ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారం

25 Aug, 2017 02:22 IST|Sakshi
ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కారం

యువత, మహిళా సాధికారతకు చేస్తున్న కృషికి గుర్తింపుగానే...

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక నారీ ప్రతిభా పురస్కారాన్ని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. యువత, మహిళా సాధికారత కోసం కృషి చేసినందుకుగాను ఆమెను కేంద్ర మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌(ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వశాఖ, విమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి. కవితకు విమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అసోసియేషన్‌ ఇండియా చైర్‌పర్సన్‌ డాక్టర్‌ టి.వసంతలక్ష్మి గురువారం హైదరాబాద్‌లో అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె హాజరుకాలేకపోవడంతో ఎంఎస్‌ఎంఈ మంత్రి కల్రాజ్‌ మిశ్రా ఆదేశాలతో వసంత లక్ష్మి హైదరాబాద్‌కు వచ్చి ఈ అవార్డును అందజేశారు.

మొదటిసారి ప్రవేశపెట్టిన నారీ ప్రతిభా పురస్కార్‌–2017ను ఎంపీ కవితతోపాటు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహం అందుకున్నారు. వీరితోపాటు తెలంగాణ ‘షీ’టీమ్స్‌ బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్‌ అధికారి స్వాతి లక్రా కూడా అవార్డు అందుకున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని వసంత లక్ష్మి ఎంపీ కవితను ప్రశంసించారు.  నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉద్యోగ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్నారన్నారు. సమాజాన్ని చైతన్యపరుస్తూనే యువత స్వశక్తితో ఎదిగేలా చేసి సమాజాన్ని చైతన్యపర్చడంలో ఐకాన్‌గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో  జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సీఏవో డాక్టర్‌ జగన్మోహన్‌రావు, సీఈవో అబ్దుల్‌ బాసిత్, జాగృతి రాష్ట్ర ప్రధానకార్యదర్శి నవీన్‌ ఆచారి పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా