పదేళ్లకు వీడిన హత్య మిస్టరీ

4 Jan, 2014 04:34 IST|Sakshi

 =చోరీ కేసులో నిందితుల విచారణలో వెలుగులోకి..
 =నలుగురి అరెస్టు

 
 పహాడీషరీఫ్, న్యూస్‌లైన్: చోరీ కేసులో దొంగలను విచారిస్తుండగా సుమారు పదేళ్ల క్రితం జరిగిన ఓ వ్యక్తి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు పాల్పడిన నిందితుల్లో నలుగురిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమాకు చెందిన షేక్ మహమూద్(40), మహ్మద్ ఖాజా (40), మహ్మద్ ఇక్బాల్(36), మహ్మద్ ఖలీల్(45) బండ్లగూడలోని ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తున్నారు.

వీరితో పాటు భార్య హత్య కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న గౌస్ (40), ఫలక్‌నుమాకే చెందిన హఫీజ్, అతని సోదరుడు కలిసి 2004లో కొన్ని చోరీ చేశారు. ఈ క్రమంలోనే జల్‌పల్లి గేట్ సమీపంలోని అన్వర్ పాలిస్టర్ ఇండస్ట్రీస్‌లో 2004లో ఫిబ్రవరిలో వీరు ఇనుప వస్తువులు చోరీలు చేశారు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ చోరీ చేసేందుకు అదే ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ మొదటి అంతస్తులో ఒక వ్యక్తి (28) కనిపించడంతో తమ చోరీ విషయం బయటపెడతాడని భయపడి అతడిని తీవ్రంగా కొట్టారు.

అనంతరం మొదటి అంతస్తు నుంచి కిందకు పడేశారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఏడుగురూ కలిసి రుమాలుతో గొంతు నులిమి చంపేశారు. 2004 ఫిబ్రవరి 27న ఆ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో మృతుడు.. ఆ పాలిస్టర్ కంపెనీలో ఉద్యోగి కాదని తేలింది. దీంతో అతను చోరీకి రాగా ఎవరో హత్య చేసి ఉంటారని భావించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడం ఈ కేసు మూలన పడింది. కాగా, అప్పట్లో నిందితులు చోరీ చేసిన అన్వర్ పాలిస్టర్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఎంహెచ్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌గా మారింది.

డొంక కదిలిందిలా.....!

షేక్ మహమూద్, మహ్మద్ ఖాజాలపై ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్లలో వివిధ నేరాలపై కేసులు ఉన్నాయి. కాగా, ఇటీవల పాతబస్తీలో జరిగిన చోరీల్లో నిందితులను గుర్తించేందుకై దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కేవీ సూర్యప్రకాష్ రావు నేతృతంలోని బృందం పాతదొంగలను విచారించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే షేక్ మహమూద్, మహ్మద్ ఖాజాలను విచారించారు. ఈ సమయంలోనే 2004లో పాలిస్టర్ కంపెనీలో ఓ వ్యక్తిని హత్య చేసినట్టు బయటపెట్టారు.

దీంతో పోలీసులు జైలులో ఉన్న గౌస్‌ను విచారించినా అదే విషయాన్ని వెల్లడించారు. నిందితులు చెప్పిన వివరాలు, హత్య జరిగినప్పటి వివరాలను పోలీసులు పరిశీలించగా వాస్తవమేనని తేలింది. దీంతో పోలీసులు షేక్ మహమూద్, మహ్మద్ ఖాజా, మహ్మద్ ఇక్బాల్, మహ్మద్ ఖలీల్‌ను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మరో వ్యక్తి జైలులో ఉండగా...మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ జియాకు రివార్డ్‌ను అందజేస్తామని టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సూర్యప్రకాష్‌రావు తెలిపారు.
 
నేరాలు చేసే వారికి ఇదో గుణపాఠం: ఇన్‌స్పెక్టర్
 
తప్పు చేసి తప్పించుకొని తిరగవచ్చని భావించే వారికి ఈ ఘటన గుణపాఠంలాంటిదని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. 2004లో హత్య చేసి ఇన్నాళ్ల పాటు నిందితులంతా తప్పించుకొని తిరిగారన్నారు.
 

మరిన్ని వార్తలు