మై మామ్.. మై లవ్

10 May, 2015 00:21 IST|Sakshi
మై మామ్.. మై లవ్

అమ్మ కోసం... నేను సైతం...
అంటున్న యువత
ఒక్క ‘థ్యాంక్స్’తో సంతోషాన్నివ్వచ్చంటున్న సర్వే
 

ఇటీవల పి అండ్ జి సంస్థ ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో తల్లి ఆశిస్తోంది పిల్లల నుంచి చిన్న కృతజ్ఞతా పూర్వకమైన మాటేనని, తల్లి
చేసే సేవలకి థ్యాంక్స్ చెప్తున్నవారి కంటే చెప్పనివారే ఎక్కువని తేలింది. జన్మ అనే గొప్ప వరాన్ని అందించిన మాతృమూర్తికి ఇష్టమైనవో,  కోరుకున్నవో ఇచ్చి సంతోషపెడుతున్నవారు మరీ తక్కువగా 30 శాతానికి మించి లేరట. జన్మనివ్వడంతో పాటు ఫ్రెండ్ నుంచి గైడ్ దాకా మనకు అనువుగా తనను తాను మార్పు చేర్పులకు గురిచేసుకుంటూ, ప్రతి నిమిషం మనకోసమే ఒళ్లంతా కళ్లుచేసుకుని, మనల్ని కళ్లారా కాచుకుంటున్న అమ్మ కోసం ఏదైనా చేద్దాం. మదర్స్‌డే సందర్భంగా అమ్మ కళ్లల్లో ఆనందం కోసం నిరంతరం తపిస్తూ... ఆమె సంతోషమే తమకు సగం బలం అనీ, తమ విజయాలకు మూలం అని నమ్ముతున్న వ్యక్తుల గురించి ‘మదర్స్‌డే స్పెషల్’లో... -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
‘శాంత బయోటెక్’ ఫౌండర్‌గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ  దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి.
 మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు..                           
 
 ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి.
 
‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ.
 
 ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్‌డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత.
 
‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత.
 
‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్‌కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం.
 
‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి.
 
‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ.
 
విసుక్కునేది కాదు..

నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్‌లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది.
 
పూర్తి శాకాహారి..


మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్‌వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్‌తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి.
 
ఇప్పుడు 84 ఏళ్లు..

నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’.       
 
ఎంత ఓపికో..
 
ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు.  అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే...
 
‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ

 
‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఆర్‌ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్‌లో చేరారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది.

వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా.  ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’.       
 - గోరుకంటి రవీందర్‌రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్
 
‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’             
 
అమ్మా నీవే నేను నేనే నీవు
నేను నీలో అంతర్భాగానిని
నీవు నాలో అంతర్వాహినివి..!
  - వరప్రసాద్ రెడ్డి
 
నాన్న జ్ఞాపకాలతో కుంగిపోకుండా...
 
మా అమ్మగారు మనోహరం(60). ఒకప్పుడు టీచర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. మా నాన్నతో చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ అమ్మకి. సడెన్‌గా ఫాదర్ త్రీ ఇయర్స్ బ్యాక్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఫాదర్ చనిపోయిన షాక్‌తో ఉన్న అమ్మ కోసం 6 నెలల పాటు అన్ని పనులూ మానేశా. చెన్నై రీ రికార్డింగ్ వెళితే అక్కడికి తీసుకెళ్లేవాడ్ని. అయితే ఎన్ని చేసినా అమ్మ పూర్తిగా రికవర్ కావడం లేదనిపించి... మా ఇంటికి దగ్గర్లో ఉన్న చిన్నపిల్లల గార్మెంట్స్ షాప్ సేల్‌కి ఉంటే కొనేశాను. ఆ షాప్ బాధ్యతలు అమ్మకు అప్పజెప్పాను. నిజానికి నాకు బిజినెస్ అంటే ఏమిటో అసలు తెలీదు. అయితే నాకు తెలుసు అమ్మ ఏదైనా బాధ్యత అప్పజెపితే అందులో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోతుందని, 100 శాతం ఎఫర్ట్ పెడుతుందని. నేననుకున్నట్టే, ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక...నాన్న జ్ఞాపకాల నుంచి అమ్మ బాగా తేరుకుందని అనిపించాక, ఆ షాప్ మా బంధువులకు ఇచ్చేసి అమ్మని ఆ బాధ్యతల నుంచి తప్పించాను. నా ఫస్ట్ ఫిలిమ్ జై నుంచి నా గురించి వచ్చిన అన్ని మీడియా ఇంటర్వ్యూలను, వార్తలను కలెక్ట్ చేసి 3 ఆల్బమ్స్‌గా చేసి నా బర్త్‌డేకి  మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది అమ్మ.  కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అమ్మకి ఏసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. ప్రేయర్  చేస్తుంటుంది. నేనే చర్చిలకు తీసుకెళుతుంటాను. . నేను క్రీస్తు ఆల్బమ్స్ చేసిన వెంటనే తొలిశ్రోత అమ్మే. కల్వరి ఆల్బమ్స్ చేసినప్పుడు మా ఇంట్లోనే కంపోజ్ చేసేవాడ్ని. మా అమ్మగారికి వినిపించేవాడిని. అయితే మనం ఎన్ని చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం అని నాకు తెలుసు. అమ్మ త్యాగానికి సాటి లేదు. అమ్మ చేసే సేవకు సాటిరాదు.     - అనూప్‌రూబెన్స్, సంగీత దర్శకుడు
 
ఫిట్‌నెస్ రొటీన్  అలవాటు చేశా...

 
నేను సీనియర్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. మా మమ్మీ సుచిత్ర నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా లక్కీ. తను ఏదీ ఎప్పుడూ ఆర్డర్స్ వేయదు. గైడ్ చేస్తుంటుందంతే. ఒక స్నేహితురాలిలా నాతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంది. నాకోసం వెతికి వెతికి అన్నింటికన్నా బెస్ట్ నాకు ఇస్తుంటుంది. నా కోసం తను ఏం చేయదు? అని అడిగితే అసలు ఏం చెప్పాలో తెలీనంత చేస్తుంది. అంత చేసే అమ్మ కోసం నేను కూడా ఏదైనా చేయాలనిపిస్తుంటుంది. తను టీచర్‌గా పనిచేస్తుంది. స్కూల్‌లో అలసిపోయి వచ్చినట్టు అనిపిస్తే వెంటనే షాపింగ్‌కో, లాంగ్‌డ్రైవ్‌కో తీసుకెళతాను. తను రిలాక్స్ అయ్యేలా చేస్తాను. వంట పనిని నేను కూడా తరచుగా షేర్ చేసుకుంటాను. మిడల్ ఏజ్‌లో ఎక్సర్‌సైజ్ కంపల్సరీ కదా... అందుకే మమ్మీని జిమ్‌కి అలవాటు చేశాను. ఈవెనింగ్ 7 నుంచి 8 గంటల మద్యలో ఇద్దరం కలిసే జిమ్‌కి వెళతాం. నేను ఎక్కువగా ఎరోబిక్స్ చేస్తాను. మమ్మీ  బాడీ కండిషనింగ్, పర్సనల్ ట్రైనింగ్‌తో వర్కవుట్స్ చేస్తుంది. అమ్మ నాతో అన్నీ చెబుతుంది. నేను కూడా తనతో అన్నీ దాచుకోకుండా చెప్తాను. ప్రతి రోజు ఆ రోజులో జరిగినవన్నీ షేర్ చేసుకుంటాం. బైక్ మీద రౌండ్స్ తీసుకెళుతుంటే చిన్నపిల్లలా సరదా పడుతుంది.
- క్లారా ఇషిత...
 
పాడమని ప్రోత్సహించా...

నాకు జీవితంలో లభించినవన్నీ అమ్మ సప్నాదాస్ వల్లే. ఎలా మాట్లాడాలి? ఎలా తినాలి? ఎలా మసలుకోవాలి..అన్నీ నేర్పింది అమ్మే. లైఫ్‌ని లీడ్ చేయడానికి అన్ని రకాల కాన్ఫిడెన్స్ ఇచ్చింది అమ్మే. చాలా విషయాల్లో మా ఇద్దరికీ ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కాని చివరికి ఆమె చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పనీ నాకోసమే అని అర్ధమవుతుంటుంది. అన్నీ అందించిన అమ్మకి ఏవేవో ఇవ్వాలని అనిపిస్తుంది. అయితే తను గిఫ్ట్స్‌వద్దంటుంది. అందుకని ఖాళీ దొరికినప్పుడు, ఏ మాత్రం సమయం చిక్కినా  తనతోనే స్పెండ్ చేస్తున్నా. అయినా అది సరిపోదు కదా... ఆమెకు ఆనందం కలిగించేవి ఏమిటా అని పరిశీలిస్తూ వచ్చా... ఆమెకు పాడడం అంటే బాగా ఇష్టం అని గ్రహించా. దాంతో పాడమంటూ ఎంకరేజ్ చేయడం ప్రారంభించా. అమ్మ చాలా బాగా పాడుతుంది. మీకు తెలుసా? ఇప్పుడు తను స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తోంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడంలో నేనూ పాలు పంచుకుంటున్నా. తనకున్న ఓ మంచి అభిరుచి తీర్చుకోవడానికి నేను ఒక కారణం కావడం నాకెంతో సంతోషాన్ని అందిస్తోంది.   
- శ్రద్ధాదాస్, సినీనటి
 
డ్యాన్స్ అలవాటు చేశా...
 
నేను లెవెన్త్ స్టాండర్డ్ చదువుతున్నా. మమ్మీ (కిరణ్ డెంబ్లా) పెద్ద ఫిట్‌నెస్ ప్రీక్ అని సిటీ మొత్తానికి తెలిసిందే. ఆమె ఎప్పుడూ వర్కవుట్స్, ట్రైనింగ్స్ అని స్ట్రెయిన్ అవుతుంటుంది కదా... నాకేమో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తనకు వండర్‌ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వాలంటే డ్యాన్స్‌లో ఉన్న కిక్ టేస్ట్ చేయించాల్సిందే అనిపించింది. అందుకే నాతో పాటు తనను మాదాపూర్‌లోని డ్యాన్స్ స్కూల్‌కి తీసుకెళుతున్నా. ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తాం. మమ్మీతో ఉంటే ఒక ఫ్రెండ్‌తో ఉన్నట్టే ఉంటుంది. తనతో నన్ను అన్ని పార్టీలకు, ఈవెంట్స్‌కి తీసుకెళుతుంటుంది. వయసులో చిన్న అనీ, నాకేమీ తెలియదనీ తీసిపారేయకుండా నా ఆలోచనలకి ఇష్టాఇష్టాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే తన కోసం, తన సంతోషం కోసం ఏదైనా చేయాలని నేనూ రోజూ ప్లాన్ చేస్తుంటా. కేవలం ఒక్క రోజే కాదు. ప్రతి రోజూ నాకు మదర్స్‌డేనే.    - ప్రియాంక
 
వండి వడ్డిస్తా...

 
 
మా మమ్మీ (సుశీల బొకాడియా)కి సోషల్ యాక్టివిటీస్ ఎక్కువుంటాయి. అటు ఇంటిపని, ఇటు సోషల్ వర్క్‌తో చాలా టైర్డ్ అవుతుంటుంది. అందుకే తను ఇంటికి వచ్చి రెస్ట్‌లెస్‌గా ఫీలైనా... హ్యాపీ మూడ్‌లోకి తేవడానికి ట్రై చేస్తా. దీని కోసం తరచుగా నా పర్సనల్ వర్క్ కూడా పక్కన బెట్టేస్తా. డాడీ బిజినెస్‌లో బిజీగా ఉంటే నన్ను, తమ్ముడ్ని మమ్మీ ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకుందో నాకు తెలుసు. తనను హ్యాపీగా ఉంచడం మా బాధ్యత. నాకు కుకింగ్ వచ్చు. తమ్ముడి హెల్ప్ తీసుకుని తరచుగా తనకు ఇష్టమైన వంటలు  స్వయంగా వండి వడ్డిస్తా. అప్పుడు మమ్మీ ఫేస్‌లో చెప్పలేనంత ఆనందం. అది చూస్తే నాకెంత హ్యాపీ అనిపిస్తుందో... ఎప్పుడైనా సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ తెచ్చిస్తే... ‘‘ఎందుకురా ఇవన్నీ’’ అంటూ చిన్నగా కోప్పడుతుంది. తమ్ముడు, నేను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవడం ఒక్కటే తనకు మేమిచ్చే అత్యుత్తమ బహుమతి అని నాకు తెలుసు. అది మేమెలాగూ ఇస్తాం కూడా.     
- రౌనత్
 

మరిన్ని వార్తలు