నగరంపై నయీం టెర్రర్!

8 Aug, 2016 23:04 IST|Sakshi
నయీం ఇల్లు(ఇన్ సెట్లో) నయీం

► దారుణ హత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌
► ఐపీఎస్‌ వ్యాస్‌ నుంచి పటోళ్ళ వరకు...
► 2007లో నాంపల్లి కోర్టు నుంచి ఎస్కేప్‌

 

అతడి పేరు చెప్తే హక్కుల సంఘాల నేతలు సైతం ఉలిక్కిపడతారు...అనేక మంది రాజకీయ నాయకులూ హడలెత్తిపోతారు... మాజీ నక్సలైట్లు, మావోయిస్టులకూ కంటి మీద కునుకు ఉండదు... వ్యాపారులు, బడాబాబులైతే అతడి కన్ను తమ మీద పడకూడదని ఆశిస్తుంటారు. లెక్కలేనన్ని హత్యలు, బెదిరింపులతో పాటు  సెటిల్‌మెంట్లు తన ఖాతాలో వేసుకుని మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన నయీముద్దీన్‌ అలియాస్‌ భువనగిరి నయీం వ్యవహారమిది. కరుడుగట్టిన ఈ నేరగాడి పడగ నగరంలోనూ విస్తరించి ఉంది. ఐపీఎస్‌ అధికారి వ్యాస్‌ హత్య నుంచి పటోళ్ళ గోవర్థన్‌రెడ్డి మర్డర్‌ వరకు సిటీలో జరిగిన దారుణ హత్యలకు నయీం కేరాఫ్‌ అడ్రస్‌.    

 

సాక్షి, సిటీబ్యూరో:  కరుడుగట్టిన నేరగాడు నయీముద్దీన్‌ కథలో ఆద్యంతాలు నగరానికి ‘తూర్పు పడమర’ల్లోనే జరిగాయి. సిటీకి తూర్పు దిక్కున ఉన్న నల్లగొండ జిల్లా భువనగిరి నయీం స్వస్థలం.  సమ సమాజ స్థాపన కోసం అంటూ మూడున్నర దశాబ్ధాల క్రితం పీపుల్స్‌ వార్‌లో చేరడం, నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయం అంటూ ప్రకటించడం, కోవర్టుగా మారడం, బెదిరింపుల వరకు బరితెగించడం... ఇలా ప్రతిఘట్టంలోనే సిటీ ‘పాత్ర’ సుస్పష్టం. సుదీర్ఘకాలం పరారీలో ఉండి, పోలీసుల్ని ‘ముప్పతిప్పలు’ పెట్టి ఎట్టకేలకు సోమవారం ఎన్‌కౌంటర్‌లో హతమైన షాద్‌నగర్‌ ప్రాంతం సిటీకి పడమర దిక్కున ఉంది. ఇలా నయీముద్దీన్‌ ‘ఉదయాస్తమానాలు’ నగరానికి తూర్పు, పడమర దిక్కుల్లోనే జరిగాయి.
హత్య చే(యి)స్తే దారుణమే...
నయీం చేసిన అనేక దారుణహత్యల్ని ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో వెలుగులోకి వచ్చిన బెల్లి లలిత అత్యంత దారుణ హత్యతో అతడి పేరు మారుమోగింది. గ్రేహౌండ్స్‌కు ఆద్యుడైన ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్, పౌర హక్కుల నేత పురుషోత్తం, వ్యాపారవేత్త రామకృష్ణ, రివల్యూషనరీ పేట్రియాటిక్‌ టైగర్స్‌ (ఆర్పీటీ) వ్యవస్థాపకుడు, ఘరానా నేరగాడు పటోళ్ల గోవర్థన్‌రెడ్డి... ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాయి. ఈ కేసులకు సంబంధించి అనేక కోర్టుల్లో ఇతడిపై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం నయీం నిందితుడిగా ఉన్న ఐపీఎస్‌ వ్యాస్‌ హత్య కేసు, 2005 నాటి రాజస్థాన్‌ ఆయుధాల కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ రెండు కేసుల్లోనూ మిగిలిన నిందితులపై అభియోగాలు వీగిపోయినా, శిక్షలు పడినా నయీం పరారీలో ఉండటంతో అతడిపై విచారణకు బ్రేక్‌ పడింది.
ఫిర్యాదు చేసేందుకూ హడలే...
ఐపీఎస్‌ వ్యాస్‌ హత్య కేసులో అరెస్టు అయిన నయీం తన పంథా మార్చుకుని నక్సల్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘గ్రీన్‌టైగర్స్‌’ పేరుతో 2000 నవంబర్‌ 23న సరూర్‌నగర్‌ పరిధిలోని మధుపురికాలనీలో ఏపీసీఎల్‌సీ నేత పురుషోత్తమ్‌ను పట్టపగలు దారుణంగా హత్య చేశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరో ఏపీసీఎల్‌సీ నేతనూ కిడ్నాప్‌ చేశాడు. దాదాపు వారం రోజుల పాటు నిర్భంధించి, తీవ్రంగా బెదిరించిన తర్వాత గుండు గీయించి మరీ వదిలిపెట్టాడు. చెర నుంచి బయటకు వచ్చిన ఆయన కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యమూ చేయలేదు. ‘గుండు’ విషయం అడిగితే పుణ్యక్షేత్రాల పేరు చెప్పి ‘తప్పించుకున్నారు’. 
        

మరిన్ని వార్తలు