ఒత్తిళ్లకు తలొగ్గవద్దు..

28 Sep, 2016 04:02 IST|Sakshi
ఒత్తిళ్లకు తలొగ్గవద్దు..

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో నాలాలపై అక్రమంగా వెలిసిన కట్టడాల కూల్చివేతను కొనసాగించాలని.. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని జీహెచ్‌ఎంసీ అధికారులను పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. నాలాలపై ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన సూచనలను, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపు పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్‌రావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు బి.జనార్దన్‌రెడ్డి, చిరంజీవులు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి నవీన్‌మిట్టల్ తదితరులతో భేటీ అయ్యారు.

వర్షాలతో నగరంలో ఏర్పడిన పరిస్థితులను జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రికి వివరించారు. నగరంలో తక్షణమే రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని కేటీఆర్ ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైన సహకారాన్ని జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం అందిస్తుందని.. ఇతర శాఖల్లోని ఇంజనీర్లను తాత్కాలికంగా జీహెచ్‌ఎంసీకి కేటాయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 30 మంది ఇంజనీర్లను జీహెచ్‌ఎంసీకి డిప్యుటేషన్‌పై పంపాలని వివిధ ఇంజనీరింగ్ శాఖల అధిపతులను సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఆ ఇంజనీర్లను సర్కిళ్ల వారీగా నియమించుకుని.. బుధవారం నుంచే నగరంలో రోడ్ల మరమ్మతు పనులకు వినియోగించుకోవాలని సూచించారు. రోడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలన్నారు.  
 
కూల్చివేతలపై కేసీఆర్ ఆరా
హైదరాబాద్ నగరంలో నాలాలను ఆక్రమించి, నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం పురోగతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలోనే కేటీఆర్‌కు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయవద్దని సూచించారు. కూల్చివేతల వివరాలను రోజువారీగా తనకు పంపించాలని ఆదేశించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులుతో సైతం కేసీఆర్ మాట్లాడి కూల్చివేతల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు