మా భూములు మాకిప్పించండి

13 Feb, 2018 05:04 IST|Sakshi

ప్రభుత్వానికి నయీమ్‌ బాధితుల విజ్ఞప్తి

వీరికి న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌లో సదస్సు

నయీమ్‌ ఆస్తుల స్వాధీనానికి చట్టం తేవాలంటూ సదస్సు డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఆస్తుల స్వాధీనానికి ప్రత్యేక చట్టం తేవాలి. ఆ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించాలి. నష్టపోయిన వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద బడ్జెట్‌ కేటాయించి న్యాయం చేయాలి. వెంటనే నయీమ్‌ బాధితులకు న్యాయం చేయాలి’’అని సోమవారమిక్కడ జరిగిన సదస్సు డిమాండ్‌ చేసింది. వివిధ వామపక్షాల ఆధ్వర్యంలో నయీమ్‌ బాధితులకు న్యాయం చేయాలంటూ ఈ సదస్సును నిర్వహించారు.

‘ఆనాటి నుంచి నేటి సీఎం కేసీఆర్‌ వరకు అందరూ నయీమ్‌ను పెంచిపోషించిన వారే. చివరికి భస్మాసుర హస్తాన్ని తన కుటుంబ సన్నిహితుల మీద ప్రయోగించే సరికి ... తనని తాను కాపాడుకునేందుకే నయీమ్‌ను ఎన్‌కౌంటర్‌ చేయించారు’అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ ఆరోపించారు. నయీమ్‌ సర్కారీ గూండా అని, పోలీసులు–నయీమ్‌ కలసి సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు.

తనను చంపేందుకు మూడుసార్లు రెక్కీ నిర్వహించాడని, కొన్నేళ్ల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకొన్నానని విప్లవ రచయిత వరవరరావు చెప్పారు. ఫిబ్రవరి 27న వరంగల్, మార్చి 7న మహబూబ్‌నగర్, 18న భువనగిరిలో నయీమ్‌ బాధితులను కలుస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. సదస్సులో నయీమ్‌ బాధిత పరిరక్షణ సమితి నాయకులు, వివిధ కమ్యూనిస్టు పక్షాల నాయకులు పాల్గొన్నారు.


జొన్న చేను తగలబెట్టారు..
నీ పొలం నయీమ్‌కు నచ్చింది. రేపు వచ్చి పొలం కాగితాలు ఇచ్చి పైసలు తీసుకో అంటూ భయపెట్టారు. అందుకు నిరాకరించడంతో జొన్న పంటను నా కళ్లెదుటే తగలబెట్టారు. పోలీసులకు చెబితే తామేం చేయలేమన్నారు. ఏడున్నర ఎకరాల్లో 6.5 ఎకరాలను బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. – రామిరెడ్డి, ఇమామ్‌గూడ

చంపుతా అని బెదిరించాడు..
భువనగిరి బస్టాండ్‌ ఎదురుగా ఉన్న 1,700 గజాలను 13 మంది పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. మా తమ్ముళ్లిద్దరినీ చంపుతామని బెదిరించాడు. హైదరాబాద్‌ వచ్చి తలదాచుకున్నాం. మా ఆస్తి మాకు ఇప్పించాలని ముఖ్యమంత్రిని అర్థిస్తున్నా. – వారాల అశోక్, భువనగిరి

బిల్డింగ్‌పై నుంచి తోసేస్తామన్నారు..
మా 13 ఎకరాల 30 కుంటల భూమిని ఇవ్వాలంటూ భయపెట్టారు. వారు ఏం చేసినా పట్టించుకోకుండా ఉన్నందున ఓ రోజు అర్ధరాత్రి నన్ను కిడ్నాప్‌ చేసి పెద్ద బిల్డింగ్‌పైకి తీసుకెళ్లారు. నీ భూమిని రాస్తావా.. ఇక్కడ నుంచి తోసేయమంటావా..? అంటూ బెదిరించి నాతో బలవంతంగా భూమిని రాయించుకున్నారు. – బాపిరెడ్డి, ఇమామ్‌గూడ

వెళ్లిపో.. లేదంటే ప్రాణాలు పోతాయి
నయీమ్‌ బెదిరింపులకు భయపడి భువనగిరిని వదిలిపెట్టి 14 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. కొమ్మయ్‌పల్లి వద్ద రూ.50 లక్షల ప్లాట్‌ ఉంది. ఒకరోజు పేపర్లు తీసుకురా.. మాట్లాడుకుందాం అని చెప్పాడు. పేపర్లు తీసుకెళ్లి చూపించడంతో అవి లాక్కుని ఇక్కడ నుంచి వెళ్లిపో.. లేదంటే ప్రాణాలు పోతాయి అన్నాడు. – పి.హనుమాయగుప్తా, వ్యాపారి, మచ్చుపాడు, జనగాం జిల్లా

రెండేళ్లు దూరంగా ఉన్నా వదల్లేదు
మా ఏడున్నర ఎకరాల భూమిని ఇచ్చేయాలంటూ.. నన్ను నయీమ్‌ దగ్గరకు తీసుకునిపోయారు. ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. నయీమ్‌కి భయపడి వేరే ఊళ్లకు పారిపోయా. దీంతో తమ్ముడ్ని బెదిరించారు. రెండున్నరేళ్ల తర్వాత ఇంటికి వస్తే.. నన్ను, తమ్ముడ్ని రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌కు తీసుకెళ్లి బలవంతంగా భూమిని రిజిస్టర్‌ చేయించుకున్నారు. – ప్రభాకర్‌రెడ్డి, శ్రీనగర్, మహేశ్వరం మండలం.

పూట గడవడం కష్టంగా ఉంది
మాది 7 ఎకరాల 2.6 కుంటల భూమి. దాన్ని నయీమ్‌ బామ్మర్ది ఇచ్చేయమంటూ వేధించాడు. పోలీసులకు చెప్తే మీరే ఏదో తప్పు చేసి ఉంటారన్నారు. చేసేది లేక భూమి ఇచ్చేశాం. రూ.15 లక్షలు ఇస్తామని ఆశ చూపి, డబ్బులు ఇవ్వకుండా వేధించారు. మాకు పూట గడవడం కూడా కష్టంగా ఉంది.      – రామచంద్రరెడ్డి, పెహిల్‌వాన్‌పూర్‌

నా భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు
మా ఊర్లో 750 గజాల్లో ఇల్లు ఉంది. మీ ఇల్లు నయీమ్‌ సర్‌కి నచ్చింది.. ఇచ్చేయాలి.. అంటూ ఆ యన మనుషులు వచ్చి అడిగారు. వారికి మాకూ మధ్య వాగ్వివాదం జరగడంతో నా భర్తని నా కళ్ల ముందే చంపేశారు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పు, లేదంటే నిన్ను, పిల్లల్ని కూడా చంపేస్తామని బెదిరించారు. పోలీసులు కూడా నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.   – వజ్రేశ్వరి, మన్సురాబాద్‌

ముఖ్యమంత్రే కాపాడాలి..
గోకుల్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ నిర్వహిస్తున్న బ్యాంక్‌ని స్వాధీనం చేయమని నయీమ్‌ పట్టుబట్టాడు. లేదన్నందుకు నా భర్త జగదీశ్‌ యాదవ్‌ని కిడ్నాప్‌ చేశాడు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపుతామన్నాడు. చేసేది లేక మూడున్నర కోట్లు ఇచ్చాం. ఆ మొత్తం రికవరీ కోసం పోలీసుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఆ డబ్బులు ఈ–సేవకు చెందినవి. సీఎం కేసీఆర్‌      ప్రత్యేక చట్టం తెచ్చి రూ.3.5 కోట్లును ఈ–సేవకు అందజేసి మమ్మల్ని ఆదుకోవాలి.   –కళావతి, సికింద్రాబాద్, గోకుల్‌ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్, మేనేజర్‌

మరిన్ని వార్తలు