రెండు నెలలకోసారి రాష్ట్రాలకు పరిహారం

24 Dec, 2016 05:18 IST|Sakshi

జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం: ఈటల  
సాక్షి, న్యూఢిల్లీ:
జీఎస్టీ అమలు వల్ల నష్టపోయే రాష్ట్రాలకు రెండు నెలలకోసారి పరిహారం చెల్లించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నష్ట పరిహారం చెల్లింపు అంశాన్ని చట్ట పరిధిలోకి తెచ్చి రెండు నెలలకోసారి ఇచ్చేలా అంగీకారం కుదిరింది. ఇది ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. 2015–16 ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు జీఎస్టీ ఆదాయంలో వృద్ధి 14 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లిస్తారు. రూ.1.5 కోట్ల టర్నోవర్‌ కంటే తక్కువగా ఉన్న వాణిజ్య సంస్థలను రాష్ట్రాల పరిధిలో, ఆపై టర్నోవర్‌ ఉంటే కేంద్ర, రాష్ట్రాల పరిధిలో అజమాయిషీ ఉండాలని కోరాం. దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదు’అని పేర్కొన్నారు. జనవరి 3, 4 తేదీల్లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఉంటుందన్నారు. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 5 శాతం ఉన్నందున కొత్త నోట్లలో కూడా 5 శాతం వాటా ఉండాలని, ఈ లెక్కన రూ.30 వేల కోట్ల కరెన్సీ రావాల్సి ఉందని, ఇప్పటివరకు రూ.20 వేల కోట్లు మాత్రమే వచ్చాయని ఈటల తెలిపారు. మరో రూ.10 వేల కోట్ల కరెన్సీని, అది కూడా చిన్న నోట్ల రూపంలో ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు