ఎంఎంటీఎస్ రైళ్లకు అంతరాయం

3 Feb, 2015 10:52 IST|Sakshi
ఎంఎంటీఎస్ రైళ్లకు అంతరాయం

నేడు, 7వ తేదీన నిలిచిపోనున్న సర్వీసులు
 
సిటీబ్యూరో: నగరంలోని భరత్‌నగర్-సనత్‌నగర్ రైల్వేస్టేషన్‌ల మధ్య ట్రాక్‌లపై మెట్రో రైలు క్రాసింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా ఈ నెల 3,7 తేదీలలో  వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపి వేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజుల్లో మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారు. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తారని వివరించారు. మొత్తం 20 ఎంఎంటీఎస్ సర్వీసులపై నిర్మాణ పనుల ప్రభావం పడనుందని  సీపీఆర్వో పేర్కొన్నారు. లింగంపల్లి-ఫలక్‌నుమా, నాంపల్లి-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్‌లు నిలిచిపోనున్నాయి.

ఫలక్‌నుమా-నాంపల్లి మధ్య నడిచే కొన్ని ఎంఎంటీఎస్‌లను సికింద్రాబాద్ వరకే పరిమితం చేస్తారు. వికారాబాద్-కాచిగూడ, తాండూరు-హైదరాబాద్, సికింద్రాబాద్-వికారాబాద్ పాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయి. పూనే-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పూనే నుంచి లింగంపల్లి వరకే నడుస్తుంది. లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఈ సర్వీసు నిలిచిపోతుంది. మధ్యాహ్నం 1.45 కు బయలుదేరవలసిన వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్ ఈ రెండు తేదీలలో (ఫిబ్రవరి 3,7) మధ్యాహ్నం 2.30కి వికారాబాద్ నుంచి బయలుదేరుతుంది.
 

మరిన్ని వార్తలు