అదుపు తప్పిన విమానం!

12 Mar, 2016 00:07 IST|Sakshi
అదుపు తప్పిన విమానం!

♦ రన్‌వేపై ఘటన
♦ ప్రయాణికులకు తీవ్ర గాయాలు
♦ పరుగులు పెట్టిన భద్రతాదళాలు
♦ అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్
 
 శంషాబాద్: అది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. అర్ధరాత్రి 12 గంటలు.. మరికాసేపట్లో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానంలో హైడ్రాలిక్ పవర్ సమస్య తలెత్తింది. ఆ వెంటనే రన్‌వేపై అదుపు తప్పింది. ఆ కుదుపునకు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానంలోని స్మోకింగ్ అలారం మోగగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు క్రాషింగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. వైద్యుల బృందం, విమానాశ్రయ భద్రతా బలగాలు విమానం సమీపంలోకి క్షణాల్లో చేరుకున్నాయి. హుటాహుటిన ప్రయాణికులను, సిబ్బందిని బయటకు తరలించి ఆ సమీపంలోనే వైద్య సేవలు ప్రారంభించారు.

అచ్చంగా నిజమనిపించే ఈ మాక్‌డ్రిల్ గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో నిర్వహించారు. విమా నం కుప్పకూలితే తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టిన ఈ మాక్‌డ్రిల్ విమానాశ్రయ సిబ్బందితోపాటు ప్రయాణికులనూ అప్రమత్తం చేసింది. దేశంలోనే ప్రథమంగా అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్  నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ఇందులో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్ సెక్యూరిటీ, జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం, సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ విపత్తుల శాఖ సిబ్బంది, జిల్లా వైద్యాధికారులు, 500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఇం దుకు వినియోగించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండున్నర గంటలపాటు మాక్‌డ్రిల్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు