రిజిస్ట్రేషన్ మర్నాడే మ్యుటేషన్!

8 Apr, 2016 03:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో భాగంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములకు, ఆ మర్నాడే మండల కార్యాలయంలో తహశీల్దారు మ్యుటేషన్ ప్రక్రియను (రికార్డుల్లో పేర్ల మార్పిడి) పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు భూపరిపాలన విభాగం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల  కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న 8 లక్షల మ్యుటేషన్ దరఖాస్తులను నెలాఖరులోగా క్లియర్ చేయాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు.

అలాగే, మ్యుటేషన్ ప్రక్రియతో పాటు సెక్షన్ 22ఎ ప్రకారం నిషేధిత భూముల వివరాలను నిర్దేశిత నమూనాల్లో (ఫారం 1ఎ నుంచి 1ఇ వరకు) పదిరోజుల్లోగా సమర్పించాలని కోరారు. ఫారం 1ఎ లో.. విక్రయించేందుకు గానీ, రిజిస్ట్రేషన్లు చేసేందుకు కానీ వీల్లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములు, 1బిలో ప్రభుత్వ అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములు, 1సిలో సెక్షన్ 43 కింద రిజిస్టర్ అయిన దేవాదాయశాఖ భూములు, సెక్షన్ 37 ప్రకారం రిజిస్టర్ అయిన వక్ఫ్ భూములు, 1డిలో పట్టణ భూ గరిష్ట పరిమితి(యూఎల్సీ) చట్టం ప్రకారం ప్రభుత్వ అదీనంలో ఉన్న భూములు, 1ఇలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్న భూములు, అవినీతి నిరోధక శాఖ అటాచ్ చేసిన భూములు, పన్నులు చెల్లించని ఆస్తుల వివరాలు, గ్రీన్‌పార్కుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చిన ఖాళీస్థలాల వివరాలను నింపాలని సూచించారు.

భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమాచారం సబ్ రిజిస్ట్రార్ నుంచి ఆన్‌లైన్ ద్వారా నేరుగా తహసీల్దారుకు అందేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్(ఎన్‌ఐసీ) అధికారులను సీసీఎల్‌ఏ ఆదేశించారు.

మరిన్ని వార్తలు