నెల రోజుల్లో పెళ్లి.. యాంకర్ ఆత్మహత్య

17 Mar, 2016 10:23 IST|Sakshi
నెల రోజుల్లో పెళ్లి.. యాంకర్ ఆత్మహత్య

- అనారోగ్యంతోనే అంటున్న కుటుంబ సభ్యులు
- వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
 
హైదరాబాద్:
జెమిని మ్యూజిక్ టీవీ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం నగరంలోని రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కాగా, యువతి ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని కుటుంబీకులు చెపుతుండగా.. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా సోమల మండలం మల్లేశ్వరపురానికి చెందిన రాధాకృష్ణ, వసంతమ్మలకు ఇద్దరు సంతానం. కుమారుడు మహేష్‌కుమార్ బెంగళూరులోని ఎస్‌బీఐలో పనిచేస్తుండగా కుమార్తె నిరోష(23) హైదరాబాద్‌లో నివసిస్తోంది.

గతంలో కొన్ని న్యూస్ చానళ్లలో రిపోర్టర్‌గా పనిచేసిన నిరోష ఎనిమిది నెలలుగా జెమిని మ్యూజిక్ చానల్‌లో విధులు నిర్వర్తిస్తోంది. 10 నెలలుగా సికింద్రాబాద్ పీజీ రోడ్ సింధీ కాలనీలోని దేవి ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. ఇటీవలే నిరోషకు కెనడాలో వ్యాపారం చేసే రిత్విక్ అనే యువకుడితో పెద్దలు వివాహం నిశ్చయించారు. జూన్‌లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి 9.30 గంటలకు హాస్టల్‌కు వచ్చిన నిరోష.. 9.45 గంటలకు డైనింగ్ హాల్ నుంచి భోజనం తన గదికి తెచ్చుకుంది. 10.30 గంటలకు తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడింది. కాబోయే భర్త రిత్విక్‌తో 11 గంటలకు ఫోన్‌లో మాట్లాడుతూ మధ్యలోనే కట్ చేసింది. ఆ తర్వాత చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని నిరోష ఆత్మహత్యకు పాల్పడింది.
 
రిత్విక్ సమాచారంతో వెలుగులోకి..
నిరోష ఫోన్‌లో అనుమానాస్పదంగా మాట్లాడటం, మధ్యలోనే ఫోన్ కట్ కావడంతో రిత్విక్‌కు అనుమానం వచ్చింది. వెంటనే బంజారాహిల్స్‌లో ఉండే బంధువు మోహన్‌బాబుతో పాటు నేరెడ్‌మెట్‌లో ఉండే నిరోష స్నేహితురాలు శ్రేయకు సమాచారం అందించారు. మోహన్‌బాబు, తన తండ్రితో కలసి శ్రేయ హుటాహుటిన హాస్టల్‌కు చేరుకుని ఆమె గదికి వెళ్లి తలుపులు పగులగొట్టారు. అయితే అప్పటికే నిరోష చనిపోయి కనిపించారు. రాంగోపాల్‌పేట్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిరోష ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వాస్తవానికి నిరోష గదిలో మరో ఇద్దరు యువతులు ఉండేవారు. నెల క్రితమే శ్రావణి అనే యువతి హాస్టల్ ఖాళీ చేసింది. మరో యువతి కీర్తన బంధువులకు అనారోగ్యంగా ఉండటంతో 15 రోజులుగా సాయంత్రం హాస్టల్‌కు వచ్చి, రాత్రి 7 గంటలకు బంధువుల వద్దకు వెళ్లిపోతోంది.
 
కడుపు నొప్పితోనే
నిరోష నాలుగేళ్ల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. చాలా ఆస్పత్రుల్లో చూపించాం. పెళ్లై.. పిల్లలు పుట్టే వరకు ఇలాగే కడుపునొప్పి వస్తుందని వైద్యులు చెప్పారు. కడుపునొప్పి భరించలేకే ఆత్మహత్యకు పాల్పడింది.    
- తండ్రి రాధాకృష్ణ
 
చాలా డల్‌గా కనిపించింది
 నిరోష ప్రతిరోజు హుషారుగా కనిపించేది. కానీ రాత్రి 9.45 గంటలకు భోజనానికి వచ్చినప్పుడు చాలా డల్‌గా కనిపించడంతో ఏమైంది మేడమ్ అని అడిగాను. ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయింది. బంధువులు వచ్చి తలుపులు తెరిచిన తర్వాతే మాకు విషయం తెలిసింది.
- నాగేందర్‌కుమార్ (వంటమనిషి)
 
కడుపు నొప్పే కారణమా?
నిరోష ఆత్మహత్యపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భరించలేని కడుపునొ ప్పి ఉంటే టీవీ ప్రోగ్రామ్‌కు ఎలా వెళ్లివచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆమె ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడింది? రిత్విక్‌తో ఏదైనా గొడవ జరిగిందా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు