ఆదిలోనే అంతం చేద్దాం!

16 Sep, 2017 02:18 IST|Sakshi
ఆదిలోనే అంతం చేద్దాం!

దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, చికిత్సకు ప్రత్యేక కార్యాచరణ
కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే ఏర్పాట్లు
బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ


సాక్షి, హైదరాబాద్‌:

పేదల జీవితాలను, కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, చికిత్సపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. కేన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, బీపీ.. వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఆరంభంలోనే గుర్తించి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులతో కేన్సర్, మధుమేహం, గుండె జబ్బుల నియంత్రణ జాతీయ కార్యక్రమం(ఎన్‌పీసీడీసీఎస్‌) పేరుతో ఈ కార్యక్రమం అమలవుతోంది. జనగామ, పెద్దపల్లి, సిద్ధిపేట, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో దీనిని అమలు చేస్తున్నారు. కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలను ఈ కార్యక్రమంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

1.23 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు
జనగామ, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో కలిపి ఇప్పటికే 1.23 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి చికిత్స అవసరమైన వారిని గుర్తించారు. ఆందోళనకరంగా మధుమేహం, హైపర్‌ టెన్షన్‌(బీపీ) బాధితులు ఎక్కువ మంది ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. కేన్సర్‌ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె జబ్బులకు సంబంధించి ముందస్తుగా గుర్తించే పరిస్థితి లేకపోవడం చికిత్స అందించేందుకు అడ్డంకిగా మారుతోందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.

అవగాహన కార్యక్రమాలు
వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, ఇతర అంటు వ్యాధుల చికిత్స కోసం వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో చికిత్సలు అందుతున్నాయి. ఇలాంటి వ్యాధుల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో దీర్ఘకాలిక వ్యాధుల(అంటురోగాలు కానివి)కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశంలో కేన్సర్, మధుమేహం, గుండె జబ్బుల బాధితులు పెరుగుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స పెద్ద సమస్యగా ఉంటోంది. వ్యాధులను గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల ఎంత ఖర్చు చేసినా ఫలితం ఉండడంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం ఎన్‌పీసీడీసీఎస్‌ కార్యక్రమం మొదలుపెట్టింది.


అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బందికి శిక్షణ
ఎన్‌పీసీడీసీఎస్‌ కార్యక్రమంలో మొదట అన్ని స్థాయిల్లోని వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అనంతరం సిబ్బంది గ్రామాలకు వెళ్లి ప్రజల వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితులను సేకరిస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల వివరాలను నమోదు చేస్తారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు సమీపంలోని వైద్య కేంద్రాలకు తీసుకువచ్చి రెండో స్థాయి పరీక్షలను నిర్వహిస్తారు. వ్యాధుల తీవ్రత మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధన ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు.

ఇప్పటికే 9 జిల్లాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపిన వారి సంఖ్య        1.23 లక్షలు
బీపీ ఉన్నవారి సంఖ్య                                                      7,760
మధుమేహం ఉన్నవారి సంఖ్య                                         9,084
బ్రెస్ట్‌ కేన్సర్‌ఉన్నవారి సంఖ్య                                                 253
నోటి కేన్సర్‌ఉన్నవారి సంఖ్య                                                 886.

మరిన్ని వార్తలు