కోరిక తీర్చనందుకే బాలిక హత్య

22 Aug, 2015 00:31 IST|Sakshi
కోరిక తీర్చనందుకే బాలిక హత్య

చాంద్రాయణగుట్ట: భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన 12 ఏళ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. కోరిక తీర్చనందుకే మృతురాలి ఇంటి సమీపంలో ఉండే యువకుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసిన భవానీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పురానీహవేళీలోని పాత కమిషనరేట్ కార్యాలయంలో సిటీ పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన నజ్మల్ హుస్సేన్, నసీం బేగం కుమార్తె హుదా బేగం(12) ఈ నెల 11వ తేదీన మాంసం తెచ్చేందుకు బయటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 12వ తేదీ భవానీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారు కేసు నమోదు చేసుకుని బాలిక ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 14వ తేదీ అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి సంప్‌లోని దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు మృతదేహాన్ని వెలికి తీసి మృతురాలు హుదాబేగంగా గుర్తించి, హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న డీసీపీ వి.సత్యనారాయణ వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా 11వ తేదీ రాత్రి మాంసం తీసుకుని ఇంటికి తిరిగి వెళుతున్న హుదా బేగాన్ని ఓ యువకుడు అనుసరించడాన్ని గుర్తించారు. ఈ వీడియోను బస్తీ వాసులకు చూపగా వారు నిందితుడిని గుర్తించలేకపోయారు. అయితే అదేరోజు సాయంత్రం గౌలిపురా మార్కెట్‌లో ఉన్న ‘మాత వైన్స్’ వద్ద మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తి వేసుకున్న చొక్కా... బాలికను వెంబడించిన యువకుడి చొక్కా ఒకేలా ఉన్నట్లు గుర్తించి ఆ వీడియోను బస్తీ వాసులకు చూపించగా అతను సయ్యద్ షౌకత్ కుమారుడు దస్తగిర్(22)గా గుర్తించారు. పోలీసులు తన కొరకు గాలిస్తున్నట్లు తెలుసుకున్న దస్తగిర్ కర్ణాటక కు పారిపోయాడు. పోలీసులు అక్కడికి వెళ్లగా అతను నగరానికి తిరిగి రావడంతో శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడితో పాటు మద్యం కొనుగోలు చేసిన యువకుడిపై కూడా పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.

 కోరిక తీర్చనందుకే..
 హుదాబేగం ఇంటి సమీపంలో నివసిస్తున్న దస్తగిర్ ఆమెపై ఎప్పటి నుంచో కన్నేశాడు. ఈ క్రమంలో 11వ తేదీ మాంసం తీసుకొని ఇంటికి వస్తుండగా ఆమెను వెంబడించి నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి లాక్కెళ్లాడు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో ఎవరైనా చూస్తారన్న భయంతో చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని  సంప్‌లో పడేసినట్లు కమిషనర్ వివరించారు.  సమావేశంలో డీసీపీ సత్యనారాయణతో పాటు అదనపు డీసీపీ కె.బాబురావు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసారావు తదితరులు పాల్గొన్నారు.
 
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: కమిషనర్.
 ప్రతి 50 మీటర్లకు ఒకటి చొప్ను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి సూచించారు. వ్యాపార సముదాయాలతో పాటు ప్రతి ఇంటి పరిసరాల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవానీనగర్ ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు