ఆమెకు అనారోగ్యం...

19 Jan, 2018 00:57 IST|Sakshi

రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు

రాష్ట్రంలో 56 శాతం మంది బాధితులే

గర్భిణుల్లో 49 శాతం మంది  

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

ప్రభుత్వ పథకాల ప్రభావం నిల్‌

పూర్తిగా అందని ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు

రక్తం పంచిచ్చే అమ్మ.. రక్తం పంచుకుని పుట్టే చెల్లెమ్మ.. అదే రక్తం కరువై అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే ఆడపిల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది.  చిన్నారులనూ రక్తహీనత ముప్పుతిప్పలు పెడుతోంది.  ఇదీ మన దేశ సగటు మహిళ పరిస్థితి. తాజాగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇలాంటి చేదు నిజాలెన్నో బయటపడ్డాయి.


సాక్షి, హైదరాబాద్‌: పురుషులతో పోల్చితే మహిళలే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలింది. చిన్నప్పటి నుంచే మహిళల్లో ఈ సమస్య ఉంటోందని వెల్లడించింది. ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళల్లో రక్తహీనత సమస్య ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఈ విషయాలను తేల్చింది.

మన రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఎక్కువ మంది రక్తహీనత బాధితులున్నారు. గ్రామీణ ప్రాంతంలోని ప్రతి 100 మంది మహిళల్లో 58 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ సమస్య ఉన్న వారు 55 శాతం మంది ఉన్నారు.

సంప్రదాయ పద్ధతులే కారణం..!
మన దేశంలోని సంప్రదాయ పద్ధతులే మహిళల్లో రక్తహీనతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రక్తహీనత సమస్య మహిళల ఆరోగ్యంపై జీవిత కాలం ప్రతికూల ప్రభావం చూపుతోంది. వయసుకు తగ్గ పొడవు, బరువు పెరగట్లేదు. దీంతో వయసుకు తగ్గట్లు శరీరంలో మార్పులు రావట్లేదు.

రక్తహీనత సమస్య ఓసారి వచ్చాక అధిగమించడం కష్టంగా పరిణమిస్తోంది. పౌష్టికాహారం తీసుకోకపోవడంతోనే ఎక్కువగా ఈ సమస్య వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తీసుకునే ఆహారానికి, చేసే పనికి చాలా తేడా ఉంటోంది. సరిపడా ఆహారం తీసుకోకపోవడంతో పాటు విరామం లేకుండా పని చేయడం వల్లే ఎక్కువ మంది మహిళలను రక్తహీనత వెంటాడుతోంది.

చర్యలు అంతంత మాత్రమే..
మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య అంశాల్లో రక్తహీనత అతిపెద్ద సమస్య. దీని పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రంగానే ప్రభావం చూపుతున్నాయి. రక్తహీనత సమస్య నివారణకు మన రాష్ట్రంలో ఏటా రూ.20 కోట్ల విలువైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇవి ఎటూ సరిపోవట్లేదనే అభిప్రాయం ఉంది. గర్భిణులకు మాత్రమే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మాత్రలను పంపిణీ చేస్తోంది.

గర్భం దాల్చిన 6 నెలల వరకు, ప్రసవం తర్వాత 6 నెలల వరకు కచ్చితంగా ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ మందులు అందట్లేదు. వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ఏడాది పాటు ఈ మందులు తీసుకునే మహిళలు 30 శాతానికి మించట్లేదు. దీంతో రక్తహీనత సమస్య బాధితులు ఎక్కువగా ఉంటోంది.

బాలికల్లోనూ..
భవిష్యత్‌ తరం ఆరోగ్య పరిస్థితీ ఇలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో అయితే రక్తహీనత సమస్య ఆందోళనకరంగా ఉంది. ప్రతి 100 మంది చిన్నారుల్లో 60 మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భం దాల్చని మహిళలతో పోల్చితే ప్రసవం జరిగిన మహిళల్లో రక్తహీనత కాస్త ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది.

మరిన్ని వార్తలు