పంచాయతీలకు మరిన్ని అధికారాలు

21 Mar, 2016 03:35 IST|Sakshi
పంచాయతీలకు మరిన్ని అధికారాలు

- ఈ సమావేశాల్లోనే చట్టం తీసుకువద్దాం: సీఎం కేసీఆర్
- పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు
- అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేస్తాం
- మంత్రి ఆధ్వర్యంలో విధివిధానాలపై అధ్యయనానికి ఆదేశం
- క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో పంచాయతీలను పటిష్టం చేయాలని, వాటి బాధ్యతను మరింత పెంచేలా విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే దీనికి సంబంధించి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువద్దామని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామాల సమగ్రాభివృద్ధి సాధించాలని, అన్ని గ్రామాల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. దీంతోపాటు గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని, ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు.

పంచాయతీరాజ్ శాఖపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, పోచారం, ఈటల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. గ్రామీణాభివృద్ధిలో పంచాయతీల పాత్ర కీలకమైందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతోపాటు పాటు పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, పిచ్చిమొక్కల తొలగింపు, పిచ్చికుక్కల నివారణ, మురికి గుంటలు లేకుండా చూడటం లాంటి కార్యక్రమాలు పంచాయతీలే నిర్వహించాలన్నారు. అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు అంటు వ్యాధుల బారినపడుతున్నారని, పరిశుభ్రత పాటిస్తే ఆ దుస్థితిని నియంత్రించవచ్చని సీఎం చెప్పారు.

సర్పంచ్‌లు, కార్యదర్శులు గ్రామాభివృద్ధిలో, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని... ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణలో భాగంగా చెత్త సేకరణ కోసం గ్రామ పంచాయతీలకు 25 వేల సైకిల్ రిక్షాలను వీలైనంత త్వరగా అందించాలని అధికారులకు సూచించారు. ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయాలని, క్లస్టర్ల వారీగా కార్యదర్శులను నియమించాలని ఆదేశించారు. అవసరమైతే మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

గ్రామాల్లో డంప్ యార్డుల ఏర్పాటు, స్మశాన వాటికల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంచాయతీల ద్వారా ప్రజలకు కావాల్సిన పనులు, రావాల్సిన అనుమతులు సకాలంలో వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామ పంచాయతీలకు అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించే అంశంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు