న్యాయ సలహా తర్వాతే ముందుకు..

23 Oct, 2016 05:06 IST|Sakshi
న్యాయ సలహా తర్వాతే ముందుకు..

బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
► రెండు గంటల పాటు తీవ్రంగా చర్చ
► న్యాయ కార్యాచరణ దిశగా పరిశీలన
► తీర్పు పర్యవసానాలను వివరించిన హరీశ్‌రావు, అధికారులు
► సాధారణ వర్షాలు కురిసినా నీటికి కటకట తప్పదనే ఆందోళన
► 29న మరోమారు సమావేశం కావాలని నిర్ణయం
► ఆ భేటీకి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌కు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయ సంప్రదింపుల తర్వాతే ముందుకు వెళ్లాలని మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్ణయించింది. ఆ తీర్పు అమలైతే రాష్ట్రానికి కృష్ణా జలాలు రావడం కష్టమేనని.. వర్షాలు సాధారణ స్థాయిలో కురిసినా కూడా నీటికి కటకట తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం చేస్తే ఏం చేయాలన్నదానిపైనా చర్చించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని.. ఆ భేటీకి సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ను ఆహ్వానించి సలహా తీసుకోవాలని నిర్ణయించింది.

బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. సబ్ కమిటీ సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషి, ఈఎన్‌సీ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం, దానిని ఎదుర్కొనే వ్యూహాన్ని సిద్ధం చేసే అంశాలను పరిశీలించారు.

బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్ర రైతుల పరిస్థితి ఏమిటి? సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు కృష్ణా నీరు రాష్ట్రం వరకు వస్తుందా? సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందా? ఒకవేళ రెండు రాష్ట్రాలకే వివాదం పరిమితమైతే రాష్ట్రం లేవనెత్తే అంశాలు ఎలా ఉండాలి? ఏ నిర్ణయం చేస్తే రాష్ట్రానికి లాభం.. అన్న అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశాన్ని పరిశీలించారు. ట్రిబ్యునల్ తీర్పుపై ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని భావించిన సబ్ కమిటీ ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను సంప్రదించాక తుది నిర్ణయానికి రావాలనే భావన వ్యక్తమైంది. ఈ మేరకు ఈ నెల 29న సబ్ కమిటీ భేటీకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది.
 
అన్యాయాన్ని వివరించిన అధికారులు

కృష్ణా జలాల వివాదం, ప్రస్తుత తీర్పు కారణంగా ఏర్పడే ఇబ్బందులను మంత్రి హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు, ఇతర అధికారులు సబ్ కమిటీకి వివరించారు. కొన్నేళ్లుగా కృష్ణా బేసిన్‌లో తీవ్ర నీటి కొరత నెలకొన్న సంగతిని హరీశ్‌రావు గుర్తు చేశారు. నికర జలాలు రావడమే కష్టమైన పరిస్థితుల్లో కొత్త తీర్పు ఇబ్బందికరమేనని స్పష్టం చేశారు. తాజా తీర్పును అనుసరించి మిగులు జలాలు, 65 శాతం డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే... దిగువన ఉన్న తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని విద్యాసాగర్‌రావు వివరించారు.

భారీ వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరందివ్వడం సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం కృష్ణా నది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయని... కొత్త తీర్పు అమల్లోకి వస్తే మరో 254 టీఎంసీలు కలిపి 1,573 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. అదే జరిగితే దిగువన ఉన్న తెలంగాణకు నీటికి కటకట తప్పదన్నారు. అదనంగా కేటాయించిన 254 టీఎంసీలంటే శ్రీశైలం ప్రాజెక్టు నీటి పరిమాణంతో సమానమని... వర్షాలు సరిగా లేని సమయాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తోందని అధికారులు గణాంకాలతో సహా వివరించారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి సరైన వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాయని, అంతకుముందు సాగర్ ఆయకట్టు రైతులు వరుసగా క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రస్తుత వివాదం తెలంగాణ, ఏపీలకే పరిమితమైతే... క్యారీ ఓవర్‌లోని 150 టీఎంసీల జలాలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమల్లో దక్కేవాటాల కోసం రాష్ట్రం పోరాడాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుత తీర్పును మళ్లీ ట్రిబ్యునల్ వద్దే విచారణ కోరడమా, లేక సుప్రీంకోర్టును ఆశ్రయించడమా, ఇప్పటికే వేసిన ఎస్‌ఎల్పీపైనే కొట్లాడడమా.. అన్న అంశాలపై న్యాయవాదులతో చర్చించాక నిర్ణయించాలని సబ్‌కమిటీ అభిప్రాయపడింది.

>
మరిన్ని వార్తలు