ప్రజలకు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'..

16 Jun, 2016 14:40 IST|Sakshi
ప్రజలకు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'..

హైదరాబాద్:
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం పెంచిన వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని ఏపీసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ మాజీ సభ్యుడు డా.ఎన్. తులసిరెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2019 ఎన్నికల్లో కేంద్రలోని ఎన్డీఏ ప్రభుత్వం 'ముక్త భారత్', టీడీపీ ప్రభుత్వం 'ముక్త ఆంధ్రా'గా మారక తప్పదని, ప్రజలు 'అచ్చేదిన్ బదులు చచ్చేదిన్'లను చవిచూస్తున్నారని ఆయన హెచ్చరించారు. ఇందిరాభవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యానాయక్ తో కలిసి పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు వారాల్లో నాలుగు సార్లు పెంచడం దారుణమన్నారు. మన దేశ అవసరాలలో దాదాపు 75 శాతం వరకు పెట్రోలు, డీజిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2013లో అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 140 డాలర్లుగా ఉన్నప్పుడు దేశంలో పెట్రోలు ధర రూ.60, డీజిల్ ధర రూ.50 ఉండేదన్నారు.ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 49.29 డాలర్లు ఉంది. ఆ ప్రకారం ఇక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.22, డీజిల్ ధర రూ.18 గా ఉండాలని కానీ, మోదీ, చంద్రబాబుల జోడీ పాలనలో పెట్రోలు ధర రూ.70, డీజిల్ ధర రూ.60లుగా ఉండటం విడ్డూరమన్నారు. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య దళారీలుగా వ్యవహరించడమేనని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఆరుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. చంద్రబాబు ప్రభుత్వం 2015 మార్చి 1 నుంచి నాలుగు రూపాయల వ్యాట్ అదనంగా విధించి ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. దీని ద్వారా గత రెండేళ్లలో మోదీ, బాబు ప్రభుత్వాలు దాదాపు రూ.3 లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకున్నారని మండిపడ్డారు. మోదీ, బాబు ప్రభుత్వాలు అదనంగా విధించిన ఎక్సైజ్ సుంకాన్ని, వ్యాట్ లను ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా