ఈసెట్‌ ఓఎంఆర్‌ రెస్పాన్స్‌ షీట్లు మాయం!

31 May, 2017 02:10 IST|Sakshi
- వెబ్‌సైట్‌లో లింకును తొలగించిన జేఎన్‌టీయూహెచ్‌
- అందరికీ రీఎగ్జామ్‌కు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల వినతి
 
సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (ల్యాటరల్‌ ఎంట్రీ) ఈ నెల 6న నిర్వహించిన ఈ సెట్‌ మార్కుల గల్లంతు వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక మంది విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందంటూ జేఎన్‌టీయూహెచ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కేవలం 3 గంటల పరీక్ష రాయని, 200 ప్రశ్నలకు జవాబులు గుర్తించని వారే రీ ఎగ్జామ్‌కు అర్హులని జేఎన్‌టీయూ ప్రకటించడంతో నష్టపోయిన విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. పైగా అలాంటి విద్యార్థులు కేవలం 130 మంది మాత్రమే ఉన్నారని వారికే వచ్చే నెల 4న మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.

అయితే జేఎన్‌టీయూహెచ్‌ విధించిన నిబంధనల ప్రకారమే మంగళవారం వరకు 530 మంది వరకు విద్యార్థులు రీఎగ్జామ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 3 గంటలపాటు పరీక్ష రాసినా, 200 ప్రశ్నలకు జవాబులను గుర్తించినా ఓఎంఆర్‌ రెస్పాన్స్‌ షీట్‌లో కేవలం 80 నుంచి 100 ప్రశ్నలకే జవాబులు గుర్తించినట్లు ఉండడంతో వారంతా తీవ్ర గందరగోళంలో పడ్డారు. వాస్తవానికి వారికి 120కి పైగా మార్కులు రావాల్సి ఉన్నా, ఓఎంఆర్‌ జవాబు పత్రాల స్కానింగ్‌ సరిగా కాకపోవడంతో కేవలం 80 నుంచి 100 ప్రశ్నలకు సంబంధించి 50 నుంచి 60 మార్కులే ర్యాంకు కార్డుల్లో చూపించడంతో వారంతా లబోదిబోమంటున్నారు. తమకు రీ ఎగ్జామ్‌కు అవకాశం కల్పించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

పైగా మొదట నష్టపోయిన విద్యార్థులు 120 మంది మాత్రమే ఉన్నారని జేఎన్‌టీయూహెచ్‌ చెప్పినా.. మొత్తం పరీక్ష రాయని వారు 530కి పైగా ఉన్నట్లు తాజా దరఖాస్తులతో బయట పడింది. నష్టపోయిన విద్యార్థుల సంఖ్య పెరిగిపోతోందని గ్రహించిన అధికారులు ఈ సెట్‌ వెబ్‌సైట్‌ నుంచి ఓఎంఆర్‌ రెస్పాన్స్‌ షీట్‌ల లింకును తొలగించారు. కొంత మంది విద్యార్థులకు ఇంకా ఓఎంఆర్‌ రెస్పాన్స్‌ షీట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. జేఎన్‌టీయూహెచ్, కంప్యూటర్‌ ప్రాసెసింగ్‌ సంస్థ చేసిన తప్పిదాలకు తాము నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కల్పించుకుని వచ్చే నెల 4న నిర్వహించే రీఎగ్జామ్‌కు అందరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. 
 
మరిన్ని వార్తలు