సత్రం భూముల దోపిడీ నిజమే!

7 Jul, 2016 02:08 IST|Sakshi
సత్రం భూముల దోపిడీ నిజమే!

- వాస్తవ ధర తెలిసినా చౌకగా విక్రయం
వేలం ధర తగ్గింపుపై మౌనం
- కీలక ప్రశ్నలకు వివరణ ఇవ్వని మంత్రి మాణిక్యాలరావు
 
 సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల విక్రయంలో భారీ దోపిడీ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ పత్రమే తేటతెల్లం చేస్తోంది. భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా 83.11 ఎకరాలను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం  అంగీకరించింది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు మంగళవారం విజయవాడలో వివరణ ఇచ్చారు. నోట్ కూడా విడుదల చేశారు. భూముల వేలానికి మార్చి 1వ తేదీన దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని... రెండు రోజుల్లో(3వ తేదీ)నే భూమి ధరకు సంబంధించి తమిళనాడులోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆరా తీసినట్లు మంత్రి తన వివరణలో పేర్కొన్నారు. మార్చి 3న ఆరా తీసినప్పుడు సత్రం భూములు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగు రూ.1,700 చొప్పున ఎకరాకు రూ.6 కోట్ల వరకు ధర ఉన్నట్లు తెలుసని అంగీకరించారు.

 భూముల ధర తగ్గించారెందుకు?
 ఎక రం ధర రూ.6 కోట్ల వరకు ఉందని తెలిసినా, సదావర్తి సత్రం భూములు ఆక్రమణలో ఉన్నాయన్న సాకుతో వేలం సమయంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ సమయంలో  ఎకరం ధరను రూ.27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చిందన్న దానిపై  ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విజయవాడ దుర్గ గుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ.2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి అనుమతించి ంది.కానీ రూ.1,000 కోట్ల విలువైన భూముల వేలంలో ఈ జాగ్రత్తలు తీసుకోలేదన్న ప్రశ్నకు  సమాధానం లేదు. రాష్ట్రంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయశాఖ ఈ-టెండర్ అమలు చేస్తోంది.  అలా పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. దీని గురించి అధికార పార్టీ నేతలు మినహా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడింది.ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సర్కార్ చెప్పడం లేదు.

 వేలం తర్వాత అనుమతికీ తొందరే
 దేవాదాయ శాఖలో నాలుగైదు ఏళ్ల క్రితం వేలంలో భూములను దక్కించుకున్నా వాటిని వారు స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సత్రం భూముల విషయంలో మాత్రం మార్చి 28న వేలం జరగ్గా ఏప్రిల్ 24నే పాటదారుకు అప్పగించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు