పల్లెలకు ఆధునిక వైద్యం

19 Jan, 2018 02:23 IST|Sakshi

టెలీ మెడిసిన్‌ విధానంతో సేవలు

పీహెచ్‌సీల వరకు అనుసంధానం

ప్రతిరోజూ వైద్య నిపుణుల సలహాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రభుత్వ వైద్య సేవలకు ఆధునిక సాంకేతికతను జోడించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్యసేవలలో టెలీ మెడిసిన్‌ విధానం అమలుకు అడుగులు పడుతున్నాయి. బోధన, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వరకు త్రీజీ ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి ఈ సేవలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న టెలీమెడిసిన్‌ పద్ధతిని అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలలో పూర్తి స్థాయిలో టెలీమెడిసిన్‌ అమలుకు రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాణాంతక జబ్బులకు పీహెచ్‌సీ స్థాయిలోనే వెద్యం అందించేందుకు ఈ విధానంతో వీలవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వేగంగా వైద్యం అందడంతోపాటు రవాణా, ఇతర ఖర్చులు ఆదా అవుతాయని చెబుతున్నారు. అన్ని పీహెచ్‌సీల్లో ల్యాప్‌టాప్‌లు ఉన్నందున సాంకేతికంగా అనుసంధానం చేస్తే కొత్త విధానంలో ఉత్తమ సేవలు అందించవచ్చని చెబుతున్నారు. టెలీమెడిసిన్‌ విధానానికి న్యాయపరమైన అనుమతులు ఉన్నాయని, దీన్ని అమలు చేస్తే పేదలకు ఆధునిక వైద్యం అందుతుందని అంటున్నారు.  

చికిత్స, మందులు.. అంతా ఆన్‌లైన్‌..
ఈ విధానంలో అన్ని రకాల వైద్య సేవలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న పెద్దాసుపత్రి (సూపర్‌ స్పెషాలిటీ)ని, కిందిస్థాయిలోని జిల్లా ఆసుపత్రులను, ఏరియా ఆసుపత్రులను, గ్రామాల్లోని పీహెచ్‌సీలను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేస్తారు. అన్ని చోట్ల వీడియో కాలింగ్‌ సదుపాయం కల్పిస్తారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని వైద్య నిపుణుడు ఆన్‌లైన్‌తో అనుసంధానంగా ఉండే కిందిస్థాయి ఆస్పత్రిలోని వైద్యులతో ప్రత్యక్షంగా వీడియో వైద్య సేవలపై సలహాలు, సూచనలను ఇస్తారు.

రోగితోనూ నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ పద్ధతిలో మాట్లాడతాడు. రోగి వైద్యపరీక్షల నివేదికను ఈ–మెయిల్‌లో తెప్పించుకుని, పరిశీలించి అవసరమైన ఔషధాల జాబితాను ఆన్‌లైన్‌లోనే పంపిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది. గ్రామీణులు ఇబ్బందిపడుతూ నగరాలకు రాకుండానే టెలీ మెడిసిన్‌తో వైద్యం పొందే అవకాశం ఉంటుంది.  

రాష్ట్రంలోని పీహెచ్‌సీలు, కమ్యూనిటీ ఆస్పత్రులు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు అన్నింట్లోనూ వైద్య సేవలు ఉన్నప్పటికీ, నగరాల్లోని బోధన ఆస్పత్రుల్లోనే అన్ని రకాల సేవలు అందుతున్నాయి. ప్రాణాంతక, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న గ్రామీణ ప్రాంత రోగులు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. పీహెచ్‌సీలకు వెళ్తే అక్కడ ఒక స్థాయి వరకే వైద్యం అందుతోంది.

రవాణా ఖర్చులు భరించలేక, దూర ప్రయాణాలు చేసే ఓపిక లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. టెలీ మెడిసిన్‌ విధానంతో ఈ పరిస్థితిని మార్చవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌ ఆసుపత్రి నుంచి సింగరేణి కాలరీస్‌ కంపెనీ పరిధిలోని ఆసుపత్రులకు టెలీ మెడిసిన్‌ సదుపాయం ఉంది. కొన్ని వైద్యసేవలను ఈ విధానంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు వీటిని విస్తరించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది.


తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులు, పడకల సంఖ్య...
బోధన ఆస్పత్రులు              20    8,465
జిల్లా ఆస్పత్రులు                  7    1,500
ఏరియా ఆస్పత్రులు             32    3,200
కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు     119    3,950
మాతాశిశు ఆస్పత్రులు          3    150
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు    683    4,098
సబ్‌ సెంటర్లు                  4797    ––

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు