వివరణకు అవకాశమివ్వలేదు

19 Dec, 2015 03:57 IST|Sakshi
వివరణకు అవకాశమివ్వలేదు

♦ సెక్స్‌రాకెట్‌పై మాట్లాడతాననే బయటకు పంపారు
♦ నాది అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే సంస్కృతి కాదు
♦ తల్లిదండ్రులు, పిల్లలపై ప్రమాణం చేసి చెబుతున్నా
♦ సస్పెన్షన్ అనంతరం రోజా ఆవేదన..  
 
 సాక్షి, హైదరాబాద్: మనీ-సెక్స్ రాకెట్‌పై టీడీపీ ఎమ్మెల్యేల పాత్ర ఎక్కడ బయటపెడతానో అన్న భయంతో తనపై అకారణంగా, నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ వేటు వేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా అధికార పక్ష తీరుపై ధ్వజమెత్తారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై చర్చ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షం తరఫున తానే మొదటి స్పీకర్‌నని, టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు తనయుడు లోకేష్ అనుచరుడైన ఎమ్మెల్సీలకు సెక్స్‌రాకెట్‌లో ఉన్న భాగస్వామ్యంపై తాను దుమ్ముదులుపుతాననే ఏకైక కారణంతోనే ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే తనను చూసి అధికార పక్షం ఎంతలా భయపడుతుందో అర్థమవుతుందన్నారు.

అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ వేటు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బూతులు మాట్లాడానని తనపై అభాండాలు వేశారని, అసెంబ్లీ సాక్షిగా, తన తల్లిదండ్రులు, పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని, బూతులు ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనది అలాంటి సంస్కృతి కాదన్నారు. తాను సీఎంకు వ్యతిరేకంగా ఇచ్చిన స్లోగన్స్ కూడా అన్ పార్లమెంటరీ పదాలు కావన్నారు. తనతో పాటు 55 మంది ఎమ్మెల్యేలు స్లోగన్స్ ఇచ్చారని, వారిని కూడా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. సభ నుంచి తనను సస్పెండ్ చేసినప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని, కనీసం రూల్స్ పట్టించుకోకుండా తనపై ఇలా పగబట్టి సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు లేదన్నారు. సీఎం చంద్రబాబు సభలో తానేదో గొప్ప వ్యక్తినని, ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు వల్ల తాను అభాసుపాలు అవుతున్నట్లు భ్రమలు కలిగించే యత్నం చేస్తున్నారని, సీఎం చేస్తున్న తప్పుల వల్ల తామంతా తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని రోజా మండిపడ్డారు. స్పీకర్ సస్పెండ్ చేసిన తీరు ఎంతో బాధించిందని, రాష్ట్రంలో మహిళల పట్ల అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు.

 ఎన్టీఆర్‌కే మైక్ ఇవ్వని చరిత్ర చంద్రబాబుది ...
 అంతకుముందు... కాల్‌మనీ-సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని చంద్రబాబు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని రోజా విమర్శించారు. ఈ వ్యవహారంపై శాసనసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇవ్వాలని పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడికి దిగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. శుక్రవారం మూడుగంటల ప్రాంతంలో సభ వాయిదా అనంతరం... అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు వి.కళావతి, పి.పుష్ప శ్రీవాణి, గౌరు చరితారెడ్డిలతో కలిసి ఆమె మాట్లాడారు. అసెంబ్లీలో ఎవరికి మైక్ ఇవ్వాలన్నది చంద్రబాబు కనుసన్నల్లోనే సాగుతోందని మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుచేటన్నారు. గతంలో రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌కే మైక్ ఇవ్వకుండా అడ్డుకున్న చరిత్ర నీది అంటూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 అందరి కాళ్లు పట్టుకొని తప్పించుకుంటున్నారు...
 కాల్‌మనీ-సెక్స్ రాకెట్‌లో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌తోపాటు, మంత్రులు కూడా భాగస్వాములయ్యారని రోజా ఆరోపించారు. అందుకే మభ్యపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. వంగలపూడి అనితను అడ్డుపెట్టుకుని తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. అంగన్‌వాడీ కార్యకర్తలను మగ పోలీసులతో కొట్టిస్తే అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ నేతలు దాడి చేస్తే పీతల సుజాత ఏం చేశారు? అని నిలదీశారు. ల్యాండ్ మాఫియా, కాల్‌మనీ-సెక్స్ రాకెట్ మాఫియాల్లో తెదేపా నేతలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారని అన్నారు. అన్ని తప్పులు చేసిన చంద్రబాబు అందరి కాళ్లు పట్టుకొని తప్పించుకుంటున్నారని విమర్శించారు. సెక్స్ రాకెట్‌లో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
 
 రోజా కంటతడి...
 సభ నుంచి సస్పెన్షన్ వేటు వేసిన అనంతరం మీడియా పాయింట్ వద్దకు వస్తున్న రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. మాట్లాడేందుకు వీల్లేదని నిలువరించడంతో ఎమ్మెల్యే కంట తడిపెట్టుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ వెలుపల మీడియాతో రోజా మాట్లాడారు.

మరిన్ని వార్తలు