నిరూపిస్తే రాజీనామా

26 Mar, 2016 01:30 IST|Sakshi
నిరూపిస్తే రాజీనామా

అధికార పార్టీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సవాలు
 

 సాక్షి, హైదరాబాద్: తాను అనని మాటల్ని అన్నట్టుగా డబ్బింగ్‌లు చెప్పించి, టీడీపీ కార్యాలయంలో ఎడిటింగ్ చేసిన వీడియోలతో ఇప్పటికీ ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నాలు జరుగుతుండడం బాధ కలిగిస్తోందని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను చాలెంజ్ చేస్తున్నా. ఇప్పటివరకు ఈ అసెంబ్లీకి సంబంధించి ఏడు విడతల సమావేశాలు జరిగాయి. వాటిల్లో నావి, టీడీపీ ఎమ్మెల్యేలందరి రికార్డులను బయటకు తీయండి.

ఎవరు ప్రజాసమస్యలపై మాట్లాడారు.. ఎవరు నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు.. ఎవరు పక్కవారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారో చూస్తే... దోషులుగా ఎవరు నిలుచుంటారో తేలుతుంది. ఎమ్మెల్యే అనితను నేను అనని మాటలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో రాసి.. సోషల్ మీడియాకు రిలీజ్ చేసి.. ఎవరో సెల్‌ఫోన్‌లో తీశారని వారు ప్రచారం చేస్తున్నారో.. అది నేనన్న మాటలు కాదు. ఈ విషయం టీడీపీలో అందరికీ తెలుసు. అందుకే డిసెంబర్ 18వ తేదీన సంఘటన జరిగితే 22వ తేదీ వరకు మాట్లాడలేదు.

ప్రచారం చేస్తున్న మాటలు నేనే అన్నట్టు వాళ్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నా’’ అని రోజా చెప్పారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు సహకరించిన ముఠా, వంగవీటి మోహన్‌రంగా హత్యకు సహకరించిన ముఠాల్ని ఉపయోగించుకుని.. ప్రజాసమస్యలు, ప్రత్యేకించి మహిళా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్న తనను రాజకీయంగా సర్వనాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ తొలి సమావేశాలనుంచీ ఒక పథకం ప్రకారం తన వ్యక్తిత్వాన్ని హత్యచేయించి, రాజకీయంగా, ఆర్థికంగా, అన్నిరకాలుగా తనను దిగజార్చే ప్రయత్నాలు చేశారని దుయ్యబట్టారు. చివరకు కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంలో టార్గెట్ చేసి ఏడాదిపాటు సస్పెండ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

 98నుంచి రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడైనా నోరు జారానా?
 మాట్లాడని వాటిని మాట్లాడినట్టు డబ్బింగ్‌లు చెప్పించి. ఎడిటింగ్‌లు చేసి టీడీపీ నేతలు మీడియాకిస్తే.. మీడియా కూడా ప్రజల్ని నమ్మించేలా వాటిని ఇప్పటికీ  పదేపదే ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తున్నదని రోజా అన్నారు. టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేసిన వీడియోలో తాను ఎన్ని చీరెల్లో కనిపిస్తానో గమనించాలని కోరారు. ‘‘నన్ను తిడితే పబ్లిసిటీ వస్తుందనో, చంద్రబాబు మంత్రి పదవులిస్తారని కొందరు అనుకుంటే వారి సంతోషానికి నేను అడ్డుపడను. కానీ మీడియా కూడా ఆ ప్రచారానికి సహకరించడం సరికాదు’’ అని అన్నారు. ‘‘1998 నుంచి రాజకీయాల్లో ఉన్నాను.

ఎక్కడైనా నోరు జారిన పరిస్థితుందా? మీరే మననం చేసుకోండి. అంతేగానీ ప్రభుత్వంలో ఉన్నవారి నుంచి ప్రకటనలు వస్తాయనో, లేదంటే ఒత్తిడి ఉందనో టీడీపీ ఆఫీసువారిచ్చిన సీడీల్ని పట్టుకుని ఏకపక్షంగా నాకు వ్యతిరేకంగా వీడియోలు చూపించడం చాలా బాధ కలిగిస్తోంది’’ అని రోజా మీడియానుద్దేశించి అన్నారు. మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే అనితను అవమానించాల్సిన అవసరం తనకెందుకుంటుందని ప్రశ్నించారు. అలాంటి ప్రచారాల్ని మీడియా ఇప్పటికైనా మానుకుంటే సంతోషిస్తానన్నారు. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో ఇంకా గట్టిగా ప్రజాసమస్యలపై పోరాడగలన న్నారు. అంతేగానీ తప్పు చేసేవారిని ప్రశ్నించకుండా చేసే పరిస్థితులు కల్పిస్తే భవిష్యత్‌లో చాలా అన్యాయం జరుగుతుందన్నారు. జరుగుతున్నది అధికారపార్టీకి, అధికారపార్టీలో పురుషహంకారానికి, ఒక మహిళకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆమె అభివర్ణించారు.

 సస్పెన్షన్‌తో సెక్స్‌రాకెట్ అంశం పక్కదారికి...
 కాల్‌మనీ సెక్స్ రాకెట్ అంశంలో గట్టిగా ప్రశ్నించినందుకే తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయించి ఈ అంశం మొత్తాన్ని చంద్రబాబు పక్కదారి పట్టించారని రోజా విమర్శించారు. ‘‘ఆ అంశంపై అసెంబ్లీలో మాట్లాడడం ద్వారా దుర్మార్గుల మదమణచి వారిని పట్టిస్తే.. ఇంకా బయటికి రాని మహిళలు సైతం ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే వీలుంటుందని భావించా. అయితే దానిపై మాట్లాడేందుకు ప్రయత్నించిన నన్ను సస్పెండ్ చేయడంద్వారా రాష్ట్రంలోని మహిళలందరూ అన్యాయాన్ని ప్రశ్నించడానికే భయపడే పరిస్థితి కల్పించారు’’ అని చెప్పారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ వ్యవ హారం లో డిసెంబర్ 17 నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ జరిగిన పరిణామాలను వీడియో క్లిప్పింగ్‌లు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లతోసహా ప్రదర్శిస్తూ రోజా సోదాహరణంగా వివరించారు.

 సస్పెన్షన్ వ్యవహారం వేరు.. ప్రివిలేజ్ కమిటీ వేరు
 తనను సస్పెండ్ చేసింది చంద్రబాబును కామ సీఎం అన్నానని, ప్రివిలేజ్ కమిటీ ముందున్న అంశం అనిత వ్యవహారమని.. రెండు వేర్వేరు అంశాల్ని కలగాపులగం చేసి ప్రజల్ని పక్కదారి పట్టించారని రోజా మండిపడ్డారు. టీడీపీలో పదకొండేళ్లు పనిచేశానని.. అప్పట్లో ఏనాడైనా తన పేరు వెనుక ‘రెడ్డి’ తగిలించి మాట్లాడారా? అని ఆపార్టీ నేతల్ని ప్రశ్నించారు. ఎక్కడ విలేకరుల సమావేశం పెట్టినా రోజారెడ్డి అంటున్నారు.. ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేక ఎమ్మెల్యే అనితను పావుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘‘నేను టీడీపీలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డిగారిపై రెచ్చగొట్టి ఎలా మాట్లాడించారో ప్రజలకు తెలుసు. అప్పుడు ప్రోత్సహించినవారు, ఈరోజు వారు తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తే ఎందుకింతగా గిలగిల్లాడుతున్నారు? చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్లు పెట్టమని ఉసిగొల్పినప్పుడు లేనిబాధ.. ఈరోజు తప్పు చేసినప్పుడు దాన్ని ఎత్తిచూపితే ఎందుకు బాధ?’’ అని ప్రశ్నించారు.
 
 ప్రివిలేజి కమిటీ ముందు హాజరవుతా
 ప్రివిలేజ్ కమిటీకి మూడుసార్లు పిలిచినా రాలేదని ప్రచారం చేయడాన్ని రోజా తప్పుపట్టారు. తానడిగిన సమాచారం అసెంబ్లీ నుంచి అందనందున, ఆ సమయాల్లో ఈ అంశంపైనే కోర్టులో ఉన్నందువల్లే హాజరు కాలేదని తెలిపారు. 19వ తేదీన సైతం అసెంబ్లీకి వెళ్లినప్పుడు మెడపెట్టి గెంటడం.. తర్వాత తాను ఆసుపత్రి పాలవడం ప్రజలంతా చూశారన్నారు. మెజార్టీ సభ్యులు టీడీపీవారే ఉన్నా, ప్రివిలేజ్ కమిటీవల్ల తనకు న్యాయం జరగదని తెలిసినా, ఎప్పుడు పిలిచినా ఆ కమిటీ ముందు హాజరవుతానని తెలిపారు. ఎమ్మెల్యేగా తాను కమిటీని గౌరవించకపోతే మరెవరూ గౌరవిస్తారన్నారు. ‘‘2014లో జరిగిన ఘటనలపై మేమిచ్చిన ఏ ప్రివిలేజ్ నోటీసూ చర్చకు రాలేదు.

2015లో మేం ఇచ్చినవీ రాలేదు. కానీ డిసెంబర్18 నాటి అంశం మాత్రం చర్చకు చేపట్టడమేంటీ?’’ అని ప్రశ్నిం చారు. ‘ఇది అనితపై ఉన్న ప్రత్యేకతతోనా? లేకపోతే నన్ను తొక్కేయడంపైన ఆసక్తా’ అని నిలదీశారు. అనిత జనవరిలో తనపై పరువు నష్టం దావా వేసినప్పుడే లాయర్‌ద్వారా జవాబిచ్చానని.. అదే జవాబును ప్రివిలేజ్ కమిటీ ముందు చెబుతానన్నారు. ప్రివిలేజ్ కమిటీలో టీడీపీకి మెజార్టీ ఉంది కాబట్టి.. వాళ్లు ఏదనుకుంటే అది చేయవచ్చన్న ఆలోచన వారికుండొచ్చని, కానీ ఏ తప్పు చేయని తాను భయపడే ప్రసక్తే లేదని ఆమె అన్నారు. అధికారపార్టీకి నచ్చని వారిని నిబంధనలను తోసిరాజని ఏడాదిపాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు చెడు సంప్రదాయానికి తెరలేపారని రోజా విమర్శించారు. ఇలా అధికారపార్టీకి ఇష్టంలేని వారిని సస్పెండ్ చేసుకుంటూపోతే అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండాపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.

మరిన్ని వార్తలు