కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం.. దీపక్‌రెడ్డి!

13 Jun, 2017 00:40 IST|Sakshi
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం.. దీపక్‌రెడ్డి!
కబ్జాలకు భారీ కథలే నడిపిన టీడీపీ ఎమ్మెల్సీ 
- ముస్తఫానగర్‌ వాసులపై హత్య, కిడ్నాప్‌ కేసులు 
రాజీకి రావాలంటే ఒక్కో ఇంటికి రూ.లక్ష డిమాండ్‌ 
 
సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి తాను కన్నేసిన స్థలాన్నల్లా కబ్జా చేయడానికి న్యాయవాది శైలేష్‌ సక్సేనాతో కలసి నడిపిన కథలు అన్నీ ఇన్నీ కావు. భోజగుట్ట స్థలాన్ని కైకర్యం చేసుకోవడానికి ముస్తఫానగర్‌ వాసులపై హత్య, కిడ్నాప్‌ కేసులు సైతం నమోదు చేయించారు. దీపక్‌రెడ్డి, శైలేష్‌లను గత మంగళవారం హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. వీరిని తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఇది భారీ భూ కుంభకోణం కావడంతో పూర్తి వివరాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి లేఖ రాయాలని నిర్ణయించామని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఈ కేసుల ఆరాకై సీసీఎస్‌ అధికారుల్ని సంప్రదిస్తున్నారని తెలిసింది. 
 
నకిలీ యజమానుల మధ్య వ్యాజ్యం..! 
గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో 78.22 ఎకరాలపై కన్నేసిన దీపక్‌రెడ్డి అండ్‌ కో దీన్ని కైవసం చేసుకోవడానికి భారీ కథే నడిపింది. మావూరి శివభూషణంను ఇక్బాల్‌ ఇస్లాంఖాన్‌గా చూపిస్తూ అతడి నుంచి ఆ స్థలం ఖరీదు చేసినట్లు దీపక్‌రెడ్డి జీపీఏ చేయించుకున్నారు. స్థలం పూర్తిగా తన ఆధీనం కావడానికి... ఇక్బాల్‌కు ఓ నకిలీ సోదరినీ రంగంలోకి దింపారు. సదరు స్థలం దీపక్‌రెడ్డికి విక్రయించడంపై తనకు అభ్యంతరం ఉందని ఆమె ద్వారా రంగారెడ్డి జిల్లా కోర్టులో సివిల్‌ పిటిషన్‌ వేయించారు. కొన్ని రోజులు వ్యాజ్యం నడిచిన తర్వాత రాజీ పడతామని ‘అన్నా చెల్లెళ్లు’లోక్‌అదాలత్‌ను ఆశ్రయించగా... సదరు స్థలాన్ని దీపక్‌రెడ్డికి విక్రయించవచ్చంటూ తీర్పు వచ్చింది. దీని ఆధారంగా దీపక్‌రెడ్డి ఆ స్థలాన్ని తన పేరుకి మార్చుకున్నాడు. 
 
ముస్తఫానగర్‌ వాసులకు ముప్పుతిప్పలు
భోజగుట్టలో ఉన్న 78.22 ఎకరాల్లో దాదాపు ఆరు ఎకరాలను ప్రభుత్వం ముస్తఫానగర్‌ వాసులకు కేటాయించింది. దానికి సంబంధిం చి ఈ బస్తీ వాసులకు, దీపక్‌రెడ్డికి మధ్య వ్యాజ్యాలు నడుస్తున్నాయి. వీరందరినీ భయభ్రాంతులతో కేసులు ఉపసంహరించుకునేలా చేయాలని దీపక్‌రెడ్డి, శైలేష్‌ భావించారు. ఇందుకు ఇక్బాల్‌ పాత్రను 2012లో చంపేశారు. సదరు ఇక్బాల్‌ను ముస్తఫానగర్‌ వాసులే హత్య చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయించాలం టూ శైలేష్‌ తండ్రి ప్రకాష్‌ సక్సేనా కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆసిఫ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ముస్తఫానగర్‌ వాసులపై హత్య కేసు సైతం నమోదైంది. తన వాచ్‌మెన్‌ను ముస్తఫానగర్‌ వాసులు కిడ్నాప్‌ చేశారంటూ రెండు నెలల క్రితం తాడిపత్రిలో మరో కేసు నమోదు చేయించారు. 
 
రాజీకి రావాలంటే ...: శివారు ప్రాంతాల్లోనూ ఖరీదైన, ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించే దీపక్‌రెడ్డి అండ్‌ కో వాటికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి, బోగస్‌ వ్యక్తుల్ని వాటికి యజమానులుగా చూపుతుం ది. వారి జీపీఏల ఆధారంగా న్యాయస్థానాల్లో కేసులు వేసి స్థలాల యజమానులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కేసుల భారం భరించలేక ఎవరైనా రాజీకి వస్తే భారీ మొత్తం డిమాండ్‌ చేస్తుంది. బంజారాహిల్స్‌లో ఉన్న స్థలానికి  దాని యజమానికి రూ.10 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సీసీఎస్‌ పోలీసుల విచారణలో తేలింది. భోజగుట్ట వాసులు రాజీ కోరగా... ఒక్కో ఇంటికి రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తేనే ఆలోచిస్తామంటూ దీపక్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. మరోపక్క దీపక్‌రెడ్డి కబ్జా చేసి, తాను ఖరీదు చేసినట్లు రికార్డులు రూపొందించిన బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 లోని 3.37 ఎకరాల స్థలం ఎవరి నుంచి, ఎంతకు ఖరీదు చేశారని ప్రశ్నించగా... తనకు ‘గుర్తులేదు’అని దీపక్‌రెడ్డి  చెప్పాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. 
 
బంజారాహిల్స్‌ కేసులో దీపక్‌రెడ్డి అరెస్టు... 
బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నెం.129/71లోని 3.37 ఎకరాల స్థలానికి సంబంధించిన కేసులో దీపక్‌రెడ్డికి గతంలో న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. సీసీఎస్‌ పోలీసుల అభ్యర్థన మేరకు దీన్ని న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో జ్యుడీషి యల్‌ రిమాండ్‌లో ఉన్న దీపక్‌రెడ్డిని ఈ కేసులో పీటీ వారెంట్‌పై సోమవారం అరెస్టు చేశారు. అలాగే... దీపక్‌రెడ్డితో పాటు శైలేష్‌ సక్సేనా, శ్రీని వాస్‌లను తదుపరి విచారణ నిమిత్తం నాలుగు రోజుల కస్టడీకి అప్పగి స్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. బోగస్‌ డాక్యుమెంట్ల సృష్టికి సంబంధిం చి చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫిర్యాదుతో 2011 లో దీపక్‌రెడ్డిపై అబిడ్స్‌ ఠాణాలో నమోదైన కేసును ఉన్నతాధికారులు తాజాగా సీసీఎస్‌కు బదిలీ చేశారు.
>
మరిన్ని వార్తలు