సహనాన్ని పరీక్షిస్తున్నారు..

22 Mar, 2018 00:41 IST|Sakshi

రక్షణ శాఖపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌ రోడ్ల విస్తరణకు భూములు ఇవ్వట్లేదంటూ మండిపాటు

శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం

వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: కడియం

మధ్యాహ్న భోజన పథకం అమలుపై నిఘా ఉందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో రోడ్ల విస్తరణకు, స్కైవేల నిర్మాణానికి రక్షణ అడ్డుగా నిలుస్తోందని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కంటోన్మెంట్‌ భూములు ఇచ్చే విషయంలో రక్షణ శాఖ నగర ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల సమస్య లేని చోట కూడా రోడ్లు మూసివేస్తోందని, జీహెచ్‌ఎంసీని సతాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం శాసనమండలిలో హైదరాబాద్‌ రోడ్ల అభివృద్ధిపై సభ్యులు ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, భూపతిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. రోడ్ల విస్తరణ, స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్‌ ప్రాంతంలో 160 ఎకరాల రక్షణ శాఖ భూములు అవసరమున్నాయని తెలిపారు. కేంద్రం వాటిని కేటాయిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.  

ముగ్గురు రక్షణ మంత్రులకు చెప్పినా..
100 ఎకరాలు కేటాయిస్తే 600 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని చెప్పినా ఇవ్వడం లేదని కేటీఆర్‌ ఆరోపించారు. కొత్తగా ఆ భూముల్లో భవన నిర్మాణాలు చేపడితే తమకు ప్రతి నెలా రూ.30 కోట్ల ఆదాయం వచ్చేదని, ఆ దృష్ట్యా శాశ్వత ప్రాతిపదికన ప్రతి నెల రూ.30 కోట్లు ఇవ్వాలంటూ రక్షణ శాఖ లేఖ రాసిందని మండలి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల విషయంలో రక్షణ శాఖ ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబించడం లేదని విమర్శించారు.

కేంద్రం భూములు ఇవ్వనందునే రహదారుల విస్తరణలో జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై బీజేపీ సభ్యుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ, ఇటీవల రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌తో మాట్లాడానని, ఆమె సానుకూలంగా ఉన్నారని తెలిపారు. కేటీఆర్‌ బదులిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ముగ్గురు రక్షణ మంత్రులతో మాట్లాడినా సమస్యకు పరిష్కారం దొరకలేదని చెప్పారు.

రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఎవరైనా అనుమతులు తెప్పిస్తే వారితోనే కొబ్బరికాయ కొట్టిస్తామన్నారు. మరోవైపు నగరంలో నాలుగు రకాల బస్టాపులను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్‌ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గ్రేడ్‌–1లో అత్యున్నత ప్రమాణాలతో వసతులు ఏర్పాటు చేస్తా మని ప్రకటించారు. ఏసీ, వైఫై సౌకర్యం, టికెటింగ్‌ మిషన్‌ ఏర్పాటు, డస్ట్‌ బిన్, టాయిలెట్స్‌ ఉంటాయని పేర్కొన్నారు.

టెన్త్‌ వరకు తప్పనిసరి: కడియం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మొదట్లో ఇంటర్‌ వరకు అమలు చేయాలని భావించినా.. మొదటి దశలో పదో తరగతి వరకు అమలు చేస్తున్నామని చెప్పారు. సభ్యులు పాతూరి సుధాకర్‌ రెడ్డి, నారదాసు, పూల రవీందర్‌ రెడ్డి.. మాతృ భాష అమలుపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

పదో తరగతి వరకు రాష్ట్ర సిలబస్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌ ఉన్న పాఠశాలల్లో ‘తెలుగు తప్పనిసరి’ని ఏ విధంగా అమలు చేయాలో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంపై నిరంతరం నిఘా పెట్టామని, ఇందుకోసం విజిలెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేశం మొత్తంలో మధ్యాహ్న భోజన పథకం 8వ తరగతి వరకే అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రమే 9, 10వ తరగతులకు కూడా రాష్ట్ర నిధులతో అమలు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు 7,080 వంటశాలలు రూ.146 కోట్లతో నిర్మిస్తున్నామని, అవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.

అందులో రిజర్వేషన్లు కుదరవు: జగదీశ్‌
సోలార్‌ ప్లాంట్ల నిర్మాణాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్లాంట్ల నిర్మాణాల్లో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీలు, రిజర్వేషన్లు వర్తింపజేయడం సాధ్యం కాదని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సభ్యులు రాజేశ్వర్‌రావు, రాములునాయక్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

సోలార్‌ పవర్‌ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 1,617 సోలార్‌ ప్లాంట్లలో 3,046.88 మెగావాట్లు, ఇళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రూఫ్‌ టాప్‌ ద్వారా 26.92 మెగావాట్లు, యన్‌.పి.టి.సి ద్వారా 449.81 మెగావాట్లు, పోటీ టెండర్ల ద్వారా 121 కేంద్రాల్లో 2,375 మెగావాట్లు, ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా 43 కేంద్రాల్లో 189.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు