సభలో విపక్ష సభ్యుల తీరు అమానుషం

11 Sep, 2016 02:52 IST|Sakshi
సభలో విపక్ష సభ్యుల తీరు అమానుషం

అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదన సందర్భంగా యనమల

 సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గత మూడు రోజుల్లో విపక్ష సభ్యులు అనుసరించిన తీరు అమానుషమని, దౌర్జన్యానికి దిగారని, స్పీకర్‌పైనే పేపర్ బాల్స్ విసిరారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు రోజులుగా సభలో జరిగిన సంఘటనలను పరిశీలించి బాధ్యులపై చర్యల కోసం సభా హక్కుల కమిటీ  సిఫార్సు చేయాలంటూ శనివారం అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభాపతి సభామోదం నిమిత్తం ప్రతిపాదించారు. దీనిపై మాట్లాడిన అధికార పక్ష సభ్యులు అనిత, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు తీర్మానాన్ని బలపరిచే మిషతో విపక్షనేతను టార్గెట్ చేసుకుని కించపరిచేలా మాట్లాడారు. బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కూడా మాట్లాడారు. అనంతరం తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.

 విపక్ష నేతను మాట్లాడవద్దన్న స్పీకర్
తమను, తమ నేతను అవహేళన చేసేలా అధికార పక్ష నేతలు మాట్లాడటం పట్ల విపక్ష సభ్యులు అభ్యంతరం చెబుతూ తమ నేతకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘మీరు మీ స్థానాల్లోకి వెళితే అందరూ మాట్లాడవచ్చు’ అని స్పీకర్ అన్నారు. విపక్ష సభ్యులు వెనక్కు వెళ్లగా ప్రతిపక్షనేతకు స్పీకర్ మైక్ ఇచ్చారు. జగన్ మైక్ తీసుకుని మాట్లాడేందుకు సిద్ధపడే లోపే ‘జగన్‌మోహన్‌రెడ్డీ మీరు మాట్లాడటానికి ఏమీ లేదు’ అంటూ స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. మరి మైక్ ఎందుకు ఇచ్చారని విపక్ష నేత ప్రశ్నించగా ‘నేను మైక్ ఇచ్చి మాట్లాడాలని చెప్పలేదు’ అని స్పీకర్ అన్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల మొత్తం ఫుటేజీని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కె.నారాయణస్వామితో కలిసి మాట్లాడారు. ఉదయం జరిగిన అసెంబ్లీ వీడియో క్లిప్పింగులను మధ్యాహ్నానికి ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాస్ మీడియాకు విడుదల చేయడాన్ని తప్పుపట్టారు.

>
మరిన్ని వార్తలు