నోట్ల కట్టలే కట్టలు

15 Mar, 2014 01:13 IST|Sakshi
నోట్ల కట్టలే కట్టలు

 పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్నలక్షలాది రూపాయలు
 ఆధారాలు చూపిస్తుండడంతోతిరిగి అప్పగింత
 ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
 
 
 నల్లకుంట,అఫ్జల్‌గంజ్,న్యూస్‌లైన్: పురపాలక,స్థానిక, సాధారణ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు తనిఖీలు విస్తృతం చేస్తుండగా.. నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. లక్షలాది రూపాయలు పట్టుబడుతుండగా.. ఆధారాలు చూపిస్తుండడంతో వెంటనే వాటిని తిరిగి అప్పగిస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా కోట్లాదిరూపాయలు పట్టుబడగా వాటిని అప్పగించారు. శుక్రవారం మధ్యాహ్నం నల్లకుంట పోలీసులు న్యూనల్లకుంట నారాయణ కాలేజీ సమీపంలోని  అంబుజా అపార్ట్‌మెంటు మార్గంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా..సిండికేట్ బ్యాంకు వైపు వెళ్తున్న టాటా సుమో (ఏపీ 09ఎక్స్7785)ను తనిఖీ చేయగా రూ.66.49 లక్షల బండిళ్లు కనిపించాయి. విచారణలో బ్రింగ్‌ఆర్యన్ ఏజెన్సీ, ప్రిజమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆయా బ్యాంకుల ఏటీఎంలలో నగదు పెట్టేందుకు వెళ్తున్నట్లు నిర్దారించారు. అనంతరం ఆ నగదు మొత్తాన్ని తిరిగి అప్పగించారు.
 
 రూ.6 లక్షలు ఐటీ అధికారులకు అప్పగింత : అఫ్జల్‌గంజ్ బస్టాండులో సీఐ అంజయ్య నేతృత్వంలో తనిఖీలు చేస్తుండగా బెంగళూరు నుంచి మహేందర్‌కుమార్‌జైన్ కారులో రూ.6లక్షల నగదు లభించింది. దీనికి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఐటీ అధికారులకు అప్పగించారు. అలాగే బైక్‌పై జాంబాగ్ ప్రాంతానికి చెందిన సుదర్శన్ వద్ద రూ.1.41లక్షల నగదు లభించగా..బ్యాంకు పత్రాలు  చూపించడంతో తిరిగి ఇచ్చేశారు.
 
 మరో ఘటనలో రూ.36 లక్షలు
 నేరేడ్‌మెట్: నేరేడ్‌మెట్ పోలీసులు కృపాకాంప్లెక్స్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.36 లక్షలు లభ్యమయ్యాయి. విచారించగా ఆయా బ్యాంకులకు చెందిన డబ్బుగా తేలింది. అయితే వీరి వద్ద బ్యాంకులకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు సీఐ చంద్రబాబు వెల్లడించారు. అలాగే సైదాబాద్ పోలీసుల తనిఖీల్లో అక్బర్‌బాగ్‌కు చెందిన అమన్‌అలీ వద్ద రూ.4.37 లక్షలు పట్టుబడ్డాయి. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు. మరో ఘటనలో లంగర్‌హౌస్ పోలీసుల తనిఖీల్లో రూ. 1.30 లక్షలు పట్టుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు