ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం 3.5 లక్షలు

22 Mar, 2016 05:41 IST|Sakshi
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం 3.5 లక్షలు

- జీతభత్యాల పెంపుపై సీఎంకు వసతుల కమిటీ సిఫారసు


 సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి సభ్యుల నెలవారీ వేతనాన్ని రూ.3.5లక్షలకు పెంచాలని అసెంబ్లీ వ సతుల (ఎమినిటీస్) కమిటీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సిఫారసు చేసింది. దీంతోపాటు మాజీ శాసనసభ్యులకు పెన్షన్‌ను కూడా పెంచాలని, వైద్య చికిత్సలు పూర్తి ఉచితంగా అందించాలని పేర్కొంది. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షత న ఈ కమిటీ సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశమైంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్,  శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించిన కమిటీ... పలు ప్రతిపాదనలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలను రూ.3.5లక్షలకు పెంచాలని, వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితంగా అందించాలని పేర్కొంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు శ్లాబుల వారీగా ఒక టర్మ్ పనిచేసిన వారికి రూ. 50వేలు, రెండు టర్మ్‌లు పనిచేసిన వారికి రూ. 55వేలు, మూడు టర్మ్‌లు పనిచేసిన వారికి రూ.60 వేలు, నాలుగు అంతకన్నా ఎక్కువసార్లు పనిచేసిన సభ్యులకు రూ.65వేలు పెన్షన్‌గా చెల్లించాలని ప్రతిపాదించింది. మాజీ సభ్యుడు మరణిస్తే ఆయన భార్యకు పూర్తి పెన్షన్ అందించాలని సూచించింది. సభ్యులకు వాహనం కోసం ఇచ్చే రుణాన్ని రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తానని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఈ ప్రతిపాదనలు చేశారని కొందరు సభ్యులు వెల్లడించారు.

ఆర్‌అండ్‌బీ అధికారులపై ఆగ్రహం
ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణం ఆలస్యమవుతోందని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేకపోయారని ఆర్‌అండ్‌బీ అధికారులపై వసతుల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు, సహాయకులకు 30 ఫ్లాట్లు మొత్తంగా 150 ఫ్లాట్లతో నిర్మిస్తున్న భవనాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే వీటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు కమిటీకి తెలిపారు. వసతుల కమిటీ సమావేశంలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, టీడీపీ నుంచి సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, సంతోష్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు