కానిస్టేబుల్ రెండో కాపురం చిచ్చు

27 Mar, 2016 10:22 IST|Sakshi

భర్త రెండో కాపురం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మొదటి భార్యపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో అనంతపురంలోని గౌరవ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... గంగాధర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కళ్యాణదుర్గం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. డెప్యూటేషన్‌పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని కోర్టు మానిటరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కొండమ్మ, కుమారులు నితీష్, రుతిక్ ఉన్నారు.


అయితే, గంగాధర్ సుమారు ఏడాదిన్నరగా వేరే మహిళతో కాపురం పెట్టాడు. మొదటి భార్యకు విడాకులివ్వలేదు. ఈ విషయమై భార్యభర్తలు పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండో కాపురం పెట్టిన మహిళతో ఉన్నాడనే సమాచారం అందుకున్న కొండమ్మ, అన్న రంగస్వామి, తల్లితో కలిసి వెళ్లింది. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న గంగాధర్ లోపల గడియపెట్టుకుని బయటకు రాలేదు. తన బంధువులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండమ్మ, రంగస్వామిపై దాడి చేశారు. దీంతో రంగస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ రెడ్డప్ప ఘటనాస్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు