ప్రకృతి సాగే రైతుకు అండ

19 Dec, 2016 03:03 IST|Sakshi
ప్రకృతి సాగే రైతుకు అండ

‘సాగుబడి’ పుస్తకావిష్కరణలో జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌: ప్రతి రైతు రసాయన ఎరువులకు దూరంగా ఉండి ప్రకృతి సాగుబడి చేస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సాక్షి దినపత్రిక సాగుబడి డెస్క్‌ ఇన్‌చార్జి పంతంగి రాంబాబు రాసిన ‘సాగుబడి’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి, సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రసాయనిక ఎరువులొచ్చి పల్లెల్లో ఊర పిచ్చుకలను చంపేశాయని, అలా పల్లెల్లో సాగు దెబ్బ తిన్నదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.

ప్రపంచీకరణ ఫలితంగా మన దేశంలో ప్రకృతి నుంచి దూరమైన వ్యవసాయాన్ని తిరిగి ప్రకృతి ఒడిలోకి చేర్చేందుకు తెలుగులోకి వచ్చిన పుస్తకంగా ‘సాగుబడి’ని కొనియాడారు. ప్రకృతి సాగుకు ప్రభుత్వ సహకారం ఉంటుందని చెప్పారు. రైతులు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే అప్పుల బాధతో ఏ రైతూ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరముండదని ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం ప్రకృతి సాగును ప్రోత్సహించి ఒక ఉద్యమంలా చైతన్యపరిస్తేనే సత్ఫలితాలుంటాయని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, నాబార్డ్‌ మాజీ సీజీఎం మోహనయ్య, బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి చంద్రమోహన్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు