చెరువులకు 'జీవం'

14 Aug, 2016 01:28 IST|Sakshi
చెరువులకు 'జీవం'

రాష్ట్రంలో చెరువులు జలకళతో తొణికిసలాడుతున్నాయి.. దశాబ్దాల తరబడి పూడికతీతకు నోచుకోక, కొన్నిచోట్ల ఆనవాళ్లే కోల్పోయిన చెరువులన్నీ ‘మిషన్ కాకతీయ’తో కొత్తరూపు సంతరించుకున్నాయి.. ఇటీవలి వర్షాలకు భారీగా నీరు చేరడంతో రైతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.. చెరువుల సామర్థ్యం పెరగడంతో వాటి కింది పొలాలన్నింటికీ జీవం రానుంది. చిన్న నీటి వనరుల పునరుద్ధరణ, అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పథకం ఫలాలు అందివస్తున్నాయి. తొలి విడతలో రూ.2,626 కోట్లతో పునరుద్ధరించిన 7,373 చెరువుల ద్వారా తెలంగాణలో వేలాది ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఈ వారం ఫోకస్..     
- సాక్షి నెట్‌వర్క్
 
రాష్ట్రవ్యాప్తంగా కళకళలాడుతున్న చెరువులు
పునరుద్ధరణతో పూర్తి సామర్థ్యం మేరకు నీటి నిల్వ
పలు చోట్ల రెండు పంటలకూ నీరిచ్చేందుకు వీలు
ఆయకట్టు స్థిరీకరణతో రైతుల్లో కొత్త ఆశలు
చిన్న నీటి వనరుల కింద పెరుగుతున్న సాగు విస్తీర్ణం

 
మిషన్ కాకతీయ పథకం తొలి విడత కింద 8,049 చెరువులను ఎంపిక చేసి పునరుద్ధరణ పనులు చేపట్టారు. అందులో 7,373 చెరువులు పూర్తి స్థాయిలో మరమ్మతులకు నోచుకున్నాయి. వాటిల్లో చాలా చెరువుల్లో ఇటీవలి వర్షాలకు నీరు చేరింది. దీంతో ఆయా చెరువుల కింద ఆయకట్టు రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 549 చెరువుల మరమ్మతుకాగా.. 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, అందులో కొంత భాగం ఇప్పటికే సాగులోకి వచ్చిందని ఆ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. అంతకుముందు ఈ చెరువుల కింద ఆయకట్టు 25 వేల ఎకరాలకు మించి లేదని అంటున్నారు.
 
ఇందూరు.. నిండుగా నీరు!
నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో 618 చెరువులను పునరుద్ధరించారు. ఇటీవలి వర్షాలకు జిల్లాలోని 2,811 చెరువుల్లో నీరు చేరింది. అందులో 169 చెరువులు వంద శాతం నిండినట్టు లెక్కలు చెబుతున్నాయి. వాటిలో అత్యధికం పూడిక తీసిన చెరువులేనని అధికారులు అంటున్నారు.
 
‘నీళ్ల’గొండ..
నల్లగొండ జిల్లాలో రూ.40 కోట్లతో 760 చెరువులను పునరుద్ధరించారు. దాదాపు అన్ని చెరువుల్లోనూ నీళ్లు చేరాయి. అర్వపల్లి మండలం నాగారం పెద్దచెరువు ప్రస్తుతం అలుగు పోస్తోంది. ఈసారి చెరువు కింద ఉన్న 400 ఎకరాల ఆయకట్టు మొత్తం సాగులోకి రానుందని రైతులు చెబుతున్నారు. ఆత్మకూరు (ఎం) మండలం చాడ పెద్ద చెరువు కింద 401 ఎకరాల ఆయకట్టుకు చెందిన రైతులూ సమాయత్తమవుతున్నారు.
 
పాలమూరు.. నీరే నీరు
మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడతగా రూ.284.31 కోట్లతో 918 చెరువుల పనులు పూర్తిచేశారు. ఇటీవల భారీ వర్షాలు పడడం, చెరువుల సామర్థ్యం పెరగడంతో వాటిలో భారీగా నీరు చేరింది. జడ్చర్ల చెరువు కింద ఉన్న 25 ఎకరాల ఆయకట్టు చాలా ఏళ్ల తరువాత తిరిగి సాగులోకి రానుంది. చెరువు నిండడంతో పక్కనే ఉన్న ప్రాంతాల్లోని బోర్లలో నీటిమట్టం పెరిగిందని రైతులు చెబుతున్నారు.
 
వరంగల్.. చెరువులు ఫుల్
వరంగల్ జిల్లాలో మొదటి విడత కింద 973 చెరువుల పనులు పూర్తి చేశారు. వానలు కురవడంతో అవన్నీ నిండిపోయాయి. అలుగు పారుతూ పరవళ్లు తొక్కుతున్నాయి. మద్దూరు మండలం గాగిళ్లాపూర్ పెద్ద చెరువుకు కొత్త కళ వచ్చింది. దీని కింద ఆయకట్టు 639 ఎకరాలైతే.. ఏకంగా 1,500 ఎకరాలు సాగు చేసే స్థాయిలో నీరు చేరింది.

ఆరేళ్లుగా ఎండిపోయిన ధూల్మిట్ట చెరువు పూడికతీతతో సామర్థ్యం పెరిగింది. పూర్తిగా నిండడంతో దీని కింద 104 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ఇక 232 ఎకరాల ఆయకట్టున్న నల్లకుంట చెరువు.. ఇప్పుడు ఏకంగా 1,200 ఎకరాలకు నీరిచ్చే స్థాయికి మెరుగుపడింది. చెరువు పూర్తిగా నిండిపోవడంతో చుట్టుపక్కల 5 గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో నీరు ఊరుతోంది. చేర్యాల మండలం ఆకునూరులోని పోకలమ్మ చెరువు కింద 97 ఎకరాలకు సాగునీరందనుంది.
 
జల’ సంద్రం
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాటలోని సోమసంద్రం చెరువు. నిజాంల కాలంలో 150 ఏళ్ల క్రితం దీనికి గండి పడింది. అప్పటినుంచి ఎవరూ పట్టించుకోలేదు. మిషన్ కాకతీయ తొలి విడతలో ఈ చెరువుకు రూ.26.30 లక్షలు కేటాయించి పనులు చేపట్టారు. గండ్లు పూడ్చి, పూడిక తీయడంతో ఇటీవలి వర్షాలకు పూర్తిగా నిండింది. చెరువు కింద ఆయకట్టుకు జీవమొచ్చింది.
 
జల ‘సిరి’చెల్మ
ఇది ఆదిలాబాద్ జిల్లాలోని సిరిచెల్మ చెరువు. దీన్నుంచి మొన్నటి వరకు 50 ఎకరాలకైనా నీరందేది కాదు. మొదటి విడత మిషన్ కాకతీయ కింద రూ.1.13 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూడిక తీసి, కట్టను బలోపేతం చేశారు. వాననీరు చెరువులోకి చేరేలా ఫీడర్ చానల్ నిర్మించారు. ప్రస్తుత వర్షాలతో చెరువులోకి నీళ్లు చేరాయి. ఇప్పుడు చెరువు కింద 300 ఎకరాల్లో రెండు పంటలకూ సాగు నీరందనుంది.
 
మెతుకుసీమ తళుక్కు

తొలి విడత కింద మెదక్ జిల్లాలో అత్యధికంగా 1,684 చెరువుల్లో రూ.670 కోట్లతో పనులు చేపట్టారు. 1,630 చెరువుల పనులు పూర్తయ్యాయి. అందోల్ మండలం అన్నసాగర్ చెరువులో రూ.46 లక్షల వ్యయంతో 45 వేల క్యూబిక్ మీటర్ల మేర పూడిక తీశారు. ప్రస్తుత వర్షాలతో భారీగా నీరు చేరింది. ఈ చెరువు కింద 350 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా... చాలా ఏళ్ల తరువాత అదంతా సాగులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
 
ఆ రెండు జిల్లాల్లో విచిత్ర పరిస్థితి
ఇటీవలి భారీ వర్షాలతో కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గోదావరితో పాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ చెరువుల్లో మాత్రం నీరు చేరలేదు. ఖమ్మం జిల్లాలో మొత్తం 4,517 చెరువులుంటే.. ఇప్పటివరకు 520 చెరువులు మాత్రమే నిండినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా చెరువుల్లో 20 నుంచి 75 శాతం నీరు మాత్రమే చేరిందని అంటున్నారు. ఈ జిల్లాలో తొలి విడత కింద 812 చెరువుల పనులు పూర్తయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 823 చెరువుల్లో పూడిక తీశారు. ఇటీవల భారీ వర్షాలు పడినా అవేవీ నిండలేదు. జిల్లావ్యాప్తంగా 70 శాతం చెరువుల్లో అంతంతగానే నీళ్లు చేరాయని అధికారులు చెబుతున్నారు. దాంతో ఆయా చెరువుల కింద నాట్లు పడలేదు.
 
అక్రమాలతో గుండె ‘
చెరువే
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన చెరువులకు మహర్దశ పట్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వందల కోట్లు వెచ్చించి చేపట్టిన ఈ పథకం కింద కాంట్రాక్టులను చాలాచోట్ల అధికార పార్టీ నేతలే బినామీ పేర్లతో దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. మారుమూల గ్రామాల్లోని చెరువు పనులను నీటి పారుదల శాఖ అధికారులే ‘కాంట్రాక్టర్లు’గా మారి చేపట్టిన ఉదంతాలు వెలుగుచూశాయి. అలాగే చాలాచోట్ల చెరువుల పనులను నామమాత్రంగా చేసి రూ.లక్షల్లో బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు