నేను అలా అనలేదు: మహమూద్‌ అలీ

26 Aug, 2016 22:06 IST|Sakshi

 ఒలింపింక్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని సాధించిన ‘సింధూ’ దేశానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. అటువంటి సింధూను మనకిచ్చిన కోచ్ పుల్లెల గోపిచంద్ దేశం గర్వించదగ్గ కోచ్ అని ఆయన కొనియాడారు. వందమంది సింధూలను తయారు చేయగలిగిన సత్తా కోచ్ గోపిచంద్‌కు ఉందన్నారు. గోపిచంద్ మరో అకాడమీని స్థాపించే ఆలోచన ఉంటే సహకరిస్తానని మాట్లాడిన మాటలను మీడియా వేరే విధంగా చిత్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ఓ పత్రికా ఆవిష్కరణ సభలో ఆయన పై విధంగా స్పందించారు. మీడియా అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. రజత పథకం సాధించిన సందర్భంగా సింధూకు నిర్వహించిన సన్మాన సభలో గోపించంద్ భారత్ గర్వించదగ్గ కోచ్ అని, మరో అకాడమీ స్థాపించే ఆలోచన ఉంటే తాను సహకరిస్తానని చెప్పానన్నారు. గోపిచంద్ ఆధ్వర్యంలో మంచి టీమ్‌ను ఇచ్చేందుకు తన వంతు సాయం చేస్తానని సభా ముఖంగా తెలిపానన్నారు. వంద మంది సింధూలను తయారు చేసి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేగలిగిన సత్తా ఒక్క గోపించంద్‌కు ఉందన్నారు.

ఈ వ్యాఖ్యలను మీడియా మరోలా చిత్రీకరించడంతో దేశవ్యాప్తంగా తను విమర్శలను ఎదుర్కొనడం జరిగిందన్నారు. ఇటివల నీటి ఒప్పందాలపై మహరాష్ట్ర వెళ్లినప్పుడు అక్కడ మీడియా కూడా ఇదే విషయంపై  ప్రశ్నించడం బాధ కలిగించిందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనే ఉండి స్పందించడంతో ఉపశమనం పొందానన్నారు. ఒక వార్త రాసేప్పుడు సరైన ఆధారాలతో రాస్తే సమాజానికి మేలు కలుగుతుందన్నారు. ఎల్లప్పుడూ గోపించద్‌కు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు