అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి అబద్ధాలు

21 Apr, 2016 02:34 IST|Sakshi
అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి అబద్ధాలు

యనమలపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరపు ఏపీ బడ్జెట్ శాసనసభా సమావేశాల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అవాస్తవాలు  చెప్పారని, అసలు రాష్ట్ర బడ్జెట్ లెక్కలను పూర్తిగా రీవాలిడేషన్ (పునఃవిలువ) చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర జీఎస్‌డీపీని టీడీపీ ప్రభుత్వం రూ.6,96,000 కోట్లుగా చూపగా, రూ. 6,26,000 కోట్లు మాత్రమే అని కేంద్రం విలువ కట్టినట్లు ఓ ఆంగ్లపత్రిక ప్రచురించిందని వివరించారు.

రాష్ట్రంలో జీఎస్‌డీపీ వృద్ధిరేటు వంటి అంశాలకు సంబంధించి తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు సహేతుకంగా లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి సరైన సమాధానం ఇవ్వకుండా తామంతా సరిగ్గానే చేస్తున్నట్లు అసెంబ్లీలో బుకాయించారని సంబంధిత వీడియో క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. జీఎస్‌డీపీ మొత్తంపై మూడు శాతం మేరకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి రుణం తెచ్చుకోవాల్సి ఉందని, కానీ జీఎస్‌డీపీని ఎక్కువగా ఫోకస్ చేసి పరిమితులు దాటి రుణాలను తెచ్చుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు