టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షునిగా మైనంపల్లి

21 Apr, 2015 01:02 IST|Sakshi

 సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష పదవికి హన్మంతరావు తరపున మంత్రులు కేటీఆర్, మహమ్మూద్ అలీలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ పదవికి మిగిలిన వారెవరూ పోటీకి రాకపోవటంతో హ న్మంతరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో రెండు మార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన హన్మంతరావు గత ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు.
 
 జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం
 త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే తన లక్ష్యమని హన్మంతరావు ప్రకటించారు. అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం ఆయన్ను మంత్రులు కేటీర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాసయాదవ్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రులు మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగురవేసే దిశగా హన్మంతరావు ఆధ్వర్యంలో శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షునిగా ఎన్నికైన హన్మంతరావు మాట్లాడుతూ గ్రేటర్‌లో అన్ని వర్గాలను కలుపుకు పోయి అన్ని వార్డులు, డివిజన్లలో పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల్లో విజయం సాధించే లక్ష్యంతో పనిచేస్తామని, తనపై కేసీఆర్ ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని ప్రకటించారు.

 ప్లీనరీ తర్వాత కార్యవర్గం:  పార్టీ ప్లీనరి ముగిసిన అనంతరం గ్రేటర్ కార్యవర్గాన్ని విస్తరించనున్నారు. కార్యవర్గం మొత్తం 52 మందికి మించకుండా నియామకాలు చేయనున్నారు. అందులో ముగ్గురు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు చొప్పున ప్రచార, సహాయ కార్యదర్శులతో పాటు 27 మంది కార్యవర్గ సభ్యులను నియమిస్తారు.
 

మరిన్ని వార్తలు