పెద్దల సభకు ‘చిన్నోడు’

31 Dec, 2015 08:54 IST|Sakshi
పెద్దల సభకు ‘చిన్నోడు’

ఉద్యమమే ఊపిరిగా పద్నాలుగేళ్లు అలుపెరుగని పోరాటం చేసిన యువకుడిగా సుంకరి రాజు ఎమ్మెల్సీగా ఎంపికై తన సత్తా చాటుకున్నాడు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన సుంకరి రాజు ఊరు పేరు జోడించి తన పేరును‘ శంభీపూర్ ’ రాజుగా మార్చుకున్నాడు. 1980, జనవరి 4న ఆంజనేయులు, వినోద దంపతులకు జన్మించిన రాజు పాఠశాల స్థాయి నుంచే ఉద్యమాల్లో పాల్గొనేవాడు.

2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టగా కుత్బుల్లాపూర్‌లో మొట్టమొదటి సారి టీఆర్‌ఎస్ జెండా ఎగురవేశాడు. 2006లో కేటీఆర్ అమెరికా నుంచి తిరిగి రావడంతో ఆయన అనుచరుడిగా గుర్తింపు పొందిన శంభీపూర్ రాజు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు.
 
అంచెలంచెలుగా ఎదిగి..
2001లో టీఆర్‌ఎస్ పార్టీ మండల కోశాధికారిగా, బీసీ సెల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, యువజన విభాగం సెక్రటరీ జనరల్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ పటిష్టతకు కృషి చేశాడు.
 
వరంగల్ సభకు విరాళాల సేకరణ నిమిత్తం కేసీఆర్ కూలి పనులు చేసేందుకు సిద్దం కాగా అందుకు కుత్బుల్లాపూర్‌ను ఎంపిక చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించడమేగాక, రూ. 50 లక్షలు సేకరించి కేసీఆర్‌తో శభాష్ అనిపించుకున్నాడు. తన ఉద్యమ ప్రస్తానాన్ని కొనసాగించిన రాజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ బుధవారం జరిగిన కౌంటింగ్‌లో మెజార్టీ సాధించారు.
 
పెద్దల సభకు చిన్నోడు..
1980 జనవరి 4న జన్మించిన శంభీపూర్ రాజు రెండు శాసన మండళ్లలో అందరికంటే చిన్నవాడు కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు