‘ఫార్మా’లో ప్రపంచంతో పోటీ

7 Feb, 2017 03:51 IST|Sakshi
‘ఫార్మా’లో ప్రపంచంతో పోటీ

బయో ఏసియా సదస్సులో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ ఏర్పాటుతో దేశ ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌ స్థానం సుస్థిరమవుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ తయారీలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌.. జినోమ్‌ వ్యాలీ రూపంలో ఆసియాలోనే అతిపెద్ద, వ్యవస్థీకృత పరిశోధనాభివృద్ధి సమూహంగా అవతరిస్తోందన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ప్రారంభమైన 14వ బయో ఏసియా సదస్సులో కేటీఆర్‌ మాట్లాడుతూ.. తాజాగా రూ.3,000 కోట్ల పెట్టుబడుల రాకతో జినోమ్‌ వ్యాలీలో రెండో తరం విప్లవం మొదలైనట్లేనని చెప్పారు. ఫార్మాసిటీతోపాటు వైద్య పరికరాల తయారీ పార్క్‌ల ఏర్పాటుతో జినోమ్‌ వ్యాలీ వైద్య రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ తనదైన పాత్ర పోషించే అవకాశం ఏర్పడుతుందన్నారు.

స్వయంగా బయోటెక్నాలజిస్ట్‌నైన తాను లైఫ్‌సైన్సెస్‌ రంగంలో కీలకంగా ఎదుగుతున్న జినోమ్‌ వ్యాలీ క్లస్టర్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలు, అతి తక్కువ ధరలతో మందులు లభించేందుకు జినోమ్‌ వ్యాలీలో జరిగే పరిశోధనలు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. వ్యాలీలోని కంపెనీలన్నింటికీ నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. నగర శివార్లలో దాదాపు 14 వేల ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఫార్మా సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుం దని.. ఇందులో బల్క్‌డ్రగ్స్, ఫార్ములేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని వివరిం చారు. జినోమ్‌ వ్యాలీలో మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ‘ఇండస్ట్రి యల్‌ ఏరియా లోకల్‌ అథారిటీ’సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

ఎన్నో సవాళ్లు: నరసింహన్‌
మధుమేహం, రక్తపోటు, కంటి జబ్బులను నివారించేందుకు, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని, కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇందులో చురుకైన పాత్ర పోషించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌ కోరారు. ఆరోగ్య రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటోందని.. పరిశోధనల ద్వారా చౌకైన, మెరుగైన పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుక్కోవాలని సూచించారు. మాతా శిశు సంక్షేమం మొదలుకొని మధ్య వయస్సు వారిలో ఒత్తిడి వరకూ అనేక సమస్యలు ఉన్నాయని బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ గవర్నర్‌ గుర్తు చేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలతో మనిషి ఆయుః ప్రమాణాలు పెరిగినా వయోవృద్ధులు సౌకర్యంగా జీవించేందుకు ఇవి చాలవన్నారు.

వైద్య సదుపాయాలు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం కావడంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌.. వాటిని గ్రామీణ ప్రాంతాలకు చేర్చడంపై దృష్టిపెట్టాలన్నారు. మందుల ప్యాకెట్లపై ఉండే లేబుల్స్‌ను వయో వృద్ధులు కూడా సులువుగా చదివేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని సూచించారు. కార్యక్రమంలో నోబెల్‌ అవార్డు గ్రహీత, స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త కర్ట్‌ వుట్రిచ్, (2002, రసాయన శాస్త్రం), జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పాల్‌ స్టౌఫెల్స్‌లను జినోమ్‌ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో గవర్నర్‌ నరసింహన్‌ సత్కరించారు. ఫార్మా రంగంలో విశేష కృషి చేసిన వారికి బయో ఆసియా ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో మలేసియా ప్రతినిధి చెంగ్‌ ఛాన్‌ ఖిమ్, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యా స్వామినాథన్, ప్రొఫెసర్‌ విజయరాఘవన్, బాలసుబ్రమణ్యన్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు జయేశ్‌ రంజన్, తివారీ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు