ప్రైమరీ స్థాయిలో మినీ గురుకులాలు!

25 Jan, 2018 02:01 IST|Sakshi

సంక్షేమ శాఖల ప్రతిపాదన 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలలు ఐదో తరగతి స్థాయి నుంచి మొదలవుతున్నాయి. నాలుగో తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు, గురుకుల ప్రవేశ పరీక్షలు రాసి ఐదో తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో అడ్మిషన్లు పొందుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన స్కూళ్ల నుంచి వచ్చినవారు, పట్టణ ప్రాంతాల విద్యార్థులు ముందుకు వెళ్తుండగా... గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రం మిగిలిన వారితో పోటీ పడలేకపోతున్నారు. ఇది టీచర్లకు కొన్ని ఇబ్బందులు తెస్తోంది. దీంతో ప్రాథమిక స్థాయి నుంచే గురుకుల విద్యను ప్రవేశపెడితే విద్యార్థులు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే మినీ గురుకులాల పేరిట కొత్త విద్యా సంస్థల్ని ప్రారంభించాలని యోచిస్తోంది. వీటిని ప్రస్తుత గురుకులాలకు అనుసంధానంగా నిర్వహించాలనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.  

29 మినీ గురుకులాలు
ప్రస్తుతం గిరిజన అభివృద్ధి శాఖ పరిధిలో మినీ గురుకులాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మినీ గురుకులాల్లో 5వేల మంది పిల్లలున్నారు. మినీ గురుకులాల్లో చదివి, అనంతరం సాధారణ గురుకులాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో వాటి సంఖ్యను పెంచాలని గిరిజన అభివృద్ధి శాఖ యోచిస్తోంది. అన్ని సంక్షేమ శాఖల పరిధిలో వీటిని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఎస్సీ అభివృద్ధి శాఖ సైతం ఈ తరహా పాఠశాలల ఏర్పాటుపై ఇటీవల పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొత్తగా రూపొందించే బడ్జెట్‌లో మినీ గురుకులాల అంశాన్ని ప్రతిపాదించేందుకు ఆయా సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వచ్చే ఏడాది నుంచే మినీ గురుకులాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు