సహజ రంగులు వాడేలా చర్యలు

29 Apr, 2016 01:45 IST|Sakshi
సహజ రంగులు వాడేలా చర్యలు

* గ్రేటర్ అధికారులకు హైకోర్టు ఆదేశం
* తయారీదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించండి
* ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించండి
* వినాయక చవితికి ముందే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయండి
* దీనిపై ఓ కార్యాచరణ ప్రణాళికను మా ముందుంచండి
* విచారణ జూన్ 4కు వాయిదా

సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాలకు కృత్రిమ రంగుల స్థానంలో సహజ రంగులను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులను ఆదేశించింది.

విగ్రహాల తయారీదారుల వద్దకు వెళ్లి వారికి సహజ రంగుల పట్ల అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వారికి వివరించాలంది. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు బంకమట్టిని ఉపయోగించేలా చూడాలంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగుల వినియోగం వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాల గురించి పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని గ్రేటర్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియనంతా కూడా వినాయక చవితికి ముందే పూర్తి చేయాలంది.

ఈ విషయంలో గణేష్ ఉత్సవ సమితులతో చర్చించి, వారు కూడా సహకరించేలా చూడాలంది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.
 
అన్ని చోట్లా భారీ విగ్రహాలు వద్దు
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ, విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ఎన్‌క్లోజర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 అడుగులకు మించి విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఒకటి రెండు చోట్లు భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పు లేదని, అయతే ఒకరిని చూసి మరొకరు ఎత్తుపై పోటీపడుతూ అన్ని చోట్ల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏ మాత్రం అమోదయోగ్యం కాదంది.

ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, విగ్రహాలకు సహజ రంగులు ఉపయోగించే విషయంలో ప్రభుత్వం నిధులు జారీ చేసిందన్నారు. ఈ సమయంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ స్పందిస్తూ, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు