నయీమ్.. నాట్ ఏ జోక్

12 Aug, 2016 03:24 IST|Sakshi
నయీమ్.. నాట్ ఏ జోక్

* సెటిల్మెంట్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో దిట్ట
* డబ్బులు వసూలు చేయాల్సిన వ్యక్తుల పూర్తి సమాచారం సేకరణ
* చంపడం కిరాతకంగానే.. కానీ సెటిల్మెంట్లు మాత్రం చాలా సాఫ్ట్‌గా..
* ‘అన్నా’ అని సంబోధిస్తూనే తనకు కావాల్సింది రాబట్టుకునే నైజం
* వినకపోతే చితకబాదడం.. అవసరమనుకుంటే లేపేయడమే..

సాక్షి హైదరాబాద్: నయీమ్.. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ఈ పేరు చాలా కాలంగా అండర్ వరల్డ్ మాఫియాలో సుపరిచితమైందే. విప్లవ పార్టీ నేపథ్యం నుంచి వచ్చిన అతడు గ్యాంగ్‌స్టర్‌గా మారి పోలీసులకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.

ఈ మాఫియా డాన్ నైజమే చాలా ప్రత్యేకమైనదని, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఏ కేసును ఎలా డీల్ చేయాలో అతడికి వెన్నతో పెట్టిన విద్య అని గతంలో జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. తన ప్రత్యర్థులను హతమార్చడంలో ఆయన  చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. కానీ, సెటిల్మెంట్ల విషయంలో మాత్రం నయీమ్ చాలా సాఫ్ట్‌గా డీల్ చేస్తాడు. డబ్బులు వసూలు చేయాలన్నా, వివాదాలు సెటిల్ చేయాలన్నా ఆయన అనుచరుల నుంచీ అందరూ పకడ్బందీగానే వ్యవహరిస్తారు. నయీమ్‌ను కలవాలని ఎవరూ అనుకోరు కానీ.. కలిసే పరిస్థితి వస్తే మాత్రం ఆయన చెప్పినట్టు చేయాల్సిందే.

అందుకు తగిన సరంజామాను సిద్ధం చేసుకుని అలా చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తాడు. కళ్లు తెరిచి చూసే లోపు ఆయుధాలతో ఉన్న సుశిక్షితులైన అంగరక్షకుల నడుమ నవ్వుతూ పలకరిస్తాడు. చెప్పినట్టు వింటే సరి.. లేదంటే మాత్రం దండన తప్పనట్టే. చితకబాదడం.. అవసరమైతే లేపేయడం.
 
మీకు షుగర్  ఉంది కదా..
ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారా?

నయీమ్ ముఠా చేసిన హత్యలు పైకి కనిపిస్తాయి కాబట్టి ఎంత కిరాతకంగా హత్య చేశాడో అర్థమవుతుంది. కానీ, నయీమ్ అంతర్గతంగా చేసే సెటిల్మెంట్ల గురించి ఆయన బాధితులు, అనుచరులకు మాత్రమే తెలుస్తుంది. ఫలానా వ్యక్తి నుంచి పైసలు వసూలు చేయాలనుకున్నా.. ఏదైనా వివాదం సెటిల్ చేయాలనుకున్నా దాదాపు అనుచరులే కార్యక్రమం పూర్తి చేస్తారు. భాయ్ చెప్పాడు.. అంటూ వెళ్లి భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకుంటారు. కానీ, కీలకమైన వ్యవహారాలను మాత్రం నయీమే స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఆ సెటిల్మెంట్లు చేసేందుకు గాను అవసరమైన వ్యక్తులను నయీమ్ ముఠా సభ్యులు ‘భాయ్’ దగ్గరకు తీసుకెళ్తారు. వెళ్లేటప్పుడు కూడా అర్థం కాకుండా తీసుకెళ్తారు.

గతంలో నయీమ్‌ను కలిసి వివాదాలు సెటిల్ చేసుకున్న, డబ్బులు ఇచ్చిన కొందరు ఇచ్చిన సమాచారం ప్రకారం.. నయీమ్ అసభ్యంగా మాట్లాడడు. బెదిరించడు. అన్నా అని సంబోధించి దగ్గరకు తీసుకుంటాడు. అన్నా.. నిన్ను ఫలానా పని కోసం పిలిపించాను. అంతవరకు చేయి.. నీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా అని భరోసా ఇస్తాడు. ఆ తర్వాత కూడా సెటిల్ కాకపోతే సదరు వ్యక్తులకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి.? అవి ఎంత విలువ ఉంటాయి? ఈ మధ్య కాలంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఆ వ్యక్తి జరిపిన లావాదేవీలేంటి? అనే వివరాలను డాక్యుమెంట్లతో సహా ఉంచుతాడు. కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? అనే విషయాలను కూడా చెప్పి వారి యోగక్షేమాల గురించి ఆరా తీస్తాడు.

ఎందుకన్నా.. రోజులు బాగాలేవు.. ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో నీ కొడు కో.. కూతురో ఉంటే పరిస్థితేంటి? అని సినీఫక్కీలో హెచ్చరిస్తాడు. సెటిల్మెంట్ల విషయంలో నయీమ్ ఎంత పకడ్బం దీగా ఉంటాడంటే.. సెటిల్మెంట్ చే యాల్సిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను పూర్తిగా తెలుసుకుంటాడు. ఎంతగా అంటే.. ‘అన్నా నీకు షుగర్ ఉంది కదా.. నువ్వు ఫలానా టాబ్లెట్ వేసుకుంటావు.. ఆ టాబ్లెట్ తెచ్చుకున్నావా.. లేదంటే నా దగ్గర ఉంది ఇస్తాను ’ అని కూడా చెప్తాడంటే నయీమ్ ఎంత పకడ్బందీగా ఉంటాడో ఇట్టే అర్థమవుతుంది. అయితే, మాట వినకపోతే మాత్రం విశ్వరూపం చూపిస్తాడని బాధితులు వాపోతున్నారు.
 
మాఫియా సామ్రాజ్య విస్తరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారిన పరిస్థితుల్లో నయీమ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే వెళ్లాడ ని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.  కొన్నాళ్లుగా ఆయన కేరళ స్థావరంగా కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. విదేశాల్లోని కొందరు నేరస్తులతో కూడా సంబంధా లు పెట్టుకున్నాడని, త్వరలోనే దుబాయ్‌కి వెళ్లాలనుకున్నాడని కూడా పోలీ సులు చెబుతున్నారు. ఆయన కోసం గుజరాత్ పోలీసులు వెతుకుతున్నారని, సోహ్రాబుద్దీన్‌తో ఆయనకున్న సంబంధాలపై ఆరా తీస్తున్నారని కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను విస్తరించాడని కూడా సమాచారం.

మరిన్ని వార్తలు