అటూ ఇటూ భక్తాద్రి.. నడుమ యాదాద్రి

7 Sep, 2017 02:32 IST|Sakshi
అటూ ఇటూ భక్తాద్రి.. నడుమ యాదాద్రి
యాదాద్రిలో భక్తుల వసతికి గుట్టపై మినీ పట్టణం
- 940 ఎకరాల్లో ఏర్పాట్లు.. వీఐపీ అతిథుల కోసం మరో గుట్ట
వందల్లో కాటేజీలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఉద్యానవనాలు
రెండు మూడేళ్లలో సర్వాంగ సుందరంగా ముస్తాబు
వచ్చే మార్చిలో బ్రహ్మోత్సవాలకల్లా ప్రధాన ఆలయం సిద్ధం
4 మాడవీధులు, 7 గోపురాలు, ప్రధాన మండపంతో కనువిందు
 
సాక్షి, హైదరాబాద్‌: నీవుండేదా కొండపై నా స్వామి... నేనుండేదీ నేలపై అంటూ ఓ భక్తుడు అప్పుడెప్పుడో పాడుకున్నాడు. కానీ.. యాదగిరీశుడి సన్నిధిలో ‘నీవుండేదా కొండపై నా స్వామి.. నేనుండేదీ కొండపై..’ అని భక్తులు పాడుకోనున్నారు! యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఓ కొండపై కొలువుదీరితే, స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు మరో రెండు గుట్టలపై ఉండనున్నారు. తొమ్మిది గుట్టలతో యాదాద్రి క్షేత్రం అభివృద్ధి చెందనుండటం తెలిసిందే. వాటిలో రెండింటిని భక్తుల వసతి గృహాలకు కేటాయించారు.

ఈ రెండింటిలో పెద్ద గుట్టపై భారీ పట్టణమే వెలవనుంది. నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అవి పూర్తయ్యేందుకు మరో రెండుమూడేళ్లు పట్టే అవకాశముంది. ప్రధానాలయ ప్రాంగణం వచ్చే మార్చి నాటికి సిద్ధమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే జరిగితే మార్చిలో స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి ప్రధానాలయం కొత్త రూపుతో భక్తులను మంత్రముగ్ధులను చేయనుంది. 4 మాడ వీధులు, 7 గోపురాలు, విమానగోపురం, ప్రధాన మండపం సిద్ధమయ్యేలా పనులు జరుగుతున్నాయి. రూ.1,900 కోట్లు అవసరమని భావిస్తున్న ఈ పనుల్లో రూ.300 కోట్ల వ్యయంతో తొలి దశ సిద్ధమవుతోంది.
 
తొమ్మిది గుట్టల్లో రెండు భక్తులకే
యాదగిరీశుడు వెలిసిన గుట్టకు చుట్టూ ఉన్న గిరులను ప్రత్యేక ఇతివృత్తాలతో అభివృద్ధి చేయబోతున్నారు. రెండు గుట్టలను భక్తుల విడిది కేంద్రాల పనులు మొదలయ్యాయి. ఒక గుట్టను రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, ఇతర ప్రముఖులకు కేటాయించారు. మరో గుట్టను ఖరీదైన భక్తులుండే కాటేజీల నిర్మాణానికి కేటాయించారు. వీవీఐపీల వసతి గృహాలు నిర్మించే గుట్టపై 13.25 ఎకరాల స్థలమే ఉంది. మరో గుట్టపై ఏకంగా 945 ఎకరాల్లో కాటేజీలు రానున్నాయి. భక్తులుండేందుకు వీలుగా వందలాది కాటేజీలు, హోటళ్లు, ఉద్యానవనాలు, ఆసుపత్రి, శుభకార్యాల నిర్వహణకు కల్యాణ మండపం, పార్కింగ్‌... ఇలా పెద్ద గుట్టపై ఓ పట్టణమే రూపుదిద్దుకోబోతోంది.

తొలి విడతలో 250 ఎకరాల్లో పనులు మొదలుపెట్టారు. రోడ్ల నిర్మాణం, ప్లాటింగ్‌ పూర్తయింది. ప్లాట్లను దాతల కోసం సిద్ధం చేశారు. కాటేజీల నిర్మాణానికి ముందుకొచ్చే దాతలకు ప్లాట్లను కేటాయిస్తారు. ఒక్కోటి నాలుగు పడక గదుల క్వార్టర్లను నిర్మిస్తారు. వాటిని గుట్ట దేవాలయాభివృద్ధి సంస్థ నిర్దేశించిన నమూనాల్లోనే నిర్మించాల్సి ఉంటుంది. లేదంటే ఆ నిధులు అందజేస్తే సంస్థే వాటిని నిర్మిస్తుంది. ఆ కాటేజీలను తిరుమల తరహాలో దాతలకు ఏడాదిలో 30 రోజులు కేటాయిస్తారు. దాతలు, వారు సిఫారసు చేసినవారు ఆయా రోజుల్లో వాటిలో ఉచితంగా ఉండొచ్చు.
 
అద్భుత శిల్పకళతో ప్రధాన క్షేత్రం
లక్ష్మీ నరసింహుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో కొలువుదీరాడు. గత ఏప్రిల్‌లో ప్రధానాలయాన్ని మూసేసి పనులు ప్రారంభించడం తెలిసిందే. ప్రధానాలయం 4.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 2.33 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. తిరుమల తరహాలో ఎత్తయిన ప్రాకారాలతో నాలుగు మాడ వీధులు సిద్ధం చేస్తున్నారు. నాలుగు వైపులా నాలుగు గోపురాలతోపాటు మొత్తం ఏడు గోపురాలు నిర్మిస్తారు. వీటిలో రెండు గోపురాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి బేస్‌మెంట్లు సిద్ధమయ్యాయి. ప్రధాన మండపం, దానిపై ప్రస్తుత శిఖరాన్ని అనుసరిస్తూ కొత్త శిఖరాన్ని నిర్మిస్తారు. స్వామివారు వెలిసిన గుట్ట భాగాన్ని అలాగే ఉంచి దానిపై మండపాన్ని నిర్మిస్తారు. ప్రధానాలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్‌ వాడటం లేదు.

పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్టు యాడా ఉపాధ్యక్షుడు కిషన్‌రావు తెలిపారు. కాకతీయ, విజయనగర  శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా రాతి శిల్పాలు సిద్ధం చేస్తున్నారు. 500 మంది శిల్పులు ఈ పనుల్లో తలమునకలుగా ఉన్నారు. యాదాద్రితోపాటు ఏపీలోని ఆళ్లగడ్డ, మార్టూరు  ప్రాంతాల్లో శిల్పులు వాటిని సిద్ధం చేస్తున్నారు. 12 మంది ఆళ్వార్ల విగ్రహాలతో బృహత్‌ మండపం రూపుదిద్దుకో నుంది. నాలుగు విగ్రహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. 11.9 అడుగుల వెడల్పున్న ఆలయం ఈ భారీ నిర్మాణాలతో 48 అడుగులకు పెరగనుంది. ఎత్తు కూడా రెట్టింపై 48 అడుగులకు చేరుతుంది. దీంతో పైన ఇతర భవనాలేవీ ఉండవు. పార్కింగ్‌ సహా అన్నీ దిగువే ఉంటాయి. దిగువన ఏడు వేల కార్లను పార్క్‌ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 
గుట్ట కిందే గుండం, కల్యాణకట్ట 
స్వామివారికి తలనీలాలు సమర్పించే కల్యాణ కట్ట ప్రస్తుతం క్షేత్రం పక్కనే ఉంది. ఆ పక్కనే గుండం (కోనేరు) ఉంది. భవిష్యత్తులో ఈ రెంటినీ కిందకు మారుస్తారు. ప్రస్తుత గుండం అలాగే ఉంటుంది. స్వామి దీక్షలో ఉన్నవారు అందులో స్నానమాచరించవచ్చు. భక్తుల కోసం దిగువన భారీ కోనేటిని నిర్మిస్తున్నారు. కొండ చుట్టూ 100 అడుగుల సర్క్యులర్‌ రోడ్డు,  గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటవుతున్నాయి. కల్యాణ మండపం, ఆర్టీసీ డిపో, బస్టాండ్, భారీ పార్కింగ్‌ స్థలం, పూజారుల అగ్రహారం, డార్మిటరీ, సాధారణ భక్తుల వసతి గృహ సముదాయాలు, యాగశాల, ప్రవచనశాల, వ్రత మండపం తదితరాలు దిగువన ఏర్పాటు కానున్నాయి.

ఆలయం వద్ద 30 వేల మందికి సరిపడా క్యూలైన్లు సిద్ధం చేస్తారు. గుట్టపైకి ఎక్కేందుకు, దిగేందుకు విడిగా దారులు ఏర్పాటవుతున్నాయి. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిది 108 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటవుతుంది. వచ్చే మార్చి బ్రహోత్సవాల నాటికి ఆలయ పనులు, మరో ఏడాదిన్నర, రెండేళ్లలో మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.  
మరిన్ని వార్తలు