మొబైల్‌ నంబర్‌ కొట్టేశారు..!

2 Sep, 2017 04:07 IST|Sakshi
మొబైల్‌ నంబర్‌ కొట్టేశారు..!
- ఫోర్జరీ పత్రాలతో ఫ్యాన్సీ నంబర్‌ తస్కరణ
జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
 
హైదరాబాద్‌: నగలు, నగదు, బైక్‌లు, కార్లు, ఫోన్లు ఇప్పటివరకూ ఇలాంటి దొంగతనాలను ఎన్నోచూసే ఉంటారు. ఇకపై ఇలాంటి వాటినే కాదు మీ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ను సైతం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఓ ఫ్యాన్సీ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ తస్కరణకు గురైంది మరి. తన ఫోన్‌ నంబర్‌ చోరీకి గురైందంటూ శుక్రవారం ఓ వ్యక్తి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నివసించే రాకేష్‌చంద్ర గౌరిశెట్టి(28) మూడేళ్ల క్రితం ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్‌ నుంచి ఓ ఫ్యాన్సీ నంబర్‌ తీసుకున్నాడు.

గతనెల 17న థాయ్‌లాండ్‌కు వెళ్లిన రాకేష్‌ తన ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేశాడు. అనంతరం 21వ తేదీన నగరానికి వచ్చిన అతను ఫోన్‌ను ఆన్‌ చేసి చూడగా నో సర్వీస్‌ అని వచ్చింది. దీంతో వొడాఫోన్‌ స్టోర్‌కి వెళ్లాడు. డాక్యుమెంట్లు ఇస్తే కొత్త నంబర్‌ ఇస్తామని వారు చెప్పడంతో పత్రాలన్నీ ఇచ్చి 3 రోజుల తర్వాత వెళ్లి నంబర్‌ తీసుకున్నాడు. అయితే ఆ నంబరూ నో సర్వీస్‌ అనే వచ్చింది. దీంతో వొడాఫోన్‌ నోడల్‌ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. ఒడిశాలోని వొడాఫోన్‌ స్టోర్‌లో నంబర్‌ను రీప్లేస్‌మెం ట్‌ చేసుకోవాలని చెప్పారు. అతని పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసి నంబర్‌ దొంగిలించారని, అందువల్ల అక్కడికే వెళ్లి రీప్లేస్‌ చేసుకోవాలని సూచించారు. దీంతో తన పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఫోర్జరీ చేసి తన ప్రమేయం లేకుండానే తన ఫ్యాన్సీ నంబర్‌ను తస్కరించారని రాకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు