‘నాలా’ నిబంధనతో అసలుకే మోసం!

5 Jul, 2015 23:44 IST|Sakshi
‘నాలా’ నిబంధనతో అసలుకే మోసం!

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి చేసినందుకు రెవిన్యూ శాఖకు ‘నాలా’ చార్జీలు చెల్లించాలనే నిబంధన ఇప్పుడు హెచ్‌ఎండీఏ ఆదాయానికి గండికొడుతోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టబోయే రియల్టర్లు హెచ్‌ఎండీఏ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే..తప్పకుండా ‘నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్)’ చార్జీలు చెల్లించాలని నిబంధన విధించడంతో వారు వెనక్కు తగ్గుతున్నారు. ఫలితంగా హెచ్‌ఎండీఏ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే దాదాపు రూ.100 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.                  
 
 
సిటీబ్యూరో: కొత్త లే అవుట్స్‌కు పర్మిషన్ పొందాలంటే తప్పనిసరిగా ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్-ఎన్‌ఏఎల్‌ఏ-కన్వర్షన్) చార్జీలు చెల్లించాలన్న నిబంధనే హెచ్‌ఎండీఏ కొంప ముంచింది. ఈ నిబంధన వల్లే సుమారు రూ.100 కోట్ల ఆదాయం సంస్థకు అందకుండా పోయిందని ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త లేఅవుట్‌కు అనుమతివ్వాలంటే వ్యవసాయ భూమిని నివాస వినియోగ భూమిగా మార్చడానికి ఎకరానికి 10 శాతం చార్జీ చెల్లించాలని గతంలో ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే... దీన్ని హెచ్‌ఎండీఏలో పక్కాగా అమలు చేయలేదు. ఈ కారణంగా ఇప్పటివరకు రెవిన్యూ శాఖకు రూ.1000 కోట్ల వరకు ఆదాయం అందకుండా పోయిందన్న విషయం తేలడంతో హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీ మిశ్రా లోతుగా దీనిపై అధ్యయనం చేసి ఇకపై కొత్త లే అవుట్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు. నాలా యాక్టు- 2006 ప్రకారం  రెవెన్యూ శాఖకు ఎకరానికి 10 శాతం ‘నాలా చార్జీ’ చెల్లించి ఆర్డీఓ నుంచి ఎన్‌ఓసీ తీసుకువచ్చాకే కొత్త లే అవుట్స్‌కు పర్మిషన్లు ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ తాజా నిర్ణయం ఇటు ప్లానింగ్ విభాగం అధికారులకు, అటు రియల్టర్లకు మింగుడుపడడం లేదు.

ఇప్పటికే 100 ఫైళ్లకు (దరఖాస్తులకు) అప్రూవల్ ఇస్తూ హెచ్‌ఎండీఏ డీసీ (డెవలప్‌మెంట్ చార్జెస్) లెటర్లు జారీ చేసింది. అయితే... దరఖాస్తుదారులు ఫీజును చెల్లించేందుకు ముందుకు రాగా నాలా చార్జి చెల్లించాల్సిందేనని మెలికపెట్టడంతో వారంతా వెనుదిరిగారు. ఇదే అదనుగా భావించి ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్న మరో 100 ఫైళ్లను కూడా సిబ్బంది పరిష్కరించకుండా పక్కకు పడేశారు. దీంతో దాదాపు200 ఫైళ్ల వరకు పెండింగ్‌లో పడిపోయాయి. ఫలితంగా గడచిన 2 నెలల వ్యవధిలో హెచ్‌ఎండీఏ ఖజానాకు జమ కావాల్సిన సుమారు రూ.100 కోట్లు అందకుండా పోయాయని సిబ్బంది పేర్కొంటున్నారు.
 
సంస్థకే నష్టం
 ఇప్పటివరకు పట్టించుకోని నాలా చార్జీల నిబంధనను ఇప్పుడు తెరపైకి తేవడం వల్ల హెచ్‌ఎండీఏకే నష్టం వాటిల్లుతోంది తప్ప ప్రభుత్వానికి ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని ప్లానింగ్ విభాగం అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు మొదట టెక్నికల్ అప్రూవల్ ఇస్తూ,  భవన నిర్మాణ సమయంలో మాత్రం నాలా చార్జీలు స్థానిక సంస్థలకు చెల్లించి ఎన్‌ఓసీ తెచ్చుకోవాలని సూచించేవారు. ఇప్పుడు కొత్త కమిషనర్ ఆదేశాల వల్ల రెవిన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకురాని వారికి పర్మిషన్లు నిలిపేశామంటున్నారు. కాగా రియల్టర్లు మాత్రం కోర్టు నుంచి అనుమతి తీసుకువచ్చి పర్మిషన్లు పొందుతున్నారు.
 
మా వల్ల కాదు: రియల్టర్లు

 మాస్టర్ ప్లాన్ ప్రకారం భూ వినియోగ మార్పిడి కింద తాము ఇప్పటికే చార్జీలు చెల్లించామని, మళ్లీ నాలా పేరుతో అదనపు భారం మోపడం ఎంతవరకు సమంజసమని రియల్టర్లు ప్రశ్నిస్తున్నారు. అసలే రియల్ మాంద్యం, పెరిగిన ఖర్చులతో సతమతమవుతుండగా నాలా చార్జీలు మరింత భారం అవుతున్నాయని వాపోతున్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు