మరింత తగ్గనున్న ఇంజనీరింగ్‌ సీట్లు!

3 Jan, 2017 04:11 IST|Sakshi
మరింత తగ్గనున్న ఇంజనీరింగ్‌ సీట్లు!

బ్రాంచీల రద్దుకు 80కి పైగా కాలేజీల దరఖాస్తు
ప్రవేశాల రద్దుకు దరఖాస్తు చేసిన మరో 11 కాలేజీలు
దరఖాస్తులను పరిశీలిస్తున్న జేఎన్‌టీయూహెచ్‌
నెలాఖరులో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలు షురూ!
కాలేజీల గుర్తింపు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏఐసీటీఈ
ఈనెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు దరఖాస్తుల స్వీకరణ  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా తగ్గనున్నాయి. 11 కాలేజీల వరకు ప్రవేశాలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోగా, 80కి పైగా కాలేజీలు బ్రాంచీలను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. కాలేజీల్లోని వివిధ బ్రాంచీల్లో సీట్లను తగ్గించుకునేందుకు మరో 10కి పైగా కాలేజీల నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకే తిక విశ్వ విద్యాలయం–హైదరాబాద్‌ (జేఎన్‌టీ యూహెచ్‌)కు దరఖాస్తులు వచ్చాయి. కాలేజీల్లో కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు కోసం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేసేందుకు జేఎన్‌టీయూహెచ్‌ ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ గడువు డిసెంబరు 27వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. జేఎన్‌టీయూహెచ్‌ ఇచ్చే ఎన్‌వోసీతో కాలేజీ యాజమాన్యాలు ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకోనున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 219 కాలేజీల్లో 1.04 లక్షల సీట్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో 75 వేల వరకే సీట్లు భర్తీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి మరింతగా సీట్లు తగ్గిపోనున్నాయి.

గుర్తింపునకు ఏఐసీటీఈ నోటిఫికేషన్‌
సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 5వ తేదీ నుంచి సాంకేతిక విద్యా కాలేజీ యాజమాన్యాలు గుర్తింపు, కోర్సుల రద్దు, బ్రాంచీల రద్దు, సీట్ల తగ్గింపు, కాలేజీల షిఫ్టింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య రుసుముతో (పాత కాలేజీలు) వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. కాలేజీల అనుమతుల ప్రక్రియను పిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారం భిస్తామని, ఏప్రిల్‌ 10 లోగా పూర్తి చేస్తామని ఏఐసీటీఈ మెంబర్‌ సెక్రటరీ అలోక్‌ ప్రకాశ్‌ మిట్టల్‌ ఆ నోటిఫికేషన్‌లో వివరించారు.

కసరత్తు వేగవంతం చేసిన జేఎన్‌టీయూహెచ్‌
ఏఐసీటీఈ నోటిఫికేషన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో యూనివర్సిటీ నుంచి కాలేజీలు అనుబంధ గుర్తింపును (అఫిలియేషన్‌) పొందే ప్రక్రియపైనా జేఎన్‌టీయూహెచ్‌ దృష్టి సారించింది. కాలేజీల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. జనవరి మొదటి లేదా రెండో వారంలో ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఇటీవల నిర్ణ యించింది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించి.. మరోవైపు తనిఖీలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో తనిఖీలను ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించింది. నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 25 నుంచి కాలేజీల్లో తనిఖీలు ప్రారంభించే అవకాశం ఉంది.

వీలైతే కలసి.. లేదంటే సమాంతరంగా తనిఖీలు
ఏఐసీటీఈ బృందాలు కాలేజీల్లో సదుపాయాలపై తనిఖీ చేయనున్నాయి. వీలైతే ఏఐసీటీఈ బృందాలతో జేఎన్‌టీయూహెచ్‌ ఎఫ్‌ఎఫ్‌సీ బృందాలు కలసి తనిఖీలు చేసే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి అనుమతుల ప్రక్రియ, కాలేజీల తనిఖీలను ఏఐసీటీఈ ప్రారంభించనుంది. దీంతో కలసి తనిఖీలు చేపట్టే అంశంపై ఏఐసీటీఈతో మాట్లాడేందుకు జేఎన్‌టీయూహెచ్‌ సిద్ధమవుతోంది. తద్వారా కాలేజీల్లో సదుపాయాలు, లోపాలు, సమస్యలపై తనిఖీలను మరింత పక్కాగా, పారదర్శకంగా చేపట్టవచ్చని భావిస్తోంది. అలా వీలుకాకపోతే సొంతంగా తనిఖీలు జరపనుంది. మే నెలలో యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయనుంది. జూన్‌ 1వ తేదీకల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది.

మరిన్ని వార్తలు