100 డివిజన్లలో కేటీఆర్ రోడ్‌షోలు

21 Jan, 2016 20:05 IST|Sakshi
100 డివిజన్లలో కేటీఆర్ రోడ్‌షోలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 23 నుంచి 28 వరకు వంద డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహిస్తారని టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.

మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొనే సభలకు సంబంధించి స్పష్టత రావాల్సి వుందని..ఒకటి లేదా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించే అవకాశముందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నీటి కొరత, విద్యుత్ కోతల సమస్యలనను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంపై మంత్రి కేటీఆర్ విసిరిన సవాలుకు విపక్షాలు జవాబు చెప్పడం లేదని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో మంత్రి బండారు దత్తాత్రేయ జోక్యం చేసుకోవడం విచారకరమన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారని విమర్శించారు. 23న శేరిలింగంపల్లి, 24న కూకట్పల్లితో పాటు పలు నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు