‘నోవార్టిస్‌’ను విస్తరిస్తాం

25 Jan, 2018 01:03 IST|Sakshi
బుధవారం దావోస్‌ సదస్సులో నోవార్టిస్‌ సంస్థ ప్రతినిధి పెట్రా లక్స్‌తో చర్చిస్తున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లోని ఔషధ ప్రయోగశాలపై కంపెనీ వెల్లడి

దావోస్‌లో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: నోవార్టిస్‌ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌అండ్‌డీ), డేటా సపోర్ట్, అనలిటిక్స్‌ కార్యకలాపాలు కొనసాగిస్తోందని, హైదరాబాద్‌లో తమ సంస్థ సాధిస్తున్న పురోగతిపై సంతృప్తిగా ఉన్నట్లు ఆ సంస్థ పబ్లిక్‌ పాలసీ విభాగాధిపతి పెట్రా లక్స్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సంస్థ నిర్వహిస్తున్న ఔషధ ప్రయోగశాల సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించారు. పరిశోధన విభాగంలో మరో 150 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపారు. నోవార్టిస్‌ కార్యకలాపాల విస్తరణతో జీనోమ్‌ వ్యాలీ అభివృద్ధికి దోహదపడనుందని, పూర్తి వివరాలను కంపెనీ త్వరలో వెల్లడిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. త్వరలో నిర్మిస్తున్న ఫార్మా సిటీలో పెట్టుబడులు పెట్టాలని నోవార్టిస్‌ను ఆహ్వానించారు. దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో కేటీఆర్‌ రెండో రోజు పలు ప్రముఖ కంపెనీలతో సమావేశమై ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని వివరించారు.

మిత్సుబిషీతో..
రాష్ట్రంలో జపనీస్‌ చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కును ఏర్పాటు చేయాలని ఆ దేశ ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మిత్సుబిషీని కేటీఆర్‌ కోరారు. మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కెన్‌ కవాయి బృందంతో ఆయన సమావేశమయ్యారు. భారీ ప్రాజెక్టుల అవకాశాలకు తమ కంపెనీ చూస్తోందని మిత్సుబిషీ ప్రతినిధులుమంత్రికి తెలిపారు. పారిశ్రామికవాడలు, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర ప్రాజెక్టులపై మిత్సుబిషీకి ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులకు రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని, కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటించాలని మంత్రి ఆహ్వానించారు. జపాన్‌ పర్యటనలో ఇలాంటి పార్కు ఏర్పాటుకు జైకా వంటి ఆర్థిక సంస్థలు రుణాలందించేందుకు సూత్రప్రాయంగా ఒప్పుకున్నాయని వారికి వివరించారు. సౌర విద్యుదుత్పత్తిలో రాష్ట్రం ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కువైట్‌కు చెందిన ఫవద్‌ అల్గానిమ్‌ కంపెనీ సీఈవో మహ్మద్‌ అల్గానిమ్‌తో సమావేశమై రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు అందుతున్న సహకారాన్ని వివరించారు. రాష్ట్రంలో టెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దుబాయ్‌ సంస్థను కేటీఆర్‌ కోరారు.

ఎయిర్‌ ఏషియాతో..
ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈవో ఆంథోనీ ఫెర్నాండేజ్, ఉప కార్యనిర్వహణాధికారి ఎయిరీన్‌ ఒమర్‌తో కేటీఆర్‌ సమావేశమై హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. రానున్న రోజుల్లో దేశంలో విమానయాన రంగం మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఎయిర్‌ ఏషియాను ఆహ్వానించారు.

హెచ్‌పీ కంపెనీతో..
ప్రముఖ హార్డ్‌వేర్‌ కంపెనీ హ్యూలెట్‌ ప్యాకర్డ్‌ (హెచ్‌పీ), టీ–హబ్‌ల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని పరిశీలించాలని కేటీఆర్‌ కోరారు. హెచ్‌పీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించాలని ఆ కంపెనీ ఉపాధ్యక్షుడు అనా పిన్కుజుక్‌కు విజ్ఞప్తి చేశారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో సర్క్యులర్‌ అవార్డు గెలుచుకున్న టీ–హబ్‌లోని బనయన్‌ నేషన్‌ స్టార్టప్‌ సహ వ్యవస్థాపకుడు మనీ వాజపేయ్‌ దావోస్‌ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వాజ్‌పేయ్‌ బృందానికి అభినందనలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు