసినారులం..
నా పేరు ప్రమీల. ఎస్సార్ నగర్‌లో ఉంటాం. మొన్న నాగార్జున ఇంటర్వ్యూలో నెలకు నాలుగు వేలు సంపాదించేవారు కూడా ఉన్నారట అని బాధపడటం చూశాను. మా అబ్బాయికి నాలుగు వేలే వస్తాయి. వాడికి పెళ్లయ్యింది. పిల్లలు. నేనూ. అందరం కలసి సొంతింట్లో ఉంటాం. కానీ నాలుగు వేలతో బతగ్గలమా? నేను స్కూల్ టీచర్‌గా పని చేస్తూ ఆరు వేలు తెస్తున్నాను. చిన్న పోర్షన్ అద్దెకిస్తే మూడువేలు వస్తున్నాయి. అంతా కలిపి పదిహేను వేలు కూడా కావు. కానీ మాకు కనీసం పదిహేను వేలు కావాలి.  సరుకులకు ఐదారు వేలు. కాయగూరలకు మూడు వేలు. పాలకు 1,500, కరెంటు బిల్లు 1,500, పేపరు కేబులూ.. మంచినీళ్లు కూడా కొనుక్కోవాలి. అదో  500. మా అబ్బాయికి, నాకు పెట్రోలు ఖర్చు ఐదారువేలు దాటుతోంది. పైగా నేను ఆస్తమా పేషెంటుని.
 
నెలకు వెయ్యి ఖర్చు చేయకపోతే ఊపిరాడదు. ఇక పిల్లలకు జ్వరం, జలుబు అంటే నాలుగైదు వందలు పోతాయి. ఇవి కాకుండా పండుగలు, బంధువులు వస్తే గుడ్లు తేలేయాల్సిందే. సినిమాలకు, షికార్లకు వెళ్లకుండా ప్రతి రూపాయిని అత్యవసరానికి ఖర్చు పెట్టుకుంటూ మహా పిసినారుల్లా బండిలాగాల్సి వస్తోంది. లేదంటే ఏడాది తిరిగే లోపు ఇంటి ఖర్చులకే లక్షల అప్పులు చేసి అవి తీర్చలేక జబ్బులు తెచ్చుకుంటున్నవారున్నారు. ఆడవాళ్లు ప్రతి ఒక్క ఖర్చు దగ్గరా మగవారితో పోట్లాడుతూ ఇంటిని రావణకాష్టం చేసుకోవడం కూడా చూస్తున్నాను. ఇవి బతుకులా అండీ.. ఎప్పటికి మనం బాగుపడగలం. బంధువుల్ని ఇంటికి రాకుండా ఆపగలమేమో .. చెప్పా పెట్టకుండా వచ్చే రోగాల్ని ఆపగలమా? జాలి, కనికరం లేకుండా గుంజే డాక్టర్లను మార్చగలమా. ఏదో బతికేస్తున్నాం కానీ.. నా మటుకు ఇది పెద్ద వండరేనండీ. ప్రభుత్వాలు మన చేత చేయిస్తున్న సర్కస్ ఇది.

 - ప్రమీల, టీచర్, ఎస్సార్ నగర్
 
ఇవాళ జీతమొస్తే...  నిన్నే అయిపోతుందండీ

చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుందండీ. ఐదు వేలంటే.. అదొక జీతమా అండీ? ఎన్నిసార్లు లెక్కెట్టినా ఐదే ఉండే ఆ వెయ్యి కాగితాల్ని చూసి ఒక్కోసారి ఏడుపొచ్చేస్తదండీ. మా ఆయన వాచ్‌మెన్ అండీ.  మాదాపూర్ అయ్యప్పకాలనీలో అపార్ట్‌మెంట్‌లోనండీ. అందులోనే మాకో గదిచ్చారు. నేనూ మా ఆయన. మాకిద్దరు ఆడపిల్లలండీ. ఒకదానికి పెళ్లయ్యిందండీ. ఇంకోదానికి ఎప్పుడూ ఒళ్లు బాగోదండీ.  మా ఆయన ఐదు సంపాదిస్తాడు. అదే మూలకండీ?  నేనూ ఒళ్లొంచి నాలుగిళ్లలో పని చేసి ఒక మూడు వేలు సంపాదిస్తానండీ.

అంటే మొత్తం ఎనిమిది. వాచ్‌మెన్ గాబట్టి ఇంటద్దె, కరెంటు లేకపోయినా మిగతావన్నీ ఆ ఎనిమిదితోనే సరిపెట్టుకోవాలండీ. కానీ ఎలాగండీ? బ్రహ్మదేవుడిక్కూడా సాధ్యపడదండీ.  ఇంటి సరుకులకే మూడు వేలా? కాయగూరలకు వెయ్యి. ఆసుపత్రికి నెలకీ, రెండు నెలలకీ వెయ్యో.. రెండు వేలో దోసిట్లో పోసి రావలసిందే కదండీ. ఇంక ఎవరైనా చుట్టాలొస్తే చికెనో మటనో అంటారు. ఏమున్నా లేకపోయినా మర్యాదలు తప్పవు కదండీ. అదో ఖర్చు. పెళ్లి చేసి పంపాక చేతులు దులుపుకున్నట్టు కాదుగదండీ.
 
 ఆడపిల్ల అమ్మగారింటికి రాకుండా ఎట్టా కుదురుద్దండీ? అప్పుడప్పుడు మా పెద్దమ్మాయి వస్తూపోతుండాల్సిందే. మనమరాలికి అంతో ఇంతో ఖర్చు పెట్టాల్సిందే. ఆ మధ్యన ఊరి నుంచి చుట్టాలొచ్చి సిన్మాకెల్దాం అన్నారు. మనింటికొచ్చిన చుట్టాలతోటి మనం టికెట్టు పెట్టిస్తామా? అయ్యో.. వొదినా ఈ ఊళ్లో టికెట్లు మూడ్రోజుల ముందే ఇచ్చేస్తారు అని తప్పించుకున్నామండీ. అసలు మాటేమిటంటే అండీ.. ఈ బతుకులో సినిమా సాధ్యమా అండీ. ఊరుగాని ఊళ్లో బతుకుతున్నాం. సొంత ఊరి నుంచి ఎప్పుడు ఏ కబురొస్తుందో అని ఎప్పుడూ ఒకే దడండీ. ఒక మంచికైనా.. ఒక చెడ్డకైనా పోవాల్సిందే కదా. పోవాలంటే ఎవరి దగ్గరైనా చార్జీలకు చేయి సాపాల్సిందే కదా.  ఆదాయం  పది రూపాయలు పెరిగితే .. ఖర్చులు పాతిక రూపాయలు పెరుగుతున్నాయి. పోనీ ఈ పని కాదు ఇంకో పని చేసుకుందాం అంటే.. బయట అద్దెలు చూశారు గదండీ. అవి అద్దెలు కాదండీ మాలాంటోళ్లని మింగేసే అగ్గిగుండాలు. ఇదండీ మా బతుకు. ఎవరితో చెప్పుకుంటామండీ. మీతో చెప్పుకుందామంటే మీకేమైనా తక్కువ బాదుంటాదా అండీ!

 - లక్ష్మి, వాచ్‌మెన్ భార్య, మాదాపూర్
 
మినిమమ్ 25 థౌజండ్స్
ఈ సిటీలో ఓ సామాన్యుడు అప్పు లేకుండా బతకాలంటే  తక్కువలో తక్కువ పాతికవేలు కావాలి. అంతకు తక్కువ సంపాదిస్తున్నాడంటే అతడు అశాంతితో ఉన్నాడనే. నేను చూస్తున్నాను కదా.. మా ఇంట్లో ఎంత జాగ్రత్తగా చేసినా నెలకు పాతిక  వేలు అవుతోంది. నా పేరు సునంద. క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాను. భర్త చనిపోయాడు.  ఈ మధ్యనే కోడలు కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలు, మనవలతో ఇంట్లో ఐదుగురం ఉంటాం. ఇంటి అద్దె ఆరువేల రూపాయలు. రేషన్ పది వేలవరకూ అవుతుంది. కాయగూరలు మూడు వేలు, కరెంటు బిల్లు రెండు వేల రూపాయలు. పాలకు 1,500. పేపరు, కేబుల్, వాటర్ బిల్లులు 600 వరకూ ఉంటాయి. జ్వరం, జలుబులైతే నెలకు ఐదారొందలవుతుంది.
 
ఏదైనా చిన్న చిన్న వైద్యాల అవసరం పడిందంటే నెలకు రెండు మూడు వేలకు పైగా ఆసుపత్రి ఖర్చు ఉంటుంది. ఇవి కాకుండా పండుగలపుడు, బంధువులొచ్చినపుడు ఖర్చు నాలుగైదు వేలకు తక్కువవదు. మా ఇంట్లో సినిమాలకు, షికార్లకు పెద్దగా వెళ్లం కాబట్టి సరిపోతుంది. లేదంటే వాటి బిల్లులు కూడా తక్కువగా లేవు. మా పక్కింటివారు ఎప్పుడు ఐమాక్స్ వెళ్లొచ్చినా వెయ్యి నుంచి పదిహేను వందలవుతుందని చెబుతుంటారు. ఇక ఏడాదికి నాలుగైదు సార్లయినా షాపింగ్ తప్పదు. అలాంటివాటికి పొదుపు చేసిన డబ్బునే వాడుతుంటాం. ఒక్కోసారి బడ్జెట్ దాటితే మాత్రం వచ్చే నెల లోటు బడ్జెట్‌కి సిద్ధపడాలి.
 
- సునంద, క్యాటరర్, సనత్‌నగర్.
 
రెండు పదుల పేదవాడు...

మొన్నటివరకూ పాతికవేల జీతమంటే ఉన్నవాడి కింద జమకట్టేవారు. ఇప్పుడది పేదవాడి బడ్జెట్‌గా మారిపోవడం చూస్తుంటే.. భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని భయమేస్తుంది. భర్త చేతినిండా సంపాదిస్తున్నా.. ఇచ్చిన రూపాయిని ఎలా ఖర్చుపెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియక అయోమయంలో పడుతున్న మహిళల ఇబ్బంది గురించి నాకు బాగా తెలుసు. నేను సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. ఇంటి సరుకులు స్వయంగా వెళ్లి కొనుక్కుంటాను. వంట సరుకులకు ఒకో నెల పదివేలవుతుంది. ఉన్నట్టుండి బిల్లు పదిహేనువేలు వస్తుంది. చెప్పాపెట్టకుండా..  పెరిగే ధరలు మాకే ఇబ్బంది కలిగిస్తే.. సామాన్య మహిళల సంగతేంగాను. ఆ మధ్యనెవరో చెప్పారు.. ఉల్లిపాయల ధర పెరిగినపుడు ఉల్లివాడటం తగ్గించేస్తే సరి అని.
 
నాకు నిజమేననిపించింది. అంతకంటే ఏం చేయగలం. ఉల్లిపాయ లేకుండా కూరలు వండితే వచ్చే నష్టమేమీ లేదు కదా! ధరలను ఎలాగూ నియంత్రించలేం. కనీసం ఖర్చుల్లోనైనా రూపాయి, రెండు రూపాయలు మిగుల్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. చీటికీ మాటికీ ఆస్పత్రి బాటపట్టకుండా పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అకస్మాత్తుగా వచ్చే జబ్బులు వస్తూనే ఉంటాయి. పెద్ద జబ్బుల వైద్యం ఖర్చు భరించే శక్తి సామాన్యులకు కాదు కదా.. ఓ మోస్తరువారు కూడా తట్టుకోలేకపోతున్నారు. పేదలు, సామాన్యుల వైద్యం కోసం, ఆహారం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. పేదవాడికి మిగిలేది అర్ధాకలి, అర్ధాయుష్షు! విద్యను కూడా లక్షలు పోసి కొనుక్కునే పరిస్థితి పేదవాడ్ని మరింత కుంగదీస్తోంది.     

 - జయసుధ, మాజీ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు