ఆహ్వానంలోనూ కుసంస్కారం

14 Aug, 2016 03:08 IST|Sakshi
శనివారం వైఎస్ జగన్ తో భేటీ సందర్భంగా కాపీ తాగుతున్న రావెల, నారాయణరెడ్డి, కూన రవి

టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ
పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్షనేతకు ఆహ్వానం
జగన్ ఇంటి గేటువద్దకు వచ్చి మంత్రి రావెల రాజకీయం
శనివారం ఉదయం సాదరంగా ఆహ్వానించిన జగన్
ఆహ్వాన పత్రికను అందుకుని, కాఫీతో మర్యాద
తాను 18న పుష్కర స్నానానికి వెళుతున్నట్లు వెల్లడి
ఇంటి బయటకు వచ్చి విమర్శించిన రావెల
ఆహ్వానం విషయంలో అన్నీ అబద్ధాలే: పార్థసారధి

సాక్షి, హైదరాబాద్:  కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి వచ్చిన రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యవహరించిన తీరు తెలుగుదేశం పార్టీ కుసంస్కారానికి పరాకాష్టగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. ఆహ్వానం పేరుతో రాజకీయం చేస్తున్న అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించడం మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉందని విమర్శించింది. ప్రతిపక్ష నేత పట్ల తడవ తడవకూ చులకన భావంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే శుక్ర, శనివారాల్లో ‘ఆహ్వానం’ పేరుతో జరిగిన సంఘటనలని పేర్కొంది.

పార్టీ వర్గాల సమాచారం మేరకు.. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో జగన్ నివాసానికి మంత్రి రావెల ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి వచ్చినపుడు వారిని సాదరంగా పార్టీ నేతలు లోనికి ఆహ్వానించి కూర్చోబెట్టారు. ఆ తరువాత జగన్‌తో పాటు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాద్‌రాజు వారితో కొద్దిసేపు ముచ్చటించారు. రావెల పుష్కర ఆహ్వాన పత్రికను అందజేసిన తరువాత జగన్ వారి కోసం కాఫీ తెప్పించారు. తాను 18న పుష్కర స్నానానికి వెళుతున్నట్లు కూడా ఆ సందర్భంగా వారికి చెప్పారు.

అయినా రావెల బయటకు రాగానే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం అందరినీ నివ్వెరపరచిందని, దురుద్దేశంతోనే వారు జగన్ నివాసానికి వచ్చారనేది  అర్థమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్‌కు, ఆహ్వానం అందజేయడానికి వారం రోజులుగా అపాయింట్‌మెంట్ కావాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నిస్తే దొరకలేదని రావె ల చెప్పడం తప్పు దోవపట్టించే దిగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వారం రోజుల్లో రాజప్ప నుంచి జగన్ వ్యక్తిగత సిబ్బందికి గాని, పార్టీ నేతలకు గాని  వర్తమానం రాలేదని పేర్కొన్నాయి.
 
రాజకీయం మంచిది కాదు: రావెల

తమను అవమాన పరిచారని, నిర్లక్ష్యం చేస్తున్నారనీ ప్రతిపక్షం ప్రతి విషయాన్ని చిలువలు పలువలు చేస్తూ రాజకీయం చేయడం సబబు కాదని మంత్రి రావెల కిశోర్‌బాబు వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆహ్వానం అందజేసి బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాస్తవానికి జగన్‌కు హోంమంత్రి చిన్న రాజప్ప ఆహ్వానం ఇవ్వాలనుకున్నా వారం రోజులుగా అపాయింట్‌మెంట్ దొరకలేదని చెప్పారు. శుక్రవారం రాత్రి తాను, రవికుమార్ ఇంటి వద్దకు వచ్చినా జగన్ కలవడానికి నిరాకరించినప్పటికీ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహా మేరకు తాము పెద్ద మనసు చేసుకుని శనివారం వచ్చామని చెప్పారు. ప్రజలు పవిత్రంగా భావించే పుష్కరాలను కూడా రాజకీయం చేయడం తగదని సూచించారు.
 
ఆహ్వానం పేరిట కుళ్లు రాజకీయం: పార్థసారథి
పుష్కరాల ఆహ్వానం పేరుతో టీడీపీ కుళ్లు రాజకీయం చేస్తూ.. తాము చేస్తున్నట్లుగా చిత్రీకరించడం దారుణమని వైఎస్సార్‌సీసీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. పార్టీ నేత చలమశెట్టి సునీల్‌తో కలిసి ఆయన జగన్ నివాసం వద్ద మాట్లాడారు. ఆహ్వానం అందించడానికి వచ్చిన మంత్రి, ఇతర నేతలతో జగన్ చాలా గౌరవంగా మాట్లాడి పంపితే... బయటకు వచ్చి విమర్శించడం వారి కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు.

అసలు అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లుగా పుష్కరాలు ప్రారంభం అయిన 24 గంటల తరువాత ఆహ్వానం ఇవ్వడానికి వచ్చారంటేనే వారి సంస్కారం ఏపాటిదో అర్థం అవుతోందన్నారు. ప్రతిపక్ష నేత అపాయింట్‌మెంట్ లేక పోయినా శుక్రవారం రాత్రి తాము ఆహ్వానించడానికి వెళుతున్నట్లు లీకులిచ్చి టీవీల్లో ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు.

మరిన్ని వార్తలు