'తెలంగాణలో క్రీడలకు పెద్దపీట'

20 Aug, 2016 18:07 IST|Sakshi
'తెలంగాణలో క్రీడలకు పెద్దపీట'
నాగోలు: తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. నాగోలు పూర్వ విద్యార్థుల సంఘం (నోసా), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగోలు హైస్కూల్‌లో జోనల్ లెవల్ కబడ్డీ అండర్-14, 17 పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి క్రీడలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ క్రీడల పట్ల ఆసక్తి ఉన్న వారికి ప్రోత్సాహం అందించాలని తెలిపారు. 
 
నగర క్రీడాకారాణి సింధు భారత కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిందని ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలపై ప్రత్యేక దష్టి పెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను సైతం ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు. మన దగ్గర అనేక మంది క్రీడాకారులలో నైపుణ్యం దాగి ఉందని వారిని ప్రోత్సహిస్తే క్రీడలలో రాణించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారని అన్నారు. నాగోలు హైస్కూల్‌కు కావలసిన సదుపాయాలను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెంటనే పరిష్కరించే విధంగా కషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నోసా అధ్యక్షులు కందికంటి కన్నాగౌడ్, కార్యదర్శి ఎం.సత్యనారాయణ, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవిందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో మంత్రికి పాఠశాల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 

కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్‌గౌడ్ డివిజన్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఉప్పల్, ఘట్‌కేసర్ మండలాల పరిధిలోని 32 బాల బాలికల జట్లు పోటీలలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ రమేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ ఇంచార్జి రాంమోహన్‌గౌడ్, లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, యెగ్గే మల్లేశం, నోసా సభ్యులు అనంతుల వేణుగౌడ్, బొడ్డుపల్లి మహేందర్, ప్రదీప్, శ్రీనివాస్, గ్రామ పెద్దలు గోల్కొండ మైసయ్య, కట్టా ఈశ్వరయ్య, పల్లె సీతారాములు, మధు తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు