మేడిగడ్డతోనే రాష్ట్రం మాగాణ : హరీశ్‌రావు

28 Aug, 2016 02:32 IST|Sakshi
మేడిగడ్డతోనే రాష్ట్రం మాగాణ : హరీశ్‌రావు
► తమ్మిడిహెట్టితో పోలిస్తే అక్కడే నీటి లభ్యత ఎక్కువ
► తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని 
► కేంద్ర జల సంఘమే చెప్పింది
► 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించలేదు 
► రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత ఇదే విషయాన్ని చెప్పింది.. 
► అందుకే ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చి మేడిగడ్డ చేపట్టాం
► మీడియాకు నివేదికల ద్వారా మంత్రి వివరణ
 
 సాక్షి, హైదరాబాద్ : గోదావరి నదిలో 954 టీఎంసీల నీటిని పరీవాహక ఆయకట్టుకు మళ్లించి తెలంగాణ సాగు, తాగు అవసరాలు తీర్చే సంకల్పంతోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేశామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. సాగు, తాగు అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండేలా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లింపు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో 160 టీఎంసీల నీటిని మళ్లించేందుకు తమ్మిడిహెట్టి అనువుగా లేదన్నారు. అలాగే ఈ బ్యారేజీ ఎత్తుతో జరిగే ముంపునకు మహారాష్ట్ర అంగీకరించలేదని, అందువల్లే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. ప్రాణహిత రీ డిజైన్‌పై ప్రతిపక్షాలు, పలు సంఘాలు విమర్శలు చేస్తుండటం, వాటిపై పత్రికల్లో కథనాలు వస్తున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు మీడియా ప్రతినిధులకు శనివారమిక్కడ  వివరణ ఇచ్చారు. నీటి లభ్యత, వ్యయం పెరుగుదల, ముంపు, మహారాష్ట్ర అభ్యంతరాలు, కొత్త ఆయకట్టు తదితర అంశాలపై రెండు గంటల పాటు సమగ్రంగా వివరించారు. వివిధ సందర్భాల్లో మహారాష్ట్ర, ఉమ్మడి ఏపీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన చర్చలు, రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం తదితరాలపై పలు నివేదికలు మీడియాకు అందించారు. ఒక్కో అంశంపై మంత్రి ఏమన్నారో ఆయన మాటల్లోనే..
 
148 మీటర్ల ఎత్తులో 40 టీఎంసీలే
తమ్మిడిహెట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర మొదట్నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ ఎత్తులో 3,786 ఎకరాల ముంపు ఉందని, అందుకు అంగీకరించలేమంటూ 2013 జనవరి 21న తెలంగాణకు మహారాష్ట్ర స్పష్టం చేసింది. అనంత రం 2014 జూలై 23న మంత్రుల స్థాయిలో, 2015 ఫిబ్రవరి 17న సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయి. గోదావరిలో 160 టీఎంసీలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్ చెప్పారు. ముంపును మాత్రం అంగీకరించమని స్పష్టంగా చెప్పారు. కేంద్ర జల సంఘం కూడా 2015 మార్చి 4న తమ్మిడిహెట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని తెలుపుతూ రాష్ట్రానికి లేఖ రాసింది. 152 మీటర్ల ఎత్తులో 75 శాతం డిపెండబులిటీలో 165 టీఎంసీల లభ్యత ఉందని, ఇందులో పైరాష్ట్రాలు 63 టీఎంసీలకు ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నందున మిగిలేది 102 టీఎంసీలే అని చెప్పింది. ఇందులో హైదరాబాద్, గ్రామీణప్రాంతాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 56 టీఎంసీ పక్కనబెడితే మిగిలేది 46 టీఎంసీలే. ఈ నీటితో 16.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సాధ్యమా? ఇక 148 మీటర్ల ఎత్తులో కేవలం 40 టీఎంసీలే లభ్యతగా ఉంటుంది. వాటితో నిర్ణీత అవసరాలు ఎలా తీర్చుకోగలం?
 
16 ఉత్తరాలు రాసినా పట్టించుకోలేదు
తమ్మిడిహెట్టి పూర్తిగా వన్యప్రాణుల అభయారణ్యం ప్రాంతంలో ఉంది. దీన్ని పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం పనులు ఆరంభించింది. ఈ నిర్మాణం పూర్తిగా ఏకపక్షంగా.. మీకు మీరే ఊహించుకొని నిర్మాణ పనులు చేపడుతున్నారని, ఈ పనులు ఫలప్రదం కావంటూ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ 2013 అక్టోబర్ 15న రాష్ట్రానికి లేఖ రాశారు. అంతకుముందు, తర్వాత కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు 16 లేఖలు రాసింది. కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. 2007లో ప్రాజెక్టు ప్రారంభించిన నుంచి 2012 వరకు మహారాష్ట్రంతో ఒక్క సమావేశం నిర్వహించలేదు. 2012లో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తొలి బోర్డు సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత 2013 జనవరి, 2014 మార్చిలో అధికారులు స్థాయిలో చర్చలు జరిగాయి. వారు 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించలేదు. అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో మంత్రిగా ఆరుసార్లు, అధికారులతో ఆరు సమావేశాలు నిర్వహించాం. 152 మీటర్లకు ఒప్పుకోమని, ప్రత్యామ్నాయాలు చేపట్టాలని మరాష్ట్ర సీఎం కోరారు. 148 మీటర్ల ఎత్తులో నీటి లభ్యత లేకపోవడం, అదే మేడిగడ్డ వద్ద లభ్యత ఎక్కువగా ఉండటం, అవసరమైతే భవిష్యత్తులో ఇంద్రావతి నీటిని వాడుకునే వీలుండటంతో మేడిగడ్డను ఫైనల్ చేశాం. దీనిద్వారా 18 లక్షల ఎక రాల కొత్త ఆయకట్టుతోపాటు మరో 18 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించాం.
 
ఏపీలో నిర్మించలేదా?
ప్రాణహిత ప్రాజెక్టుకు కింద నిర్ణయించిన ఆయకట్టుకు నీరివ్వాలంటే 16 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు సరిపోవని 2008 జూలై 22న కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టాలని సూచించింది. అందువల్లే మేం రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 144 టీఎంసీలకు పెంచాం. దీంతో రెండో పంటకు నీరిచ్చే అవకాశం ఉంటుంది. కృత్రిమ ప్రవాహాలపై ఇంతపెద్ద రిజర్వాయర్లు కట్టరాదని అంటున్నారు. కానీ ఏపీలో కండలేరు 68 టీఎంసీ, వెలిగొండ 41 టీఎంసీ, వెలిగోడు 17 టీఎంసీలతో నిర్మించినప్పుడు మల్లన్నసాగర్ 50 టీఎంసీలతో నిర్మిస్తే తప్పేంటి? నల్లగొండలో 2.20 లక్షల ఎకరాలు, మెదక్‌లో 5.50 లక్షలు, నిజాంసాగర్ కింద 2.3 లక్షలు, ఎస్సారెస్పీ పరిధిలోని ఆయకట్టుకు కూడా మల్లన్నసాగర్ ద్వారానే నీరందించాలి. నిజానికి 25 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్‌మానేరు కింద 23 గ్రామాలు, ఎల్లంపల్లి కింద 21 గ్రామాలు ముంపునకు గురికాగా 50 టీఎంసీల మల్లన్నసాగర్ కింద ముంపు గ్రామాలు 8 మాత్రమే!
 
2012 వరకు ఖర్చు రూ.150 కోట్లే
2008లో ప్రాణహిత ప్రాజెక్టు ఆరంభించిన కాంగ్రెస్.. నాలుగేళ్లలో పూర్తి చేస్తామని చెప్పింది. కానీ 2012 నాటికి పూర్తి చేసిన పనుల విలువ కేవలం రూ.150 కోట్లు! మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట మాత్రం రూ.1,481 కోట్లు ఇచ్చేసింది. 2014 వరకు ఖర్చు చేసిన మొత్తం రూ.7,072 కోట్లు ఉన్నా.. అందులో పనుల కోసం చేసిన ఖర్చు రూ.3,680 కోట్లు. భూసేకరణకు రూ.108 కోట్లు, సర్వేలకు రూ.917 కోట్లు, మిగతావి అడ్వాన్సులపై ఖర్చు చేశారు.
 
వ్యయం ఎందుకు పెరిగిందంటే..
రిజర్వాయర్ల సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 144 టీఎంసీలకు పెంచాం. ఆయకట్టును పెంచాం. పంపింగ్ కెపాసిటీ 1.8 టీఎంసీల నుంచి 2 టీఎంసీలకు పెరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను 32 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టాం. 53,500 ఎకరాల భూసేకరణకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పున గతంలో రూ.1,071 కోట్లు అంచనా వేస్తే.. ప్రస్తుతం ఎకరాకు రూ.7 లక్షలు పెంచడంతో వ్యయం రూ.6 వేల కోట్లు పెరిగింది. ఆర్‌అండ్‌ఆర్ వ్యయం రూ.300 కోట్ల నుంచి రూ.1,770 కోట్లు పెరిగింది. విద్యుత్ ఖర్చు రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు, వ్యాట్ 2.5 శాతం నుంచి 3.5 శాతానికి పెరిగింది. ఇన్ని కారణాల వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది.
 
విద్యుత్‌కు ఢోకా లేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా కావాల్సిన విద్యుత్‌ను ఎక్కడ్నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి తెలంగాణలో విద్యుత్‌కు ఢోకా లేదు. జెన్‌కో ద్వారా 5,800 మెగావాట్లు లభ్యతగా ఉండగా, ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ ఒప్పందం ద్వారా వెయ్యి మెగావాట్లు, సోలార్ పవర్ ద్వారా మరో 2,500 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. వీటికితోడు హంగుల్-పలాసా, వార్దా-డిచ్‌పల్లి, వరోరా-వరంగల్ కారిడార్ల ద్వారా మరింత విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. వర్షాకాలంలో కరెంట్ వినియోగం తక్కువ కాబట్టి రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్ దొరుకుతుంది. మొత్తంగా చూస్తే ప్రాజెక్టు వ్యయం ఒక ఎకరాపై రూ.2.35 లక్షలుంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక దాని నిర్వహణ వ్యయం రూ.8 వేల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తాం.
 
జాతీయ హోదా కోసం కొట్లాడతాం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించాం. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానికి విన్నవించారు. మున్ముందూ కొట్లాడతాం. అసెంబ్లీలో మహారాష్ట్ర ఒప్పందంపై జరగాల్సిన చర్చ విషయంలో బీఏసీ భేటీలో నిర్ణయిస్తాం.
 
>
మరిన్ని వార్తలు